Seized Drugs Worth Rs 25,000 Cr Belong To Pak-Based Haji Salim: NCB - Sakshi
Sakshi News home page

అమ్మో హాజీ! పాకిస్తాన్‌ అండతో రెచ్చిపోతున్న డ్రగ్‌ కింగ్‌.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్...

Published Tue, May 16 2023 4:56 AM | Last Updated on Tue, May 16 2023 11:10 AM

Haji Salim: All you need to know about Pakistan drug mafia - Sakshi

అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్‌తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్‌ కింగ్‌ హాజీ సలీం జల్సా లైఫ్‌ స్టైల్‌!

శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్‌ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్‌ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్‌ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్‌ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్‌ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు.

మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను మోసుకెళ్తున్న మదర్‌ షిప్‌ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్‌లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది.

పాక్‌ అడ్డాగా...
పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్‌ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్‌ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్‌. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్‌. బలూచిస్తాన్‌లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం.

గమ్మత్తైన సంకేతాలు..
తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్‌ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్‌ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్‌ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్‌ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త.

ఇలా డ్రగ్స్‌ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్‌ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్‌ సముద్ర తీరాల్లో మదర్‌ షిప్‌ నుంచి డ్రగ్స్‌ నింపుకొని రహస్యంగా భారత్‌కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement