most wanted
-
ఎవరీ విక్రమ్‌గౌడ?
విక్రమ్‌గౌడ కుదురేముఖ్ జాతీయ ఉద్యానవనం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. కరావళి ప్రాంతంలో విక్రమ్‌గౌడ, మలెనాడు ప్రాంతంలో ముండగారు లతా బృందం చురుకుగా ఉండేవి. విక్రమ్‌గౌడ ఉడుపి జిల్లా హెబ్రి తాలూకా కూడ్లు నాడ్వాలు గ్రామ నివాసి. మొదట కార్మిక సంఘంలో పనిచేసిన విక్రమ్‌గౌడ ఆ తరువాత నక్సలైట్లలో చేరి అగ్రశ్రేణి నక్సల్‌గా ఎదిగారు. మూడుసార్లు కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకున్నారు. 2016 నుంచి కేరళ అటవీ ప్రాంతాల నుంచి కార్యకలాపాలను నడుపుతున్నారు. ఆయన మృతితో నక్సలైట్ నేతల సంఖ్య తగ్గింది. గతంలో పలువురి అరెస్టులు, లొంగుబాట్లు జరిగాయి.బనశంకరి: కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌వాటెండ్ నక్సలైట్‌గా ఉన్న విక్రమ్ గౌడ ఎన్కౌంటర్లో చనిపోయారు. కర్ణాటకకు చెందిన నక్సల్స్ వ్యతిరేక దళం(ఏఎన్ఎఫ్) పోలీసులు సోమవారం రాత్రి ఉడుపి జిల్లాలో కబ్బినాలే అటవీ ప్రదేశంలో కూంబింగ్‌లో మట్టుబెట్టారు.ఎదురు కాల్పులు...విక్రమ్‌గౌడ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 50 కి పైగా నేరాల్లో మోస్ట్ వాటెండ్‌గా ఉన్నారు. కొద్దిరోజులుగా ఉడుపి ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో ఏఎన్ఎఫ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ జరుపుతున్నారు. ఐదుమంది నక్సలైట్లు నిత్యావసర వస్తువులను కొనడానికి కబ్బినాలెకు వచ్చినట్లు తెలిసి చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి, ఇందులో విక్రమ్‌గౌడ (46) మరణించగా, మిగిలిన నక్సల్స్ పారిపోయినట్లు పోలీసు అధికారులు చెప్పారు.రూ.5 లక్షల రివార్డువిక్రమ్గౌడ, ముండగారు లతా, జయణ్ణ, వనజాక్షి, సుందరి అనేవారు నక్సల్ నేతలు కాగా, వారిపైన ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించింది. గత 20 ఏళ్లు నుంచి నక్సల్ కార్యకలాపాల్లో విక్రమ్‌గౌడ పాల్గొంటున్నాడు. ఆయనపై చిక్కమగళూరు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 50 కి పైగా దాడులు, విధ్వంసం కేసులు ఉన్నాయి.కేరళ నుంచి వచ్చి తూటాలకు చిక్కికేరళలో నక్సల్స్ కార్యకలాపాలు హెచ్చుమీరడంతో అక్కడ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో చాలామంది నక్సల్స్ పొరుగునే ఉన్న ఉడుపి, మంగళూరు జిల్లాల్లోకి వచ్చారు. పశ్చిమ కనుమల్లోని అటవీ గ్రామాల పరిసరాల్లో తలదాచుకున్నారు. ఇటీవల కస్తూరిరంగన్ నివేదిక అమలు, అటవీ ప్రాంతం ఆక్రమణల తొలగింపు అంశాలపై ప్రజలతో సమావేశాలు జరిపారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు అడవుల్లో గాలింపు ప్రారంభించారు. విక్రమ్‌గౌడ మృతదేహాన్ని మంగళూరు ఆస్పత్రికి తరలించారు.లొంగిపోవాలని చెప్పాంబనశంకరి: ఎన్కౌంటర్ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ఆంతరిక భద్రతా విభాగం డీఐజీ రూపా మౌద్గిల్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ కదలికల గురించి తెలిసి గాలింపు మొదలైంది, నక్సల్స్ ఎదురుపడ్డారు, లొంగిపోవాలని సూచించినప్పటికీ కాల్పులకు దిగారు. ఈ సమయంలో ఏఎన్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో విక్రమ్‌గౌడ మృతిచెందారు. ఇతడిపై హత్య, దోపిడీలు, దొంగతనాలు తో పాటు 60 కి పైగా కేసులు ఉన్నాయి అని రూపా మౌద్గిల్ చెప్పారు. 10 రోజుల నుంచి గాలింపు జరుగుతోందని ఆమె చెప్పారు. -
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
ముంబై: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అలాగే అన్మోల్ను పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా గత ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మీన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్కు ప్రమేయం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు అన్మోల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్‌కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. బాబా సిద్దిఖీ హత్యతో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారుఅన్మోల్ బిష్ణోయ్‌ని అలియాస్ భానుగా పిలుస్తారు. గత ఏడాది నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి పారిపోయిన అన్మోల్.. అనంతరం కెన్యా, కెనడాలో గుర్తించారు. ప్రస్తుతం అతడు కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. -
ఘోరీ.. ఘోరాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో దాక్కుని.. ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ అరెస్టు ఘటనతో కరుడుగట్టిన టెర్రరిస్ట్ మహ్మద్ ఫర్హతుల్లా ఘోరీ పేరు మరోసారి తెరపైకి వచి్చంది. హైదరాబాద్‌కే చెందిన ఘోరీ కోసం రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు వివిధ నిఘా ఏజెన్సీలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దాదాపు 26 ఏళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్న అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాంటెడ్ లిస్టులోనూ ఉన్నాడు.అజ్ఞాతంలోకి వెళ్లాకే విషయం బయటికి.. హైదరాబాద్‌లోని మాదన్నపేట సమీపంలో ఉన్న కూర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్.. 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అది జరిగిన నాలుగేళ్ల తర్వాతగానీ అతడి పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. 2002లో గుజరాత్‌లోని అక్షర్ధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసుతో ఘోరీ వ్యవహారాలు బహిర్గతం అయ్యాయి. 2004లో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది.అప్పట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌కు (జేఈఎం) సానుభూతిపరుడిగా ఉన్న ఘోరీ.. ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2005లో నగర కమిషనర్ టాస్‌్కఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులో.. 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ కేసులోనూ ఘోరీ వాంటెడ్‌గా ఉన్నాడు. 2022 దసరా సమయంలో విధ్వంసాలకు కుట్రపన్ని హ్యాండ్ గ్రెనేడ్స్తో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన జాహెద్‌తో ఘోరీ సంప్రదింపులు జరిపాడు. దీనితోపాటు మరికొన్ని ఉగ్రవాద కేసుల్లోనూ ఘోరీ వాంటెడ్‌గా ఉన్నాడు.రిక్రూట్మెంట్తో పాటు ఫైనాన్సింగ్ ఘోరీ ప్రస్తుతం పాకిస్తాన్‌లోని రావలి్పండిలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. దీనికి ముందు దు బాయ్ కేంద్రంగా ఉండి హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలకంగా పనిచేశాడు. గత 26 ఏళ్లుగా అనేక ఉగ్రవాద సంస్థలతో కలసి పనిచేశాడు. లష్కరేతొయిబా (ఎల్ఈటీ), హర్కతుల్ జిహీదే ఇస్లామీ (హుజీ), ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.హైదరాబాద్ సిటీలో 2007 ఆగ స్టు, 2013 ఫిబ్రవరిలో జరిగిన జంట పేలుళ్లకు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) స్థాపనలో కీలకంగా వ్యవహరించిన అమీర్ రజాఖాన్కు ఘోరీ సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్ర హోంశాఖ విదేశాల్లో ఉంటూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్న, సహకరిస్తున్న 18 మంది ఉగ్రవాదుల పేర్లతో 2020 లో మోస్ట్ వాంటెడ్ జాబితా విడుదల చేసింది. అందులో ఐఎం వ్యవస్థాపకుడు, సహ–వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌తోపాటు ఘోరీ సైతం ఉన్నాడు.ఇన్నాళ్లూ ఫొటో కూడా దొరకని రీతిలో.. ఘోరీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్ దాంతోపాటు దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి అస్పష్టమైన ఫొటోను విడుదల చేసింది. అతడి స్పష్టమైన ఫొటో సుదీర్ఘకాలం ఏ ఏజెన్సీ వద్ద కూడా లేకపోవడమే అందుకు కారణం. 2008 ఏప్రిల్‌లో అతడి మేనల్లుడు ఫయాఖ్ను దుబాయ్ నుంచి డీపోర్ట్ (బలవంతంగా తిప్పిపంపడం) చేయగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఫయాఖ్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఘోరీకి సంబంధించి 20 ఊహాచిత్రాలను రాష్ట్ర నిఘా వర్గాలు రూ పొందించాయి. అక్షర్ధామ్ కేసులో ఘోరీ సోదరుడు షౌకతుల్లాను 2009 ఏడాది జూలైలో అరెస్టు చేసినప్పుడు.. ఆ ఊహాచిత్రాలను చూపగా వాటిలో ఒకదానిని అతను నిర్ధారించాడు. అప్పటి నుంచి అదే ఆధారమైంది. తాజాగా రిజ్వాన్ అరెస్టుతో ఘోరీ కొత్త ఫొటో ఏజెన్సీలకు లభించింది. -
హఫీజ్ సయీద్‌ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్‌ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్‌ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? టాప్ కమాండర్ల పనేమిటి?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య 4 వేలు దాటింది. ఇజ్రాయెల్ హమాస్‌ను పూర్తిగా మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే పాలస్తీనా అంతటా భీకర దాడులు కొనసాగుతున్నాయి. కాగా హమాస్ ఉగ్ర సంస్థను ఎవరు నడుపుతున్నారు? ఈ గ్రూప్‌లోని ‘మోస్ట్ వాంటెడ్’గా ఉన్నవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హమాస్ అనేది పాలస్తీనా ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ సభ్యులు గాజాపై ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఇక్కడి ప్రజల మధ్య వారు రహస్యంగానే ఉంటూనే సొంత సైన్యాన్ని సిద్ధం చేస్తారు. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంటారు. ఇటువంటి దాడులకు ఇరాన్ బహిరంగంగా హమాస్‌కు సహాయం చేస్తున్నదనే వార్తలు వినిపిస్తుంటాయి. హమాస్‌లో వేర్వేరు విభాగాలు ఉన్నాయి. దీనిలో అత్యంత ప్రమాదకరమైనది సైనిక విభాగం. పలు దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హమాస్ సైనిక కమాండర్ల జాబితాలో మహ్మద్ దీబ్ అల్ మస్రీ పేరు వినిపిస్తుంది. ఇతనిని అబూ ఖలీద్ అని కూడా అంటారు. అబూ ఖలీద్ హమాస్ సైనిక సంస్థ ఐజే అల్ దిన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్‌కు అధిపతి. ఇజ్రాయిలీలు ఈ ప్రమాదకరమైన కమాండర్‌ను ‘మ్యాన్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు. హమాస్‌లో వినిపించే మరో నేత పేరు మార్వాన్ ఇస్సా, అతను టాప్ మోస్ట్ కమాండర్లలో ఒకడు. అతను ఐజే అల్ దిన్ అల్ ఖస్సామ్ బ్రిగేడ్‌కు డిప్యూటీ కమాండర్. మార్వాన్ ఐదేళ్లుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్నాడు. ఇజ్రాయెల్‌పై దాడులు చేయడంలో కీలకపాత్ర వహించాడని చెబుతారు. హమాస్ టాప్ కమాండర్లలో మరొకని పేరు యాహ్యా సిన్వార్. ఇతను హమాస్ పొలిటికల్ బ్యూరోను పర్యవేక్షిస్తుంటాడు. అమెరికా బ్లాక్ లిస్టులో సిన్వార్ పేరు చేరింది. సిన్వార్ హమాస్ భద్రతా సేవ మజ్ద్‌కు అధిపతి కూడా. హమాస్ చేపట్టే దాడులకు సంబంధించిన వ్యూహాలను రూపొందించడంలో ఇతను కీలకంగా వ్యవహరిస్తుంటాడు. ఇది కూడా చదవండి: యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? -
మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం..
కెనడా: భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను సర్రేలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ వద్దనున్న గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) గతంలో ప్రకటించిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉంది. పంజాబ్ నుంచి కెనడా పారిపోయి చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిజ్జర్ ను అప్పగించాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కెనడా ప్రభత్వాన్ని కోరుతూ ఉంది. కానీ అంతలోనే కెనడాలోని గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతడిని కాల్చి చంపేశారు. ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. కెనడాలోని భారత రాయబారి సంస్థ పైన ఇటీవల జరిగిన దాడుల్లో నిజ్జర్ ప్రమేయముందని స్వయంగా భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్ కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు నిజ్జర్. ఇది కూడా చదవండి: మెక్సికోలో పెను భూకంపం.. -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్‌తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్‌లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్‌ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్‌కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
తండ్రి పోలీసు, భర్త కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్.. అతీక్ భార్య పర్వీన్ ఎక్కడున్నారు?
లక్నో: పోలీసు కస్టడీలో ఉండగా దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్(51)కోసం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే పర్వీన్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే అతిక్, అష్రఫ్ అంత్యక్రియల సమయంలో పర్వీన్ లొంగిపోతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె హాజరుకాలేదు. అతిక్ హత్య నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె కోసం జల్లెడపడుతున్నారు. కాగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే షైస్తా తన కొడుకు అసద్, భర్త అతిక్ ఇద్దరిని కోల్పోయింది. అసద్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన రెండు రోజుల తర్వాత, అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు వక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేరానికి పాల్పడ్డ లవ్లేష్ తివారి(22), అరుణ్ మౌర్య(18), మోహిత్ అలియాస్ సన్నీ(23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీని, సిట్‌ను నియమించారు. భర్తను హత్య చేశారని తెలియగానే షాయిస్తా పర్వీన్ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: గ్యాంగ్‌స్టర్ అతిక్ హత్య.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం ఎవరీ షాయిస్తా పర్వీన్? షాయిస్తా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. 1996లో అతిక్‌ని పెళ్లి చేసుకునే ముందు షాయిస్తా ప్రపంచం కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇంటర్ పూర్తి చేసిన ఆమెకు అంతకుముందు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు. అయితే 2009 నుంచి షాయిస్తా పేరు మీద ప్రయాగ్‌రాజ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు చీటింగ్ కేసులు కాగా ఒకటి హత్య కేసు. మొదటి మూడు కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో నమోదవ్వగా నాలుగోది ఉమేష్ పాల్ హత్య కేసు. ఫిబ్రవరి 24న హత్యకు గురైన ఉమేష్ కేసులో ప్రధాన నిందితుల్లో షాయిస్తా ఒకరు. ఈమెతోపాటు భర్త అతిక్ అహ్మద్, ఇద్దరు కుమారులు, సోదరుడు అష్రఫ్ కూడా ఈ కేసులో నిందితుగా ఉన్నారు. 2021లో షైస్టా AIMIMలో చేరారు. అనంతరం 2023 జనవరిలో బీఎస్పీలో చేరారు. ఈ సమయంలో తన భర్త అతిక్ ఎస్పీ అగ్రనేతతో స్నేహం కారణంగా క్రమశిక్షణ నేర్చుకోలేకపోయాడని తెలిపింది. అతిక్ ఎప్పుడూ బీఎస్పీని ఇష్టపడేవాడని.. ఆ పార్టీ అగ్రనేతలకు కూడా సహాయం చేశాడని చెప్పుకొచ్చారు. అయితే తరువాత జరిగిన మేయర్ ఎన్నికలో శాయస్తాను పోటీ చేయకూడదని మాయావతి నిర్ణయించుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రణాళిక రచించడం, దాన్ని అమలు చేయడంతో షాయిస్తా కీలకంగా వ్యహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా అతీక్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో పర్వీన్ కీలకంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని తేలింది. సీఎం యోగికి షైస్తా లేఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్వీన్ రాసిన లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లను తప్పుగా ఇరికిస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. ఉమేష్ పాల్ హత్యకు మంత్రి నంద్ గోపాల్ గుప్తా కీలక సూత్రధారి అని ఆరోపించారు. అయితే పర్వీన్ ఫిబ్రవరి 27న లేఖ రాయగా.. అతిక్ మరణానంతరం వెలుగులోకి వచ్చింది. సీఎం ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోకపోతే నా భర్త, బావమరిది, కొడుకులను చంపేస్తామని లేఖలో రాసింది. చదవండి: క్రిమినల్ కథా చిత్రమ్.. అతీక్ అహ్మద్‌కు వ్యవస్థ మొత్తం దాసోహమైందా? -
తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు.. ఘరానా దొంగ రమేష్ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ, పలుమార్లు జైలుకెళ్లినా బుద్ది మార్చుకోని మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు రమేష్ రాచకొండ పోలీసులకు చిక్కాడు. గతేడాది డిసెంబర్లో ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఓ కారును చోరీ చేసిన ఇతడిపై ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు నిఘా పెట్టారు. శనివారం తెల్లవారు జామున ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రమేష్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ యాదగిరితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. ► సూర్యాపేట జిల్లా, చివేముల మండలం, మూ న్యా నాయక్ తండాకు చెందిన ధారావత్ రమేష్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. జనసంచారం లేని చోట పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రాత్రి వేళల్లో వాటిపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. ► ప్రస్తుతం రమేష్‌పై రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో 10 కేసులు, సూర్యాపేటలో 5, నల్లగొండలో 3, విశాఖపట్నంలో 2, కొత్తగూడెం, విజయవాడలో ఒక్కో కేసు న్నాయి. సూర్యాపేట టు టౌన్ పోలీసు స్టేషన్లో నమోదైన 15 కేసుల్లో రమేష్ పరారీలో ఉన్నాడు. మోత్కూరు ఠాణాలో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) కూడా జారీ అయింది. 2017లో నాగార్జునసాగర్ పోలీసులు రమేష్‌ను దోపిడీతో పాటు హత్యాయత్నం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. చివరిసారిగా 2019లో ఖమ్మంలోని రఘునాథపాలెం పోలీసులు ఇతడిని వాహనం చోరీ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2021 సెప్టెంబర్‌లో కరోనా కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా ప్రవృత్తి మార్చుకోలేదు. ► గతేడాది డిసెంబర్ 22న ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని సూర్యోదయ నగర్ కాలనీలోని శ్రీదుర్గా కార్స్ ఆఫీసులో చొరబడి టేబుల్‌పైన ఉన్న కారు తాళాలను తీసుకుని స్కోడా కారును దొంగిలించాడు. ఈ కేసులో రమేష్‌పై ఎల్బీనగర్ సీసీఎస్, ఎల్బీనగర్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో తిరుగుతున్న అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.35.55 లక్షల విలువ చేసే 10 తులాల బంగారం ఆభరణాలు, 2 కార్లు, 2 బైక్‌లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన పోలీసులు -
Crime Story: మోస్ట్ వాంటెట్.. పరిణీత ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్!
సాయంత్రం నుండి హోరున వర్షం కురుస్తూనే ఉంది. అక్కడికి ఎడమపక్కగా ఒక పోలీసుస్టేషన్. ఆ స్టేషన్లో ఆకాష్ గుప్తా, రజని దంపతులు.. సీఐ నచికేత ఎదురుగా కూర్చుని ఉన్నారు. తన చేతిలో ఉన్న కంప్లైంట్ ను దీక్షగా చదువుతున్నాడు నచికేత. కొద్దిసేపటి తరువాత వారిని చూస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన సమస్యలా ఉంది. మనం ఘోరా బాబా ఆశ్రమానికి వెళదాం. వారెంటుతో ఆశ్రమానికి వెళ్ళాలి కాబట్టి మీరు అప్పటివరకు నిరీక్షించక తప్పదు’ అన్నాడు. ∙∙ ‘నేను దైవాంశసంభూతుడిని. నన్ను నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుంది. మీ సమస్యలు, కష్టాలు నాతో చెప్పుకోండి. నేను వాటిని తీర్చి మీకు ముక్తిని ప్రసాదిస్తాను’ ఎప్పటినుండో సాగుతున్న ఘోరాబాబా ప్రసంగం ముగిసింది. అది గమనించిన బాబా ప్రధానశిష్యులు నలుగురు మెరుపువేగంతో కదిలి ఘోరాబాబా చుట్టూ కవచంలా ఏర్పడ్డారు. రక్షకవలయం నడుమ ఘోరాబాబా లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడున్న భక్తులు దూరం నుండే ఘోరాబాబాకి జై అని నినాదాలు చేయసాగారు. వారిని అనుక్షణం బాబా శిష్యులు అప్రమత్తులై డేగకళ్లతో కాపలా కాస్తున్నారు. చిన్న చీమ కూడా లోపలికి జొరబడకుండా ఆశ్రమం అంతటా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నాయి. ఘోరాబాబా దర్శనానికి అప్పుడప్పుడు వచ్చే పరిణీత.. గత కొంతకాలంగా ఆశ్రమంలోనే ఉంటూ అక్కడికి వచ్చే భక్తులను, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని పనుల్లో చురుకుగా పాల్గొంటోంది. ఘోరాబాబా మన్ననలు చూరగొని ప్రియమైన శిష్యురాలిగా మారిపోయింది. అది ఒక విశాలమైన హాలు. అక్కడున్న వేదిక మీది వెండి సింహాసనంపై ఘోరాబాబా ఆసీనుడయ్యాడు. ఘోరాబాబా చుట్టూ శిష్యులు కవచంలా నిలబడి ఉన్నారు. ఘోరాబాబా తల చుట్టూ తెల్లటి కాంతివలయం మెరిసిపోతూ ఉంది. అందరినీ చూస్తున్న ఘోరాబాబా ‘భక్తులారా.. మీ అందరిని ఉద్ధరించడానికే అవతరించాను. మీ మీ కష్టాలన్నీ నాతో విన్నవించుకోండి’ అని పలుకుతూ తన చేతిని గాలిలో తిప్పాడు. వెంటనే విభూది ప్రత్యక్షమైంది. ఆ విభూదిని అక్కడున్న భక్తులు అందరి మీదా పడేటట్టు ఊదాడు ఘోరాబాబా. ఆ విభూది అందరి మీద పడగానే వారందరూ తన్మయత్వంతో వివశులై మంత్రముగ్ధుల్లా మారిపోయారు. తర్వాత ఘోరాబాబా ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆ ప్రసంగాన్ని అక్కడున్నవారందరూ ఎంతో శ్రద్ధగా వినసాగారు. వెండి సింహాసనం నుండి దిగిన ఘోరాబాబా సింహాసనం వెనుక భాగం వైపు ఉన్న ఒక మీటను నొక్కాడు. అది నొక్కగానే సింహాసనం పక్కకి జరిగి వేదిక కిందకు మెట్లు కనిపించాయి. అక్కడే ఉన్న పరిణీతను భక్తులు ఇచ్చిన కానుకల పళ్ళేన్ని పట్టుకుని తన వెంట రమ్మన్నాడు. అక్కడకు వచ్చిన పరిణీత ఆ వేదిక కింద ఉన్న మెట్లను చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో ఒక శిష్యుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు.. ‘బాబా.. మీకోసం సీఐ వచ్చాడు’ అంటూ. అది వినగానే ఘోరాబాబా.. పరిణీతతో పాటు బయటకు వచ్చాడు. అక్కడ సీఐ నచికేతతో పాటు ఆకాష్ గుప్తా, రజని ఉన్నారు. వారిని చూసిన ఘోరాబాబా ఆశ్చర్యపోయాడు. వారందరినీ అక్కడ చూసిన పరిణీత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారణం ఆకాష్ గుప్తా, రజని.. ఆమె తల్లిదండ్రులు కావడమే. ఘోరాబాబా.. నచికేతను చూస్తూ ‘ సీఐ గారూ.. మా ఆశ్రమాన్ని సందర్శించడానికి కారణం?’ అని అడిగాడు. ‘నేను తమరి ఆశ్రమం సందర్శించడానికి రాలేదు. వారెంటుతో వచ్చాను. మీరు.. పరిణీత అనే అమ్మాయిని మీ ఆశ్రమం నుండి పంపించకుండా బంధించినట్టు మాకు కంప్లయింట్ వచ్చింది. అందుకుగాను మీ మీద, మీ ఆశ్రమం మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అన్నాడు పీఐ నచికేత. ఆ మాటకు తెలియని కలవరపాటుకు గురైనా కనిపించకుండా సర్దుకున్న ఘోరాబాబా.. ‘పరిణీత ఇక్కడే ఉంది. నేను కానీ మా ఆశ్రమంలో ఇంకెవరు కానీ ఆమెను బంధించలేదు’ అన్నాడు. నచికేత.. పరిణీత వద్దకు వెళ్ళాడు. ‘పరిణీతగారూ.. మీరిలా మీ తల్లిదండ్రులను వదిలి ఇక్కడ ఉండటం సమంజసం కాదు. మీరు వెంటనే మీ పేరెంట్స్‌తో వెళ్లడం మంచిది’ అని చెప్పాడు. ‘చూడండి సర్.. నేనెక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు. అదీ కాక నేను మేజర్ని. మేజర్‌కి తాను ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు కూడా ఉంటుందని మీకు బాగా తెలుసనుకుంటాను. దయచేసి మీరందరూ ఇక్కడనుండి వెళ్లిపోండి’ అంది పరిణీత. జరుగుతున్నదంతా నిర్వికారంగా ఘోరాబాబా, ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ తో శిష్యులు, కన్నీటితో పరిణీత తల్లిదండ్రులు చూస్తున్నారు. ‘మీరు మేజర్ అవునో కాదో తెలుసుకోవడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా?’ అడిగాడు నచికేత. తన చేతిలో ఉన్న ఒక ఫైలును నచికేతకు అందించింది పరిణీత ‘ఇది చూడండి’ అంటూ. అందులో ఉన్న సర్టిఫికెట్స్‌ను పరిశీలనగా చూస్తున్న నచికేతకు ఒక కాగితాన్ని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. అది పరిణీత జర్నలిజంలో మాస్టర్స్ చేసిన సర్టిఫికెట్. అప్పుడర్థమైంది నచికేతకు పరిణీత అక్కడ ఎందుకు ఉందో! ఆ సంఘటన జరిగిన నెల రోజులకు.. ఘోరాబాబా ఆశ్రమం అంతా గగ్గోలుగా ఉంది. ఆ ఆవరణంతా పోలీసులు.. మీడియాతో నిండి ఉంది. కొద్దిసేపటిలో సీఐ నచికేత.. ఘోరాబాబాను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ∙∙ ఆ వేళ.. కోర్టు హాలు అంతా కిక్కిరిసి ఉంది. ఫైల్ చేయబడిన ఘోరాబాబా కేసు తీర్పు ఇవ్వబోతున్నారు జడ్జిగారు. సీఐ నచికేత.. ప్రత్యేక భద్రత నడుమ పరిణీత తల్లిదండ్రులను కోర్టుకు రప్పించాడు. ఒకపక్క కోర్టుబోనులో పరిణీత.. మరోపక్క బోనులో కళ్ళనిండా క్రోధంతో ఘోరాబాబా.. జడ్జిగారు పర్మిషన్ ఇవ్వగానే పరిణీత చెప్పడం మొదలుపెట్టింది. ‘జడ్జిగారూ.. నా పేరు పరిణీత. నేను జర్నలిజంలో మాస్టర్స్ చేశాను. ఒకరోజు నా ఫ్రెండ్.. ఘోరాబాబా ఆశ్రమానికి వెళదామని నన్ను తీసుకువెళ్ళింది. ఘోరాబాబా చుట్టూ ఉన్న వారందరూ భక్తి పేరుతో హిప్నాటిజమ్కు గురైనట్టు అనిపించింది. ఆశ్రమంలో దృశ్యాలు కుతూహలం కలిగించాయి. తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించాయి. ఓ సామాన్యురాలిగా ఆశ్రమానికి రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టాను. ఘోరాబాబాకు ప్రియమైన శిష్యురాలిగా మారిపోయాను. అక్కడ భక్తి ముసుగులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని గ్రహించాను. వాటిని అందరికి తెలియచేసి ఘోరాబాబా నిజస్వరూపం బయటపెట్టాలని నిశ్చయించుకున్నాను. నిజానికి అది ఓ సాహసమే. అయినా నేను వెనకాడలేదు. హిప్నాటిజం అనేది ఒక నమ్మకం. దాన్ని గారడిగా మర్చి.. మాస్ హిస్టీరియాను సృష్టిస్తూ.. చిన్న చిన్న ట్రిక్స్‌తో, తనకు తనే మహాయోగిగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను టార్గెట్ చేస్తున్నాడు ఈ ఘోరాబాబా. ఆ ఘోరాలను నా కళ్లకు అమర్చిన ‘స్పై కెమెరా లెన్స్’ తో షూట్ చేశాను. ఘోరాబాబా చేసే ప్రతి గారడీ ప్రజలు చూడాలి. అందుకు అవకాశం ఇవ్వండి మిలార్డ్’ అంటూ తన దగ్గరున్న ఫుటేజీని జడ్జిగారికి అందించింది పరిణీత. ఆమె ధైర్యసాహసాలకు ముచ్చటపడ్డారు అక్కడున్నవారంతా. ఆ ఫుటేజీని స్క్రీన్ మీద ప్లే చేయాల్సిందిగా జడ్జిగారు అనుమతినిచ్చారు. అనుమతి అందడమే ఆలస్యం ఘోరాబాబా లీలలన్నీ ఒక్కొక్కటిగా ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద కనిపించసాగాయి. ‘ఒక గదిలో ఘోరాబాబా తన శిష్యులను హిప్నటైజ్ చేస్తున్నాడు. వారందరూ ఏదో మత్తులో ఉన్నట్టు ఊగిపోతున్నారు. ఘోరాబాబాను వాళ్ళందరూ దేవుడని పొగుడుతూ కాళ్ళమీద పడి మొక్కుతున్నారు. తెల్లటి విభూదిని తీసుకొచ్చి అందులో ఏదో కలిపాడు ఘోరాబాబా. ఆ విభూదిని భక్తుల మీద చల్లడానికి ఉపయోగిస్తున్నారు. మరొకచోట అక్కడున్న అమ్మాయిలను కొంతమంది శిష్యులు ఘోరాబాబాకు లొంగిపొమ్మని లేదంటే మీ కుటుంబాలను అన్యాయం చేస్తామని బెదిరిస్తున్నారు. మరొకచోట పెద్ద ఎత్తున స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇవన్నీ ఘోరాబాబా ఆశ్రమం అండర్ గ్రౌండ్లో జరుగుతున్నాయి. ఆశ్రమానికి అండర్ గ్రౌండ్ ఉందని ఎవరికీ తెలియదని ఘోరాబాబా.. పరిణీతకు చెప్పడం కూడా అందులో ఉంది. ప్రజల అమాయకత్వాన్ని.. భక్తివిశ్వాసాలను వ్యాపారంగా మార్చుకుంటున్న ఆ ఘోరమైన దృశ్యాలు ఘోరాబాబా వికృత ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. అంతా చూసిన జడ్జిగారు.. ఆ వీడియోలను తక్షణమే ప్రజాతీర్పు కోసం టెలికాస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ∙∙ టీవీల్లో ఘోరాబాబా అకృత్యాలు ప్రసారమవడం మొదలయ్యాయి. ఇది జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఘోరాబాబా ఆశ్రమాలు, సంస్థలు భక్తుల ఆగ్రహానికి నేలమట్టమవసాగాయి. ∙∙ ప్రజా తీర్పు తర్వాత.. కోర్టు తీర్పూ వెలువడింది. ఏడుచువ్వల మధ్య.. కటిక నేల మీద పడుకుని సీలింగ్ వంక వెర్రిచూపులు చూస్తూ కాలక్షేపం చేయసాగాడు ఘోరాబాబా. చదవండి: కథ: ఋణం.. తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా? -
పాక్ నుంచి రిందా కుట్ర
సాక్షి, హైదరాబాద్: పంజాబ్‌తోపాటు ఢిల్లీ, చండీగఢ్, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాఫియా డాన్ హర్వీందర్ సింగ్ అలియాస్ రిందా పాకిస్తాన్ నుంచి భారత్‌లో పేలుళ్లకు కుట్ర పన్నాడు. పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత సంస్థ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ముసుగులో అటు ఐఎస్ఐ, ఇటు ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ)లకు సహకరిస్తున్నాడు. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న తన నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాడు. రిందా ఆదేశాల మేరకు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుంచి ఆదిలాబాద్‌కు మారణాయుధాలు, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ రవాణా చేస్తున్న నలుగురు ఉగ్రవాదులను హరి యాణాలోని కర్నాల్ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. వీటి ట్రాన్సిట్ పాయింట్ ఆదిలాబాద్ అని, అక్కడకు వచ్చే నాందేడ్ ముఠా తీసుకుని వెళ్లేలా రిందా ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. త్రుటిలో తప్పించుకుని పాక్‌కు.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రిందా కుటుంబం పంజాబ్‌లోని తరంతరాన్ జిల్లాకు వలసవెళ్లింది. 18 ఏళ్ల వయస్సులోనే సమీప బంధువును హత్య చేసిన రిందా.. తర్వాత నాందేడ్‌కు మకాం మార్చాడు. అక్కడా రెండు హత్యలతోసహా పలు నేరాలు చేసి పంజాబ్‌కు పారిపోయాడు. పంజాబ్ యూనివర్సిటీలో ఉన్న పరిచయస్తుల సాయంతో అందులోనే తలదాచుకున్నాడు. 2016లో అక్టోబర్‌లో ఆ వర్సిటీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న రిందా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఓఐ) నాయకులపై తుపాకులతో కాల్పులు జరిపాడు. మాఫియా సంబంధాలతో హత్యలు, బలవంతపు వసూళ్లు తదితర నేరాలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 2017లో తన భార్యతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. వీరి సమాచారంతో బెంగళూరు పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. త్రుటిలో తప్పించుకున్న రిందా పాకిస్తాన్ పారిపోయాడు. అక్కడ ఉంటూనే బీకేఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. బీకేఐ సంస్థ ఐఎస్ఐ, ఎల్ఈటీల కోసం పని చేస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలోనే గుర్తించింది. తాజాగా రిందాను వినియోగించుకుని ఈ రెండు సంస్థలు భారత్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నింది. దీనికోసం ఇతగాడు పంజాబ్‌లోని∙బీకేఐ స్లీపర్ సెల్స్‌తోపాటు నాందేడ్‌లో తన అనుచరులను వాడుకోవాలని పథకం వేశాడు. -
ఆమె.. ఒక మిస్టరీ! జిహాదీలకు ఆమె రోల్ మోడలా?
ఆమెను లేడీ అల్‌ఖాయిదా అని పిలిచేవారు మోస్ట్ వాంటెడ్ వుమెన్ జాబితాలో కూడా ఆమె పేరు చేరింది అభిమానులు ఆమెను ఇస్లాం మతాన్ని కాపాడే రాడికల్‌గా భావిస్తే అమెరికా ఆమెపై అల్ ఖాయిదా తొలి మహిళా ఉగ్రవాది అన్న ముద్ర వేసింది అమెరికాలోని టెక్సాస్ జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీ విడుదల కోసం ఇప్పటి వరకు 57 మంది ప్రాణాలు బలయ్యాయి. ఇంతకీ ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆమె విడుదల కోసం పాక్‌కి ఎందుకీ ఆరాటం? అమెరికాలోని టెక్సాస్‌లో జనవరి 15న ఒక యూదు ప్రార్థనాలయంలో నలుగురిని బందీలుగా చేపట్టిన ఓ బ్రిటీష్ పాకిస్తానీ యువకుడు వారిని వదిలేయాలంటే, అక్కడికి సమీపంలో జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీని విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. 10 గంటల ఉత్కంఠ తర్వాత అమెరికా పోలీసుల చేతుల్లో హతమయ్యాడు. ► 2011లో అల్ ఖాయిదాలో నెంబర్ 2 ఉగ్రవాది అల్ జవహరి.. ఆఫియాను విడుదల చేస్తే, తమ దగ్గర బందీగా ఉన్న యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉద్యోగి వారెన్ వీన్స్టెన్ను విడుదల చేస్తామని బేరం పెట్టాడు. ► 2014లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ తమ బందీగా ఉన్న అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేని విడుదల చేస్తామని, బదులుగా ఆఫియాను విముక్తురాలిని చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా అంగీకరించకపోవడంతో ఆ జర్నలిస్టు తలనరికి చంపేసింది. ► 2017లో పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్‌ఖాన్ తాను అధికారంలోకి వస్తే ఆఫియాను విడుదలకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. వీరే కాదు జీహాది సంస్థలు, సామాన్య జనం, యావత్ ముస్లిం సమాజం ఆఫియా విడుదల కోసం ఎన్నో ప్రదర్శనలు చేశారు. అమెరికాలో ఎవరిని బందీగా తీసుకున్నా ఆఫియా విడుదల కోసమేనా అన్నట్టుగా పరిస్థితులు మారాయి. ఆఫియా చుట్టూ ఆరోపణలు ఆఫియా జీవితమే ఒక మిస్టరీగా మారింది. అమెరికాలో ఉండగా ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 10 వేల డాలర్లతో నైట్ విజన్ గాగుల్స్ కొన్నదని , రక్షణ కోసం కవచాలు, ఒక సైనికురాలిగా స్వీయ శిక్షణ తీసుకోవడానికి అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. సెప్టెంబర్ 11 దాడుల మాస్టర్‌మైండ్ ఖలీద్ షేక్ మహమ్మద్ మేనల్లుడు అమ్మర్ అల్ బలూచిని ఆమె రహస్య వివాహం చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. 2003లో ఖలీద్ అరెస్ట్ అయిన నెలరోజులకే ఆఫియా కొన్నాళ్లు అదృశ్యమైపోవడం ఆ ఆరోపణలకి ఊతమిచ్చింది. డర్టీ బాంబ్స్ తయారు చేసి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించడానికి అఫియా కుట్ర పన్నిందన్న ఆరోపణలు వచ్చాయి. జైల్లో ఉన్నప్పటి చిత్రం 2008లో అఫ్గానిస్తాన్‌లో అమెరికా అధికారిపై కాల్పులకు తెగబడిందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. 2010లో అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 86 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అంటే ఆఫియాకి శిక్షా కాలం పూర్తయ్యేటప్పటికీ ఆమె ప్రాణాలతో ఉంటే వయసు 124 ఏళ్లు వస్తాయి. అయితే ఆఫియా సిద్ధిఖీ అమాయకురాలని, ఆమెకు ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేదని, అమెరికా మిలటరీయే ఆఫియాని కిడ్నాప్ చేసి నేరాన్ని మోపిందంటూ వాదించేవారూ ఉన్నారు. 2001, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమాయకులపై కూడా టెర్రరిస్టు ముద్ర వేస్తోందని ముస్లిం సమాజం గళమెత్తింది. ఇప్పుడు ఎలా ఉంది ? టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ జైల్లో ఉన్న ఆఫియా సిద్ధిఖీ ప్రాణాలకు ఇంకా ముప్పు పొంచే ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆమెపై తోటి ఖైదీలు దాడులకు దిగారని జైలు రికార్డులు చెబుతున్నాయి. పొగలు కక్కే కాఫీని ఆమె ముఖంపై పోయడంతో కాలిన గాయాలయ్యాయి. కళ్లు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను మరో మహిళా ఖైదీ చితకబాదింది.. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పాకిస్తాన్లో హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆఫియాను విడుదల చేయాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విదేశీ జైళ్లలో మగ్గిపోతున్న పాకిస్తానీయుల విడుదలకు తాను పాటుపడతానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టెక్సాస్ యూదు ప్రార్థనాలయంలో ఆఫియా విడుదల కోసం ఘటన జరగడంతో మరోసారి ఈ అల్ ఖాయిదా లేడీ ఉగ్రవాదిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విశ్వవిఖ్యాత మసాచుసెట్స్ వర్సిటీలో చదివి.. అపై పీహెచ్డీ చేసి జీవితంపై ఎంతో విశాల అవగాహన ఉన్న ఆఫియా చట్ట వ్యతిరేక ఉగ్రమార్గాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ విస్మయపరిచే అంశమే. పెద్దయ్యాక పాశ్చాత్యదేశాల్లో పెరిగింది. ఆ దశలో ఆమెకు ఉగ్రభావాలున్న పరిచయం అయ్యే అవకాశం ఉండదు. అంటే పాక్‌లో సెకండరీ విద్యను అభ్యసించే లోపలే... లేదా సేవా కార్యక్రమాల కోసం ప్రపంచదేశాలు తిరుగుతున్న తరుణంలో ఎవరో ఆమెకు బ్రెయిన్ వాష్ చేసి ఉంటారని అనుకోవచ్చు!. ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆఫియా సిద్ధిఖీ పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన న్యూరో సైంటిస్ట్. 1990లో టీనేజ్‌లో ఉండగానే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంది. బ్రాండీస్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసింది. 1995లో కరాచీకి చెందిన అంజాద్‌ఖాన్‌తో నిఖా జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2002లో భర్తతో విడిపోయింది. అమెరికాలో విద్యార్థిగా ఉండగానే ఆమె మసీదులకి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేది. ఇస్లాం మతం సంరక్షణ కోసం ప్రచారం చేసేది. అఫ్గానిస్తాన్, బోస్నియా, చెచన్యాలో సంక్షోభ పరిస్థితులపై ఉద్యమాలు చేసింది. భారీగా విరాళాలు సేకరించి ఆయా దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె తండ్రి మహమ్మద్ సిద్ధిఖీ వైద్యుడు, సామాజిక కార్యకర్త. పాకిస్తాన్ జనరల్ జియా ఉల్ హక్ హయాంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. దీంతో సిద్ధికీ ఏం చేసినా బాగా ప్రచారం వచ్చేది. ఆమెకి ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. పైగా అకర్షణీయమైన రూపం, అత్యంత ప్రతిభావంతురాలు, ఉన్నత విద్యను అభ్యసించి ఉండటంతో... పాక్ సమాజంతో పాటు ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండేది. –నేషనల్ డెస్క్, సాక్షి -
టోనీ మొదట గార్మెంట్ బిజినెస్ చేశాడు: సీవీ ఆనంద్
-
మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్ టోనీ అరెస్ట్
-
టక్కరి దొంగ.. చిక్కాడిలా..!
అతనొక్కడే.. ఎవరి సహకారం తీసుకోడు.. ఒంటరివాడే కదా అని తీసిపారేయకండి. మహా టక్కరి దొంగ.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 200కు పైగా దొంగతనాలు చేశాడు. పోలీస్ పేరుతో కొన్నేళ్ల పాటు తన చోర కళను అప్రతిహతంగా కొనసాగించాడు. 2016లో ఓ కేసులో సీసీ కెమెరాకు చిక్కాడు. వేలిముద్రలతో అడ్డంగా దొరికిపోయి జైలు శిక్ష అనుభవించినా అతనిలో మార్పు రాలేదు. కర్నూలు: జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి మఫ్టీ పోలీసు ముసుగులో చోరీలకు పాల్పడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన అంతర్రాష్ట్ర దొంగ బోయ బూడిదపాడు రాజు అలియాస్ బుడ్డోడును కర్నూలు తాలూకా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.6.25 లక్షల నగదు, మూడు తులాల బంగారం, నేరానికి ఉపయోగించిన మోటర్‌సైకిల్‌ను రికవరీ చేసి కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్ ఎదుట హాజరుపరిచారు. మంగళవారం సాయంత్రం కర్నూలు తాలూకా సీఐ చలపతిరావు, ఎస్ఐ శ్రీనివాసరావుతో కలసి తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. సి.బెళగల్ మండలం పోలకల్లు గ్రామానికి చెందిన బోయ బూడిదపాడు రాజు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న క్రమంలో కర్నూలు శివారులోని సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద స్థలం కొనుగోలు కోసం వెళ్లి పోలీసుల వలకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇతను కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, ఎమ్మిగనూరు, నందవరం, కర్నూలు నాల్గవ పట్టణం, ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్, ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీ కేసుల్లో నిందితుడిగా తేలాడు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా ఉండవల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా చోరీలకు పాల్పడినట్లు నేరస్థుడు అంగీకరించాడు. భారీ మొత్తంలో నగదు రికవరీ.. కర్నూలు సమీపంలోని మామిదాలపాడు గ్రామ శివారులో ఫిబ్రవరి 10వ తేదీన ఓ వ్యక్తిని బెదిరించిన సంఘటనలో రూ.15 వేలు, గత ఏడాది నవంబర్‌లో కర్నూలులోని వీకే వైన్స్ దగ్గర గర్భిణీ స్త్రీతో వచ్చిన వ్యక్తిని బెదిరించి రూ.15 వేలు, టీజీ పెట్రోల్ బంకు దగ్గర ఓ వ్యక్తిని బెదిరించి రూ.13 వేలు చోరీ చేశాడు. గత నెలలో కర్నూలు శివారులోని చిన్నటేకూరు దగ్గర జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లను బెదిరించి రూ.25 వేలు లాక్కున్నాడు. అలాగే నందికొట్కూరు రోడ్డులోని యల్లమ్మ గుడి దగ్గర గత ఏడాది అక్టోబర్ నెలలో పోలీసు పేరుతో అమాయకులను బెదిరించి రూ.20 వేలు లాక్కున్నాడు. జిల్లాలో ఇలాంటి తరహాలో 25కు పైగా నేరాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. గతంలో మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో 25 సెల్ఫోన్లు దొంగలించి పోలీసు వలకు చిక్కి జైలుకు వెళ్లాడు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగదుతో పాటు నగలను రికవరీ చేసినందుకు తాలూకా సిబ్బంది శివరంగయ్య, సులేమాన్, సుబ్బరాయుడు, మహబూబ్ బాషా తదితరులను డీఎస్పీ అభినందించారు. మిస్టరీ కేసులను ఛేదించే విషయంలో పోలీసుల కృషిని అభినందిస్తూ డీజీపీ చేతుల మీదుగా అందించే బెస్ట్ క్రైం డిటెక్ట్ ఏబీసీడీ అవార్డుకు ఈ కేసును ప్రతిపాదించినట్లు డీఎస్పీ వెల్లడించారు. మఫ్టీ పోలీసులమంటూ మాయమాటలు చెప్పేవారిని అమాయకంగా నమ్మి మోసపోవద్దని ప్రజలకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. కోర్టు అనుమతితో నిందితుడిని మరోసారి అదుపులోకి తీసుకుని టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్‌ను నిర్వహించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రెండు సంవత్సరాల వ్యవధిలో నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను బెదిరించి మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. నేరం చేసే విధానం.. నగర శివార్లు, జాతీయ రహదారుల్లో మఫ్టీ పోలీసు ముసుగులో తిరుగుతూ అమాయకులు, ముసలివాళ్లు, ఆడవాళ్లను ఎంపిక చేసుకుని ‘నేను పోలీసును. మీరు వస్తున్న దారిలో నా పర్సు పడిపోయింది. ఈ దారిలో నువ్వు తప్ప ఎవరూ రాలేదు. ఆ డబ్బుల పర్సు నీ దగ్గరే ఉంది. పర్సులో ఉన్నవన్నీ రూ.500/2000 నోట్లు. వాటి నంబర్లు నా దగ్గర సెల్ఫోన్లో ఉన్నాయి. నీ దగ్గర ఉన్న డబ్బు చూపించు. అందులో నా నోట్లు ఏవో గుర్తు పడతా.. అంటూ నమ్మబలికి వారి వద్ద ఉన్న డబ్బును బయటకు తీసి చూపించగానే ఆ మొత్తం లాక్కుని మోటర్‌సైకిల్‌పై ఉడాయించేవాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా పోలీసు భాషలో మాట్లాడి బెదిరించేవాడు. కొంతమంది డబ్బు చూపడానికి ఒప్పుకోకపోతే దౌర్జన్యకర మాటలతో అంతు చూస్తానని ఎస్ఐ సమీపంలో జీపులో ఉన్నారు, అక్కడకు రండి అంటూ డబ్బు చూపించే విధంగా వారిని బెదిరించి మొత్తాన్ని తీసుకుని ఎస్ఐకి చూపిస్తాను.. అక్కడికి రండి.. అంటూ మోటార్‌సైకిల్‌పై తప్పించుకుని ఉడాయించేవాడు. గత ఏడాది జూన్‌లో కర్నూలు కోర్టు వద్ద ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలిని పరిచయం చేసుకుంటూ పలానా న్యాయవాది ఎక్కడ ఉన్నాడంటూ ఆరా తీసినట్లు నమ్మించి, ఆమె దృష్టి మరల్చి మెడలో బంగారు తాలిబొట్టు, చైన్ లాక్కుని ఉడాయించాడు. 200కు పైగా ఈ తరహా నేరాలకు పాల్పడినప్పటికీ అనేక కేసులు రికార్డులకు ఎక్కలేదు. పోలీసు విచారణలో దాదాపు 5 కేసులు ఇలాంటివి వెలుగుచూశాయి. -
మోస్ట్ వాంటెడ్ చికెన్‌బాబా అరెస్ట్
అనంతపురం, హిందూపురం అర్బన్: మట్కా నిర్వాహణలో ఆరితేరి పోలీసుల రికార్డులో మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న చికెన్‌బాబాను బుధవారం అరెస్టుచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హిందూపురం వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు మీడియాకు వెల్లడించారు. హిందూపురం, పరిసర ప్రాంతాల్లో అత్యధికగా మట్కా లావాదేవీలు కొనసాగించే చికెన్‌బాబాను అరెస్టు చేయడానికి హిందూపురం పోలీసులే కాకుండా కర్ణాటక పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎస్పీ ఇతన్ని జిల్లా బహిష్కరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే చికెన్‌బాబా పరారీ కావడం, తర్వాత ఎస్పీ, స్థానిక పోలీసు అధికారుల బదిలీలు కావడంతో ఆ ప్రణాళిక నిలిచిపోయింది. అయితే తన అనుచరులతో మట్కాను నిరాటంకంగా సాగిస్తున్న చికెన్‌బాబాను పోలీసులు మేళాపురం వద్ద అరెస్టు చేసి రూ.2.25 లక్షల నగదు, సెల్‌ఫోన్, ప్రింటర్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెల 28న బాబా ముఖ్య అనుచరుడైన మంజునాథ్ అలియాస్ బొట్టు మంజును అరెస్టు చేసి రూ.లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకోవడం, వారం తర్వాత ఇప్పడు చికెన్‌బాబా అరెస్టు కావడంతో అంతా నాటకీయంగా సాగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సునీల్ దొరికాడు
కడప అర్బన్ :మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్‌స్టర్, జీవితఖైదు పడిన మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ ఆటో డ్రైవర్ నుంచి మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్‌స్టర్ దాకా ఎదిగి ప్రజల జీవనానికి ఆటంకం కలిగించేవాడు. అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలకు పాల్పడేవాడు. ఇంటర్, ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా వారిని ఆకట్టుకుని డబ్బులు, మద్యం, మగువలను ఎరగా వేసి గ్యాంగులుగా తీర్చిదిద్దాడు. 2010 నుంచి ఇప్పటిదాకా సునీల్‌కుమార్‌పై నాలుగు జిల్లాల్లో దాదాపు 19 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో వైఎస్సార్ జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 కేసులు, అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో మూడు కేసులు, కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇదీ సునీల్ నేర చరిత్ర ప్రొద్దుటూరు పట్టణ నివాసి మండ్ల సునీల్‌కుమార్ ఐదేళ్ల కిందట 150 నుంచి 200 మంది యువతను ప్రలోభాలతో చెడుదారి పట్టించి తన ఆధీనంలో గ్యాంగ్‌ను నడిపాడు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, చీటింగ్‌లు, అక్రమ ఆయుధాల కేసులు లాంటి నేరాలకు పాల్పడి ఇప్పటివరకు 19 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల అనంతపురం జిల్లా నార్పల కిడ్నాప్ కేసుకు సంబంధించి జీవితఖైదు విధించారు. కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. 2014లో ఒకసారి కడప సెంట్రల్ జైలులోకి వెళుతూ అనంతపురం నుంచి వచ్చిన ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి పారిపోయి కృష్ణా జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. గతనెల 27వ తేదీన కర్నూలులో కోర్టు వాయిదాకు వెళ్లిన సునీల్‌కుమార్‌ను వాయిదాకు తీసుకెళ్లేందుకు కర్నూలు జిల్లా నుంచి ముగ్గురు ఏఆర్ పోలీసులు ఎస్కార్టుగా వచ్చారు. అక్కడి నుంచి వారిని మభ్యపెట్టి కడప బిల్టప్ జంక్షన్ వద్దకు రాగానే కేంద్ర కారాగారానికి వెళ్లకుండా దిగారు. అంతలోపు అతని బంధువులు రెండు మోటారు సైకిళ్లను, ఒక కారును, ఒక మహిళను తమతోపాటు తీసుకొచ్చారు. పెండ్లిమర్రి మండలం నందిమండలం కొండ గంగమ్మ గుడి వద్దకు అందరూ వెళ్లారు. అక్కడ పోలీసు ఎస్కార్టును దూరంగా ఉంచి సునీల్‌కుమార్, అతని అనుచరులు కారుతోపాటు పోలీసుల తుపాకులు దొంగలించి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై అదేరోజు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఇదే సంఘటనకు సంబంధించి ఈనెల 1వ తేదిన ముగ్గురు ఏఆర్ పోలీసులను, సునీల్‌కుమార్ అనుచరులలో ముగ్గురిని డీఎస్పీ ఆద్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు సునీల్‌కుమార్ కోసం కడప, బెంగుళూరు, ముంబయి ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సునీల్‌కుమార్‌ను బెంగుళూరులోని రాజాజీ రోడ్డులో ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. ♦ సునీల్‌కుమార్ పెండ్లిమర్రి మండలం నందిమండలం నుంచి కారులో వెళ్లాడు. ఆయుధాలను తన అనుచరులైన గోపాల్, శ్రీనివాసులకు అప్పగించి మిగతా అనుచరులతో మోటారు సైకిళ్లపై పారిపోయాడు. ♦ చిన్నచెప్పలి వద్ద గుట్టపై అదేరోజు తన అనుచరుడు హరితోపాటు ఉండి అక్కడి నుంచి ఒక రైతు మోటారు సైకిల్ దొంగలించి ఎర్రగుంట్లకు వచ్చి రైలులో బళ్లారి, అక్కడి నుంచి బస్సులో హోస్పేటకు పారిపోయాడు. హోస్పేటలో రెండు రోజులు లాడ్జిలో ఉండి అక్కడి నుంచి ముంబయికి బస్సులో వెళ్లాడు. ఏప్రిల్ 1వ తేదిన ముంబయికి చేరుకుని అదేరోజు రాత్రి బస్సులో బెంగళూరుకు చేరుకున్నాడు. 2వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ రాత్రి వరకు బెంగళూరులోని పేయింగ్ గెస్ట్రూములో ఉన్నాడు. అక్కడికి చేరుకున్న పోలీసు బృందం బెంగుళూరులోని రాజాజీనగర్ రోడ్డులో అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని తాడిగొట్ల క్రాస్ రోడ్డు వద్దకు తీసుకు రాగా కాలకృత్యాలు తీర్చుకునే నెపంతో పోలీసులపై రాళ్లతో దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసు బృందం సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుంది. ♦ 2014లో జిల్లాలోని పులివెందుల–తాడిపత్రి మార్గమధ్యంలో ఓ వాహనంలో వేట కొడవళ్లు పెట్టుకుని కిడ్నాప్ నకు ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటి జమ్మలమడుగు ఏఎస్పీ అప్పలనాయుడు పర్యవేక్షణలో సింహాద్రిపురం ఎస్ఐగా పనిచేసిన ఎన్.రాజరాజేశ్వర్‌రెడ్డి తమ బృందంతో కలిసి అరెస్టు చేశారు. ♦ కడప కేంద్ర కారాగారం గేటు బయటి నుంచి 2014లో వాయిదాకు వెళ్లి వచ్చి ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కడప కేంద్ర కారాగారంలో కూడా ప్రతి ఆదివారం ఒక కిలో మేరకు చికెన్‌గానీ, మటన్గానీ తీసుకుని కడుపారా ఆరగించి తన అనుచరులకు కూడా ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఎస్కార్టు వెళ్లిన ప్రతిసారి తనకు అనుకూలంగా ఉండే పోలీసుల ద్వారా మద్యం సేవించడం, కడుపార తినడం, అవసరాలు తీర్చికోవడం పరిపాటిగా మారిందని తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారంలోనే సునీల్‌కుమార్ వచ్చినప్పటి నుంచి దాదాపు 15 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
మోస్ట్ వాంటెడ్ విక్కీ ఖతం
ఛండీగఢ్ : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ విక్కీ గౌండర్ ఎట్టకేలకు హతమైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి రాజస్థాన్ పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో విక్కీ ప్రధాన అనుచరుడు, నభా జైలుదాడి సూత్రధారి ప్రేమ లహోరియా కూడా మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే చిన్నతనం నుంచే నేరప్రవృత్తిని అలవర్చుకున్న విక్కీ.. తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా మారిన పరిణామం అంశం ఓసారి పరిశీలిస్తే... విక్కీ ఓ సంచలనం... విక్కీ గౌండర్ అలియాస్ జిందర్.. అసలు పేరు హర్జిందర్ భుల్లార్. విక్కీది స్వగ్రామం టర్ఫ్ లంబిలోని సరవాన్ బొద్లా. చిన్నతనంలో జేబు దొంగలకు సహయకుడిగా వ్యవహరించేవాడు. ఆ పై బ్లేడు దొంగగా మారి క్రమక్రమంగా గ్యాంగ్‌స్టర్ గా మారిపోయాడు. సుపారీలు తీసుకుని స్థానిక నేతలను హత్య చేయటం.. అక్రమ ఆయుధాల సరఫరా.. ఉగ్రవాదులకు సాయం... ఇలా మొత్తం 83 కేసులు అతని మీద ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకుల అండతోనే అతను అలా చెలరేగిపోయేవాడని.. పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా అతనికి సహకరించేవారన్న ఆరోపణలు ఉండేవి. ఇక గౌండర్ ఫేస్ బుక్‌లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటాడు. పోలీసులు తనపై కేసులు నమోదు చేసినప్పుడల్లా వారికి చిక్కకుండా.. ఫేస్బుక్ ద్వారానే వాటిని ఖండిస్తుంటాడు. అయితే జైలుకెళ్లాక అక్కడి నుంచి కూడా అతను ఫేస్బుక్లో అప్డేట్లు చేయటం విమర్శలకు దారితీయగా.. ఇద్దరు అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు కూడా. ఇక్కడ సంచలన విషయం ఏంటంటే.. నభా జైలుపై దాడి జరిగింది ఉగ్రవాదులను విడిపించేందుకు కాదు. విక్కీ కోసమే. అయితే దాడి గురించి ముందుగా తెలుసుకున్న ఉగ్రవాదులు.. విక్కీతో డీల్ కుదుర్చుకోవటంతో వారిని కూడా తప్పించారు. ఈ విషయాన్ని దాడి ప్రధాన సూత్రధారి పర్విందర్ సింగ్ పిందా విచారణలో వెల్లడించటంతో పోలీస్ శాఖ ఉలిక్కి పడింది. నభా జైలు దాడి... పటియాలాలోని నభా జైలుపై 2016 నవంబర్ చివరి వారంలో 10మంది సాయుధులు పోలీసు దుస్తుల్లో వచ్చి దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్, ఉగ్రవాది కశ్మీరా సింగ్ తోపాటు మరో నలుగురు గ్యాంగ్స్టర్లను విడిపించుకెళ్లారు. వారి పేర్లు విక్కీ గోండ్రా, గుర్ప్రీత్ సింగ్, నితిన్ డియోల్, విక్రమ్‌జీత్ సింగ్. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మింటూ... పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందిన హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూ పంజాబ్‌లో వేర్పాటువాద చిచ్చును రగిల్చేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని 2014 నవంబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నభా జైలు ఘటనలో అతను తప్పించుకోవటంతో అతన్ని పట్టుకునేందుకు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆపై పది రోజుల్లోనే మింటూను ఢిల్లీ సరిహద్దులో అరెస్ట్ చేశారు. ఇక జైలు నుంచి నలుగురు గ్యాంగ్స్టర్లలో ఇద్దరిని గతేడాది అదుపులోకి తీసుకోగా.. విక్కీతోపాటు మరొకరు ఇంతకాలం పరారీలో ఉన్నారు. ఉగ్రవాది కశ్మీరా సింగ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎట్టకేలకు విక్కీ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. -
టీవీ యాంకర్‌కు జీవితఖైదు
న్యూఢిల్లీ: 17 ఏళ్ల కిందట భార్యను హతమార్చిన ప్రముఖ టీవీ యాంకర్ సుహైబ్ ఇల్యాసికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒకప్పుడు పాపులర్ అయిన 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' టీవీ క్రైమ్ షోకు సుహైబ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. సుహైబ్ భార్య అంజు ఇల్యాసి 2000 సంవత్సరం జనవరి 11న కత్తిపోట్లతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు విడిచింది. మొదట ఆమెది ఆత్మహత్యగా భావించారు. కానీ అంజు తల్లి, సోదరి ఆమెది ఆత్మహత్య కాదని, భర్త ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని డివిజనల్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. కట్నం కోసం అంజును నిత్యం సుహైబ్ వేధించేవాడని తెలిపారు. ఈ ఆరోపణలను సుహైబ్ తిరస్కరించారు. అతనిపై విచారణకు మొదట ట్రయల్ కోర్టు నిరాకరించగా.. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో విచారణ మలుపు తిరిగింది. భార్య అంజు చనిపోయిన సమయంలో 'మోస్ట్ వాంటెడ్ షో' హోస్ట్‌గా, నిర్మాతగా సుహైబ్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. -
నగరంపై నయీం టెర్రర్!
► దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్ ► ఐపీఎస్ వ్యాస్ నుంచి పటోళ్ళ వరకు... ► 2007లో నాంపల్లి కోర్టు నుంచి ఎస్కేప్ అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు...అనేక మంది రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు... మాజీ నక్సలైట్లు, మావోయిస్టులకూ కంటి మీద కునుకు ఉండదు... వ్యాపారులు, బడాబాబులైతే అతడి కన్ను తమ మీద పడకూడదని ఆశిస్తుంటారు. లెక్కలేనన్ని హత్యలు, బెదిరింపులతో పాటు సెటిల్మెంట్లు తన ఖాతాలో వేసుకుని మోస్ట్ వాంటెడ్‌గా మారిన నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం వ్యవహారమిది. కరుడుగట్టిన ఈ నేరగాడి పడగ నగరంలోనూ విస్తరించి ఉంది. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య నుంచి పటోళ్ళ గోవర్థన్‌రెడ్డి మర్డర్ వరకు సిటీలో జరిగిన దారుణ హత్యలకు నయీం కేరాఫ్ అడ్రస్. సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన నేరగాడు నయీముద్దీన్ కథలో ఆద్యంతాలు నగరానికి ‘తూర్పు పడమర’ల్లోనే జరిగాయి. సిటీకి తూర్పు దిక్కున ఉన్న నల్లగొండ జిల్లా భువనగిరి నయీం స్వస్థలం. సమ సమాజ స్థాపన కోసం అంటూ మూడున్నర దశాబ్ధాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరడం, నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయం అంటూ ప్రకటించడం, కోవర్టుగా మారడం, బెదిరింపుల వరకు బరితెగించడం... ఇలా ప్రతిఘట్టంలోనే సిటీ ‘పాత్ర’ సుస్పష్టం. సుదీర్ఘకాలం పరారీలో ఉండి, పోలీసుల్ని ‘ముప్పతిప్పలు’ పెట్టి ఎట్టకేలకు సోమవారం ఎన్కౌంటర్లో హతమైన షాద్‌నగర్ ప్రాంతం సిటీకి పడమర దిక్కున ఉంది. ఇలా నయీముద్దీన్ ‘ఉదయాస్తమానాలు’ నగరానికి తూర్పు, పడమర దిక్కుల్లోనే జరిగాయి. హత్య చే(యి)స్తే దారుణమే... నయీం చేసిన అనేక దారుణహత్యల్ని ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో వెలుగులోకి వచ్చిన బెల్లి లలిత అత్యంత దారుణ హత్యతో అతడి పేరు మారుమోగింది. గ్రేహౌండ్స్‌కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్, పౌర హక్కుల నేత పురుషోత్తం, వ్యాపారవేత్త రామకృష్ణ, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు, ఘరానా నేరగాడు పటోళ్ల గోవర్థన్‌రెడ్డి... ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. ఈ కేసులకు సంబంధించి అనేక కోర్టుల్లో ఇతడిపై నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నయీం నిందితుడిగా ఉన్న ఐపీఎస్ వ్యాస్ హత్య కేసు, 2005 నాటి రాజస్థాన్ ఆయుధాల కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ రెండు కేసుల్లోనూ మిగిలిన నిందితులపై అభియోగాలు వీగిపోయినా, శిక్షలు పడినా నయీం పరారీలో ఉండటంతో అతడిపై విచారణకు బ్రేక్ పడింది. ఫిర్యాదు చేసేందుకూ హడలే... ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో అరెస్టు అయిన నయీం తన పంథా మార్చుకుని నక్సల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘గ్రీన్‌టైగర్స్’ పేరుతో 2000 నవంబర్ 23న సరూర్‌నగర్ పరిధిలోని మధుపురికాలనీలో ఏపీసీఎల్సీ నేత పురుషోత్తమ్‌ను పట్టపగలు దారుణంగా హత్య చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరో ఏపీసీఎల్సీ నేతనూ కిడ్నాప్ చేశాడు. దాదాపు వారం రోజుల పాటు నిర్భంధించి, తీవ్రంగా బెదిరించిన తర్వాత గుండు గీయించి మరీ వదిలిపెట్టాడు. చెర నుంచి బయటకు వచ్చిన ఆయన కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యమూ చేయలేదు. ‘గుండు’ విషయం అడిగితే పుణ్యక్షేత్రాల పేరు చెప్పి ‘తప్పించుకున్నారు’. -
మాజీ ఎమ్మెల్యే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
న్యూఢిల్లీ: అతను మాజీ ఎమ్మెల్యే. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. కానీ ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన టాప్ మోస్ట్ వాంటెడ్-20 మంది నేరస్థుల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిలిచాడు. ఆయనను పట్టుకున్నవారికి లక్ష రూపాయల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. ఆయనే రామ్ బిర్ షోకిన్. ఢిల్లీలోని మాండ్కా శాసనసభ స్థానం నుంచి ఆయన 2013లో సంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనపై గతేడాది మోకా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసును నమోదు చేశారు. తన మేనకోడలు నీరజ్ భావన ప్రధాన సూత్రధారిగా ఉన్న సిండికేట్ అక్రమ కార్యకలాపాల వ్యవహారంలో ఆయనకు ప్రమేయం ఉండటమే ఇందుకు కారణం. భావనపై విచారణకు ఆటంకం కలిగించినందుకు, గతేడాది ఆయనపై ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి షోకిన్ అజ్ఞాతంలోఉన్నాడు. రెండు నెలల క్రితం ఢిల్లీ పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆయన పేరును చేర్చారు. ఇందులో ఆయన 10 మోస్ట్ వాంటెడ్ నేరస్థునిగా ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
మోస్ట్ వాంటెడ్!
తెలుగు తెరపై పరభాషా ప్రతినాయకుల జోరు ఎక్కువైంది. ఇది సహాయ నటులకు కూడా వర్తిస్తుం దనే చెప్పాలి. ముఖ్యంగా తమిళ పరిశ్రమ నుంచి నాజర్ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటిస్తుంటారు. తాజాగా, సత్యరాజ్ హవా కూడా మొదలైంది. గోపీచంద్ హీరోగా నటించిన ‘శంఖం’ సినిమా తెలుగులో సత్యరాజ్‌కి తొలి స్ట్రయిట్ మూవీ. ఆ తర్వాత వచ్చిన ‘మిర్చి’తో సత్యరాజ్ ఇక్కడ ‘మోస్ట్ వాంటెడ్ కేరెక్టర్ ఆర్టిస్ట్’ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రంలో ‘కట్టప్ప’ పాత్ర పోషిస్తున్నారు. మహేశ్‌బాబు హీరోగా నటించనున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కూడా నటించనున్నారు. ఇవే కాకుండా సత్యరాజ్‌కి తెలుగులో మరిన్ని భారీ ఆఫర్లు ఉన్నాయి. -
మోస్ట్ వాంటెడ్ ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్:నగరంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇరానీ గ్యాంగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఇరానీ గ్యాంగ్ ఎట్టకేలకు రాష్ట్ర పోలీసులకు చిక్కింది. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో 3.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరానీ గ్యాంగ్ పై ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 100 పైగా కేసులు ఉండటం గమనార్హం. -
సాహూరే..
సీసీఎస్ బృందానికి చెమటలు పట్టిస్తున్న గజదొంగ రకరకాల రిసీవర్ల పేర్లు చెప్పి ఏమార్చే యత్నం ముంబయి, పూణె చుట్టూ తిరుగుతున్న పోలీసులు విజయవాడ సిటీ : గజదొంగ ప్రకాష్‌కుమార్ సాహూ సీసీఎస్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. చోరీ సొత్తు రికవరీ కోసం సాహూను వెంటపెట్టుకుని వెళ్లిన సీసీఎస్ పోలీసులు ముంబయి, పూణె మధ్య చక్కర్లు కొడుతున్నారు. రోజుకో రిసీవర్ పేరు చెబుతుండటంతో సొత్తు రికవరీ కోసం వెళ్లిన సీసీఎస్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నట్టు తెలిసింది. గతంలోనూ ఇదే పంథా మార్చి 25వ తేదీన ప్రసాదంపాడులోని సాయిబాబా మందిరంలో 40 కిలోల వెండి, ఇతర సామగ్రిని సాహూ చోరీ చేశాడు. ఇది గుర్తించిన పోలీసులు కొద్దిరోజుల కిందట అతడినిఅదుపులోకి తీసుకున్నారు. అయితే, సాహూ పట్టివేత విషయం రిసీవర్లకు తెలియడంతో కొందరు అప్రమత్తమయ్యారు. చోరీ సొత్తు ముంబయి, పూణెలో విక్రయించినట్లు సీసీఎస్ అధికారుల విచారణలో సాహూ అంగీకరించడంతో రికవరీ కోసం ప్రత్యేక బృందం సాహూను వెంటబెట్టుకుని ముంబయి వెళ్లింది. అక్కడ అతను చెప్పినట్టుగా రిసీవర్లు లేకపోవడం, పదేపదే పేర్లు మార్చడంతో పోలీసులకు రికవరీ కష్టంగా మారింది. ముంబయి, పూణెలోని పలువురు ఉత్తరాది వ్యాపారుల పేర్లు చెబుతున్న సాహూ వారిని చూపించకుండా ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. గతంలో దుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ కేసులో కూడా సీఐడీ పోలీసులను సాహూ ఇలాగే బోల్తా కొట్టించాడు. 1998లోనే శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య దేవాలయం, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయాల్లో చోరీ జరిగింది. రోజుల వ్యవధిలో జరిగిన రెండు చోరీల్లోనూ గ్యాస్ కట్టర్లే ప్రధాన ఆధారం. భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసులు కావడంతో దర్యాప్తు బాధ్యతను సీఐడీ పోలీసులకు అప్పగించగా సాహూను అరెస్టు చేశారు. అప్పట్లో కూడా పూటకో సమాచారం ఇస్తూ సాహూ సీఐడీ పోలీసులను ఇబ్బందులకు గురిచేశాడు. సాయి మందిరాలే టార్గెట్టా..? మొదటి నుంచి దేవాలయాలనే చోరీలకు ఎంచుకునే సాహూ ఎక్కువగా సాయిబాబా మందిరాల్లోనే ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని సీసీఎస్ వర్గాల సమాచారం. మన రాష్ట్రంతో పాటు కేరళలోని కొన్ని దేవాలయాలను మినహాయిస్తే ఇప్పటివరకు చేసిన 40కిపైగా నేరాల్లో సాయిబాబా మందిరాలే అధికంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాబా మందిరాల్లో అపారమైన సంపద, నామమాత్ర భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు చేసిన అన్ని చోరీల్లోనూ గ్యాస్‌కట్టర్‌తో తలుపులు, గేట్లు తొలగించుకుని లోపలికి ప్రవేశించాడు. పైగా సాహూకు స్థానిక నేరస్తుల సహకారం ఉంటోందని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసినా ఫలితం లేకుండాపోయింది. ఉత్తరాది వ్యాపారులకే విక్రయం సాహూ చోరీ చేసిన దేవుళ్ల కిరీటాలు, ఇతర నగలు గంటల వ్యవధిలోనే ముక్కలుగా చేస్తాడు. గుర్తించేందుకు వీల్లేకుండా చేసి తర్వాత ముంబయి, పూణెలోని ఉత్తరాది వ్యాపారులకు అమ్ముతాడు. కొన్నింటిని కరిగించి అమ్ముతుంటాడు. దేవతల నగలుగా ఆనవాళ్లు లేకుండా చేసి వ్యాపారులకు అనుమానం రాకుండా విక్రయించడంలో సాహూ సిద్ధహస్తుడు. కొందరు వ్యాపారులకు అతను విక్రయించేది దొంగసొత్తు అని తెలిసి కూడా తక్కువ ధరకు వస్తుండటంతో కొంటున్నట్లు సమాచారం. -
మేకప్ వేసుకోని రోజంటూ లేదు!
కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే మాటలతో రకుల్ ప్రీత్‌సింగ్ ఏకీభవిస్తున్నారు. కథానాయికగా ఆమె అరంగేట్రం ఓ చిన్న సినిమాతో మొదలైంది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబ నుంచి వచ్చిన అమ్మాయి కూడా కాదు. కానీ, ప్రతిభ, కష్టపడే మనస్తత్వం రకుల్‌ని ఇప్పుడు ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ని చేసేశాయి. ప్రస్తుతం ఈ ఢిల్లీ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. ఈ మూడేళ్లల్లో దాదాపుగా మేకప్ వేసుకొని రోజు ఒక్కటి కూడా లేదని రకుల్ అంటున్నారు. ఒకవేళ సినిమా చిత్రీకరణ లేకపోతే, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణలతో బిజీగా ఉంటున్నారామె. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్‌లో రకుల్ ముందుంజలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మాటలకు రకుల్ స్పందిస్తూ - ‘‘ఎవరైనా నా దగ్గరైన ఈ మాటలు అన్నప్పుడు ‘ధన్యవాదాలు’ చెబుతుంటాను. ఎందుకంటే, నాకీ స్థానం ఆయాచితంగా రాలేదు. సినిమా సినిమాకీ నటిగా వ్యత్యాసం కనబర్చుగలుగుతున్నాను. అలుపూ సొలుపూ లేకుండా షూటింగ్స్ చేస్తున్నాను. నా వృత్తి అంటే నాకు బోల్డంత అభిమానం ఉంది. దీనికోసం ఎంతైనా కష్టపడతా. ఆ కష్టాన్ని గుర్తించి, ఎవరైనా అభినందిస్తే ఆనందిస్తా’’ అన్నారు.