సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ, పలుమార్లు జైలుకెళ్లినా బుద్ది మార్చుకోని మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు రమేష్ రాచకొండ పోలీసులకు చిక్కాడు. గతేడాది డిసెంబర్‌లో ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఓ కారును చోరీ చేసిన ఇతడిపై ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు నిఘా పెట్టారు. శనివారం తెల్లవారు జామున ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రమేష్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ యాదగిరితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు.
► సూర్యాపేట జిల్లా, చివేముల మండలం, మూ న్యా నాయక్ తండాకు చెందిన ధారావత్ రమేష్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. జనసంచారం లేని చోట పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రాత్రి వేళల్లో వాటిపై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని చోరీలకు పాల్పడేవాడు.
► ప్రస్తుతం రమేష్‌పై రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో 10 కేసులు, సూర్యాపేటలో 5, నల్లగొండలో 3, విశాఖపట్నంలో 2, కొత్తగూడెం, విజయవాడలో ఒక్కో కేసు న్నాయి. సూర్యాపేట టు టౌన్ పోలీసు స్టేషన్‌లో నమోదైన 15 కేసుల్లో రమేష్ పరారీలో ఉన్నాడు. మోత్కూరు ఠాణాలో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) కూడా జారీ అయింది. 2017లో నాగార్జునసాగర్ పోలీసులు రమేష్‌ను దోపిడీతో పాటు హత్యాయత్నం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. చివరిసారిగా 2019లో ఖమ్మంలోని రఘునాథపాలెం పోలీసులు ఇతడిని వాహనం చోరీ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2021 సెప్టెంబర్‌లో కరోనా కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా ప్రవృత్తి మార్చుకోలేదు.
► గతేడాది డిసెంబర్ 22న ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని సూర్యోదయ నగర్ కాలనీలోని శ్రీదుర్గా కార్స్ ఆఫీసులో చొరబడి టేబుల్‌పైన ఉన్న కారు తాళాలను తీసుకుని స్కోడా కారును దొంగిలించాడు. ఈ కేసులో రమేష్‌పై ఎల్బీనగర్ సీసీఎస్, ఎల్బీనగర్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో తిరుగుతున్న అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.35.55 లక్షల విలువ చేసే 10 తులాల బంగారం ఆభరణాలు, 2 కార్లు, 2 బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment