నాకు స్వీట్ షాక్ తగిలినట్లయ్యింది..!
‘‘షారుక్ ఖాన్ సినిమాలు చూస్తూ పెరిగినదాన్ని. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. నా అభిమాన నటుడాయన. అందుకే, షారుక్ మా షూటింగ్ లొకేషన్‌కి వచ్చినప్పుడు నాకు స్వీట్ షాక్ తగిలినట్లయ్యింది’’ అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. వరుస విజయాలతో తెలుగులో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అయిన రకుల్‌కి హిందీ రంగంలో కూడా బాగానే అవకాశాలొస్తున్నాయి.
ప్రస్తుతం హిందీలో ఆమె ‘సిమ్లా మిర్చి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబయ్‌లోని మెహబూబ్ స్టూడియోస్‌లో జరుగుతోంది. అదే స్టూడియోలో షారుక్ కూడా షూటింగ్ చేస్తున్నారట! రమేష్ సిప్పీ ఆ స్టూడియోలో ఉన్న విషయం తెలుసుకుని, ఆయన్ను కలవడానికి ఈ బాలీవుడ్ బాద్‌షా ‘సిమ్లా మిర్చి’ లొకేషన్లోకి అడుగుపెట్టారట. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ - ‘‘షారుక్‌ని నేను మొదటిసారి కలిసింది ఆ రోజే. మొత్తం మా యూనిట్ అందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు.
తన తదుపరి చిత్రం గురించి మాతో కొన్ని విశేషాలు పంచుకున్నారు. అలాగే, రమేష్ సిప్పీ గొప్పతనం గురించి వివరించారు. మా లొకేషన్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఆయన ఉన్నారు. అందర్నీ పలకరించారు. పెద్ద స్టార్ అయినప్పటికీ.. అదేం ప్రదర్శించకుండా చాలా మామూలు వ్యక్తిలా అందరితో మాట్లాడారు. షారుక్ మా లొకేషన్లోకి రావడం, మాతో మాట్లాడటం అనేది నాకు ఇంకా కలలా అనిపిస్తోంది’’ అని చెప్పారు.