నయీం.. ఏపీ దావూద్
-
పదుల కేసులున్న మాజీ నక్సలైట్
-
ఇప్పటికీ ‘పట్టుకోలేక’పోతున్న పోలీసులు
-
ఉన్నతాధికారుల అండదండలనే ఆరోపణ
-
కొనపురి రాములు హత్యతో మళ్లీ తెరపైకి
సాక్షి, హైదరాబాద్: నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్‌మెంట్లను తన ఖాతాలో వేసుకుని రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన మాజీ నక్సలైట్, ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాడు నయీం. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు. ఆదివారం నల్లగొండలో మాజీ మావోయిస్టు, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపురి రాములు దారుణ హత్యతో నయీం పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
నక్సలైట్ నుంచి కోవర్టుగా
నల్లగొండ జిల్లా భువ నగిరికి చెందిన నయీం సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు! దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారంటారు.
ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం
కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ‘ఆయుధం’గా కూడా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకుంటారని వినిడికి. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ‘పోలీసు ఆయుధం’ జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు. రాష్ట్రానికి చెందిన కొందరు ఉన్నతాధికారుల మద్దతేఇందుకు కారణమని తెలుస్తోంది.
దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్
నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్‌కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్‌లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్‌మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్‌ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి... ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఎక్కడా బయటికి రాకుండా
నయీం నేరాలు చేయించే స్టైల్, ఆ తరవాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్‌లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా కుట్రల్ని జంట కమిషనరేట్ల పోలీసులు అనేక సార్లు ఛేదించారు. అయితే నేరాలకు పాల్పడేది ఒకరైతే, 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు! అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాదు. సంచలనాత్మక హత్య జరిగిన ప్రతిసారీ అది నయీం పనేనని ప్రకటించే పోలీసులు, అతన్ని పట్టుకోవడంలో మాత్రం ‘విఫలమవుతుంటారు’.