టక్కరి దొంగ.. చిక్కాడిలా..! | Thief Arrest in Kurnool | Sakshi
Sakshi News home page

టక్కరి దొంగ.. చిక్కాడిలా..!

Published Wed, Mar 6 2019 1:07 PM | Last Updated on Wed, Mar 6 2019 1:07 PM

Thief Arrest in Kurnool - Sakshi

నిందితుడు బోయ బూడిదపాడు రాజును అరెస్టు చూపుతున్న పోలీసులు

అతనొక్కడే.. ఎవరి సహకారం తీసుకోడు.. ఒంటరివాడే కదా అని తీసిపారేయకండి. మహా టక్కరి దొంగ.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 200కు పైగా దొంగతనాలు చేశాడు. పోలీస్‌ పేరుతో కొన్నేళ్ల పాటు తన చోర కళను అప్రతిహతంగా కొనసాగించాడు. 2016లో ఓ కేసులో సీసీ కెమెరాకు చిక్కాడు. వేలిముద్రలతో అడ్డంగా దొరికిపోయి జైలు శిక్ష అనుభవించినా అతనిలో మార్పు రాలేదు.

కర్నూలు: జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి మఫ్టీ పోలీసు ముసుగులో చోరీలకు పాల్పడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన అంతర్‌రాష్ట్ర దొంగ బోయ బూడిదపాడు రాజు అలియాస్‌ బుడ్డోడును కర్నూలు తాలూకా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.6.25 లక్షల నగదు, మూడు తులాల బంగారం, నేరానికి ఉపయోగించిన మోటర్‌సైకిల్‌ను రికవరీ చేసి కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్‌ ఎదుట హాజరుపరిచారు. మంగళవారం సాయంత్రం కర్నూలు తాలూకా సీఐ చలపతిరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావుతో కలసి తన ఛాంబర్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్‌ వివరాలను వెల్లడించారు. సి.బెళగల్‌ మండలం పోలకల్లు గ్రామానికి చెందిన బోయ బూడిదపాడు రాజు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న క్రమంలో కర్నూలు శివారులోని సఫా ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద స్థలం కొనుగోలు కోసం వెళ్లి పోలీసుల వలకు చిక్కి కటకటాలపాలయ్యాడు. 

ఇతను కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు, ఎమ్మిగనూరు, నందవరం, కర్నూలు నాల్గవ పట్టణం, ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్, ఉలిందకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీ కేసుల్లో నిందితుడిగా తేలాడు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా చోరీలకు పాల్పడినట్లు నేరస్థుడు అంగీకరించాడు. 

భారీ మొత్తంలో నగదు రికవరీ..
కర్నూలు సమీపంలోని మామిదాలపాడు గ్రామ శివారులో ఫిబ్రవరి 10వ తేదీన ఓ వ్యక్తిని బెదిరించిన సంఘటనలో రూ.15 వేలు, గత ఏడాది నవంబర్‌లో కర్నూలులోని వీకే వైన్స్‌ దగ్గర గర్భిణీ  స్త్రీతో వచ్చిన వ్యక్తిని బెదిరించి రూ.15 వేలు, టీజీ పెట్రోల్‌ బంకు దగ్గర ఓ వ్యక్తిని బెదిరించి రూ.13 వేలు చోరీ చేశాడు. గత నెలలో కర్నూలు శివారులోని చిన్నటేకూరు దగ్గర జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లను బెదిరించి రూ.25 వేలు లాక్కున్నాడు. అలాగే నందికొట్కూరు రోడ్డులోని యల్లమ్మ గుడి దగ్గర గత ఏడాది అక్టోబర్‌ నెలలో పోలీసు పేరుతో అమాయకులను బెదిరించి రూ.20 వేలు లాక్కున్నాడు. జిల్లాలో ఇలాంటి తరహాలో 25కు పైగా నేరాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ శ్రీనివాస్‌ వెల్లడించారు.

గతంలో మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 25 సెల్‌ఫోన్లు దొంగలించి పోలీసు వలకు చిక్కి జైలుకు వెళ్లాడు. అంతర్‌రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగదుతో పాటు నగలను రికవరీ చేసినందుకు తాలూకా సిబ్బంది శివరంగయ్య, సులేమాన్, సుబ్బరాయుడు, మహబూబ్‌ బాషా తదితరులను డీఎస్పీ అభినందించారు. మిస్టరీ కేసులను ఛేదించే విషయంలో పోలీసుల కృషిని అభినందిస్తూ డీజీపీ చేతుల మీదుగా అందించే బెస్ట్‌ క్రైం డిటెక్ట్‌ ఏబీసీడీ అవార్డుకు ఈ కేసును ప్రతిపాదించినట్లు డీఎస్పీ వెల్లడించారు. మఫ్టీ పోలీసులమంటూ మాయమాటలు చెప్పేవారిని అమాయకంగా నమ్మి మోసపోవద్దని ప్రజలకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. కోర్టు అనుమతితో నిందితుడిని మరోసారి అదుపులోకి తీసుకుని టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ను నిర్వహించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రెండు సంవత్సరాల వ్యవధిలో నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను బెదిరించి మోసాలకు పాల్పడినట్లు తెలిపారు.

నేరం చేసే విధానం..
నగర శివార్లు, జాతీయ రహదారుల్లో మఫ్టీ పోలీసు ముసుగులో తిరుగుతూ అమాయకులు, ముసలివాళ్లు, ఆడవాళ్లను ఎంపిక చేసుకుని ‘నేను పోలీసును. మీరు వస్తున్న దారిలో నా పర్సు పడిపోయింది. ఈ దారిలో నువ్వు తప్ప ఎవరూ రాలేదు. ఆ డబ్బుల పర్సు నీ దగ్గరే ఉంది. పర్సులో ఉన్నవన్నీ రూ.500/2000 నోట్లు. వాటి నంబర్లు నా దగ్గర సెల్‌ఫోన్‌లో ఉన్నాయి. నీ దగ్గర ఉన్న డబ్బు చూపించు. అందులో నా నోట్లు ఏవో గుర్తు పడతా.. అంటూ నమ్మబలికి వారి వద్ద ఉన్న డబ్బును బయటకు తీసి చూపించగానే ఆ మొత్తం లాక్కుని మోటర్‌సైకిల్‌పై ఉడాయించేవాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా పోలీసు భాషలో మాట్లాడి బెదిరించేవాడు. కొంతమంది డబ్బు చూపడానికి ఒప్పుకోకపోతే దౌర్జన్యకర మాటలతో అంతు చూస్తానని ఎస్‌ఐ  సమీపంలో జీపులో ఉన్నారు, అక్కడకు రండి అంటూ డబ్బు చూపించే విధంగా వారిని బెదిరించి మొత్తాన్ని తీసుకుని ఎస్‌ఐకి చూపిస్తాను.. అక్కడికి రండి.. అంటూ మోటార్‌సైకిల్‌పై తప్పించుకుని ఉడాయించేవాడు. గత ఏడాది జూన్‌లో కర్నూలు కోర్టు వద్ద ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలిని పరిచయం చేసుకుంటూ పలానా న్యాయవాది ఎక్కడ ఉన్నాడంటూ ఆరా తీసినట్లు నమ్మించి, ఆమె దృష్టి మరల్చి మెడలో బంగారు తాలిబొట్టు, చైన్‌ లాక్కుని ఉడాయించాడు. 200కు పైగా ఈ తరహా నేరాలకు పాల్పడినప్పటికీ అనేక కేసులు రికార్డులకు ఎక్కలేదు. పోలీసు విచారణలో దాదాపు 5 కేసులు ఇలాంటివి వెలుగుచూశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement