కర్ణాటక, కేరళ, తమిళనాడులో ప్రముఖ నక్సలైట్‌గా పేరు
ఉడుపి జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్
20 ఏళ్లుగా నక్సల్ ఉద్యమంలో గౌడ
విక్రమ్‌గౌడ కుదురేముఖ్ జాతీయ ఉద్యానవనం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. కరావళి ప్రాంతంలో విక్రమ్‌గౌడ, మలెనాడు ప్రాంతంలో ముండగారు లతా బృందం చురుకుగా ఉండేవి. విక్రమ్‌గౌడ ఉడుపి జిల్లా హెబ్రి తాలూకా కూడ్లు నాడ్వాలు గ్రామ నివాసి. మొదట కార్మిక సంఘంలో పనిచేసిన విక్రమ్‌గౌడ ఆ తరువాత నక్సలైట్లలో చేరి అగ్రశ్రేణి నక్సల్‌గా ఎదిగారు. మూడుసార్లు కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకున్నారు. 2016 నుంచి కేరళ అటవీ ప్రాంతాల నుంచి కార్యకలాపాలను నడుపుతున్నారు. ఆయన మృతితో నక్సలైట్ నేతల సంఖ్య తగ్గింది. గతంలో పలువురి అరెస్టులు, లొంగుబాట్లు జరిగాయి.
బనశంకరి: కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌వాటెండ్ నక్సలైట్‌గా ఉన్న విక్రమ్ గౌడ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. కర్ణాటకకు చెందిన నక్సల్స్ వ్యతిరేక దళం(ఏఎన్‌ఎఫ్) పోలీసులు సోమవారం రాత్రి ఉడుపి జిల్లాలో కబ్బినాలే అటవీ ప్రదేశంలో కూంబింగ్‌లో మట్టుబెట్టారు.
ఎదురు కాల్పులు...
విక్రమ్‌గౌడ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 50 కి పైగా నేరాల్లో మోస్ట్ వాటెండ్‌గా ఉన్నారు. కొద్దిరోజులుగా ఉడుపి ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో ఏఎన్‌ఎఫ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ జరుపుతున్నారు. ఐదుమంది నక్సలైట్లు నిత్యావసర వస్తువులను కొనడానికి కబ్బినాలెకు వచ్చినట్లు తెలిసి చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి, ఇందులో విక్రమ్‌గౌడ (46) మరణించగా, మిగిలిన నక్సల్స్ పారిపోయినట్లు పోలీసు అధికారులు చెప్పారు.
రూ.5 లక్షల రివార్డు
విక్రమ్‌గౌడ, ముండగారు లతా, జయణ్ణ, వనజాక్షి, సుందరి అనేవారు నక్సల్ నేతలు కాగా, వారిపైన ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించింది. గత 20 ఏళ్లు నుంచి నక్సల్ కార్యకలాపాల్లో విక్రమ్‌గౌడ పాల్గొంటున్నాడు. ఆయనపై చిక్కమగళూరు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 50 కి పైగా దాడులు, విధ్వంసం కేసులు ఉన్నాయి.
కేరళ నుంచి వచ్చి తూటాలకు చిక్కి
కేరళలో నక్సల్స్ కార్యకలాపాలు హెచ్చుమీరడంతో అక్కడ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో చాలామంది నక్సల్స్ పొరుగునే ఉన్న ఉడుపి, మంగళూరు జిల్లాల్లోకి వచ్చారు. పశ్చిమ కనుమల్లోని అటవీ గ్రామాల పరిసరాల్లో తలదాచుకున్నారు. ఇటీవల కస్తూరిరంగన్ నివేదిక అమలు, అటవీ ప్రాంతం ఆక్రమణల తొలగింపు అంశాలపై ప్రజలతో సమావేశాలు జరిపారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు అడవుల్లో గాలింపు ప్రారంభించారు. విక్రమ్‌గౌడ మృతదేహాన్ని మంగళూరు ఆస్పత్రికి తరలించారు.
లొంగిపోవాలని చెప్పాం
బనశంకరి: ఎన్‌కౌంటర్ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ఆంతరిక భద్రతా విభాగం డీఐజీ రూపా మౌద్గిల్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ కదలికల గురించి తెలిసి గాలింపు మొదలైంది, నక్సల్స్ ఎదురుపడ్డారు, లొంగిపోవాలని సూచించినప్పటికీ కాల్పులకు దిగారు. ఈ సమయంలో ఏఎన్‌ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో విక్రమ్‌గౌడ మృతిచెందారు. ఇతడిపై హత్య, దోపిడీలు, దొంగతనాలు తో పాటు 60 కి పైగా కేసులు ఉన్నాయి అని రూపా మౌద్గిల్ చెప్పారు. 10 రోజుల నుంచి గాలింపు జరుగుతోందని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment