దాదాపు 26 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఉగ్రవాది
ఐసిస్ రిజ్వాన్ అలీ కేసుతో మరోసారి తెరపైకి
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నట్టు ఆధారాలు
దేశ వ్యాప్తంగా అనేక పేలుళ్లకు కుట్రలు
‘ఉగ్ర ఫైనాన్స్’ వ్యవహారంలోనూ కీలకం
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో దాక్కుని.. ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ అరెస్టు ఘటనతో కరుడుగట్టిన టెర్రరిస్ట్ మహ్మద్ ఫర్హతుల్లా ఘోరీ పేరు మరోసారి తెరపైకి వచి్చంది. హైదరాబాద్‌కే చెందిన ఘోరీ కోసం రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు వివిధ నిఘా ఏజెన్సీలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దాదాపు 26 ఏళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్న అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వాంటెడ్ లిస్టులోనూ ఉన్నాడు.
అజ్ఞాతంలోకి వెళ్లాకే విషయం బయటికి..
హైదరాబాద్‌లోని మాదన్నపేట సమీపంలో ఉన్న కూర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్.. 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అది జరిగిన నాలుగేళ్ల తర్వాతగానీ అతడి పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. 2002లో గుజరాత్‌లోని అక్షర్‌ధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసుతో ఘోరీ వ్యవహారాలు బహిర్గతం అయ్యాయి. 2004లో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది.
అప్పట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌కు (జేఈఎం) సానుభూతిపరుడిగా ఉన్న ఘోరీ.. ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2005లో నగర కమిషనర్ టాస్‌్కఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులో.. 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ కేసులోనూ ఘోరీ వాంటెడ్‌గా ఉన్నాడు. 2022 దసరా సమయంలో విధ్వంసాలకు కుట్రపన్ని హ్యాండ్ గ్రెనేడ్స్‌తో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన జాహెద్‌తో ఘోరీ సంప్రదింపులు జరిపాడు. దీనితోపాటు మరికొన్ని ఉగ్రవాద కేసుల్లోనూ ఘోరీ వాంటెడ్‌గా ఉన్నాడు.
రిక్రూట్‌మెంట్‌తో పాటు ఫైనాన్సింగ్
ఘోరీ ప్రస్తుతం పాకిస్తాన్‌లోని రావలి్పండిలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. దీనికి ముందు దు బాయ్ కేంద్రంగా ఉండి హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలకంగా పనిచేశాడు. గత 26 ఏళ్లుగా అనేక ఉగ్రవాద సంస్థలతో కలసి పనిచేశాడు. లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ), హర్కతుల్ జిహీదే ఇస్లామీ (హుజీ), ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
హైదరాబాద్ సిటీలో 2007 ఆగ స్టు, 2013 ఫిబ్రవరిలో జరిగిన జంట పేలుళ్లకు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) స్థాపనలో కీలకంగా వ్యవహరించిన అమీర్ రజాఖాన్‌కు ఘోరీ సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్ర హోంశాఖ విదేశాల్లో ఉంటూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్న, సహకరిస్తున్న 18 మంది ఉగ్రవాదుల పేర్లతో 2020 లో మోస్ట్ వాంటెడ్ జాబితా విడుదల చేసింది. అందులో ఐఎం వ్యవస్థాపకుడు, సహ–వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌తోపాటు ఘోరీ సైతం ఉన్నాడు.
ఇన్నాళ్లూ ఫొటో కూడా దొరకని రీతిలో..
ఘోరీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్ దాంతోపాటు దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి అస్పష్టమైన ఫొటోను విడుదల చేసింది. అతడి స్పష్టమైన ఫొటో సుదీర్ఘకాలం ఏ ఏజెన్సీ వద్ద కూడా లేకపోవడమే అందుకు కారణం. 2008 ఏప్రిల్‌లో అతడి మేనల్లుడు ఫయాఖ్‌ను దుబాయ్ నుంచి డీపోర్ట్ (బలవంతంగా తిప్పిపంపడం) చేయగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
అప్పట్లో ఫయాఖ్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఘోరీకి సంబంధించి 20 ఊహాచిత్రాలను రాష్ట్ర నిఘా వర్గాలు రూ పొందించాయి. అక్షర్‌ధామ్ కేసులో ఘోరీ సోదరుడు షౌకతుల్లాను 2009 ఏడాది జూలైలో అరెస్టు చేసినప్పుడు.. ఆ ఊహాచిత్రాలను చూపగా వాటిలో ఒకదానిని అతను నిర్ధారించాడు. అప్పటి నుంచి అదే ఆధారమైంది. తాజాగా రిజ్వాన్ అరెస్టుతో ఘోరీ కొత్త ఫొటో ఏజెన్సీలకు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment