ఆమె.. ఒక మిస్టరీ! జిహాదీలకు ఆమె రోల్‌ మోడలా?  | Texas hostage situation brings focus back on Al Qaeda | Sakshi
Sakshi News home page

ఆమె.. ఒక మిస్టరీ! జిహాదీలకు ఆమె రోల్‌ మోడలా? 

Published Fri, Jan 21 2022 4:53 AM | Last Updated on Fri, Jan 21 2022 11:09 AM

Texas hostage situation brings focus back on Al Qaeda - Sakshi

ఆఫియా సిద్ధిఖీ (ఫైల్‌)

ఆమెను లేడీ అల్‌ఖాయిదా అని పిలిచేవారు మోస్ట్‌ వాంటెడ్‌ వుమెన్‌ జాబితాలో కూడా ఆమె పేరు చేరింది అభిమానులు ఆమెను ఇస్లాం మతాన్ని కాపాడే రాడికల్‌గా భావిస్తే  అమెరికా ఆమెపై అల్‌ ఖాయిదా తొలి మహిళా ఉగ్రవాది అన్న ముద్ర వేసింది అమెరికాలోని టెక్సాస్‌ జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీ విడుదల కోసం   ఇప్పటి వరకు 57 మంది ప్రాణాలు బలయ్యాయి.   ఇంతకీ ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆమె విడుదల కోసం పాక్‌కి ఎందుకీ ఆరాటం?

అమెరికాలోని టెక్సాస్‌లో జనవరి 15న ఒక యూదు ప్రార్థనాలయంలో నలుగురిని బందీలుగా చేపట్టిన ఓ బ్రిటీష్‌ పాకిస్తానీ యువకుడు వారిని వదిలేయాలంటే, అక్కడికి సమీపంలో జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీని విడుదల చేయాలని డిమాండ్‌ చేశాడు. 10 గంటల ఉత్కంఠ తర్వాత అమెరికా పోలీసుల చేతుల్లో హతమయ్యాడు.  

► 2011లో అల్‌ ఖాయిదాలో నెంబర్‌ 2 ఉగ్రవాది అల్‌ జవహరి.. ఆఫియాను విడుదల చేస్తే, తమ దగ్గర బందీగా ఉన్న యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగి వారెన్‌ వీన్‌స్టెన్‌ను విడుదల చేస్తామని బేరం పెట్టాడు.  
► 2014లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ తమ బందీగా ఉన్న అమెరికా జర్నలిస్టు జేమ్స్‌ ఫోలేని విడుదల చేస్తామని, బదులుగా ఆఫియాను విముక్తురాలిని చేయాలని డిమాండ్‌ చేసింది. అమెరికా అంగీకరించకపోవడంతో ఆ జర్నలిస్టు తలనరికి చంపేసింది.  
► 2017లో పాకిస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్‌ఖాన్‌ తాను అధికారంలోకి వస్తే ఆఫియాను విడుదలకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.  
వీరే కాదు జీహాది సంస్థలు, సామాన్య జనం, యావత్‌ ముస్లిం సమాజం ఆఫియా విడుదల కోసం ఎన్నో ప్రదర్శనలు చేశారు. అమెరికాలో ఎవరిని బందీగా తీసుకున్నా ఆఫియా విడుదల కోసమేనా అన్నట్టుగా పరిస్థితులు మారాయి.  


ఆఫియా చుట్టూ ఆరోపణలు  
ఆఫియా జీవితమే ఒక మిస్టరీగా మారింది. అమెరికాలో ఉండగా ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 10 వేల డాలర్లతో నైట్‌ విజన్‌ గాగుల్స్‌ కొన్నదని , రక్షణ కోసం కవచాలు, ఒక సైనికురాలిగా స్వీయ శిక్షణ తీసుకోవడానికి అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. సెప్టెంబర్‌ 11 దాడుల మాస్టర్‌మైండ్‌ ఖలీద్‌ షేక్‌ మహమ్మద్‌ మేనల్లుడు అమ్మర్‌ అల్‌ బలూచిని ఆమె రహస్య వివాహం చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. 2003లో ఖలీద్‌ అరెస్ట్‌ అయిన నెలరోజులకే ఆఫియా కొన్నాళ్లు అదృశ్యమైపోవడం ఆ ఆరోపణలకి ఊతమిచ్చింది. డర్టీ బాంబ్స్‌ తయారు చేసి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించడానికి అఫియా కుట్ర పన్నిందన్న ఆరోపణలు వచ్చాయి. 

జైల్లో ఉన్నప్పటి చిత్రం

2008లో అఫ్గానిస్తాన్‌లో అమెరికా అధికారిపై కాల్పులకు తెగబడిందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్‌ చేశారు. 2010లో అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 86 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అంటే ఆఫియాకి శిక్షా కాలం పూర్తయ్యేటప్పటికీ ఆమె ప్రాణాలతో ఉంటే వయసు 124 ఏళ్లు వస్తాయి.  అయితే ఆఫియా సిద్ధిఖీ అమాయకురాలని, ఆమెకు ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేదని,  అమెరికా మిలటరీయే ఆఫియాని కిడ్నాప్‌ చేసి నేరాన్ని మోపిందంటూ వాదించేవారూ ఉన్నారు.  2001, సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమాయకులపై కూడా టెర్రరిస్టు ముద్ర వేస్తోందని ముస్లిం సమాజం గళమెత్తింది.  

ఇప్పుడు ఎలా ఉంది ?
టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్‌ జైల్లో ఉన్న ఆఫియా సిద్ధిఖీ ప్రాణాలకు ఇంకా ముప్పు పొంచే ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆమెపై తోటి ఖైదీలు దాడులకు దిగారని జైలు రికార్డులు చెబుతున్నాయి. పొగలు కక్కే కాఫీని ఆమె ముఖంపై పోయడంతో కాలిన గాయాలయ్యాయి. కళ్లు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను మరో మహిళా ఖైదీ చితకబాదింది.. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పాకిస్తాన్‌లో హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆఫియాను విడుదల చేయాలంటూ బహిరంగంగానే డిమాండ్‌ చేస్తున్నారు. విదేశీ జైళ్లలో మగ్గిపోతున్న పాకిస్తానీయుల విడుదలకు తాను పాటుపడతానని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే టెక్సాస్‌ యూదు ప్రార్థనాలయంలో ఆఫియా విడుదల కోసం ఘటన జరగడంతో మరోసారి ఈ అల్‌ ఖాయిదా లేడీ ఉగ్రవాదిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విశ్వవిఖ్యాత మసాచుసెట్స్‌ వర్సిటీలో చదివి.. అపై పీహెచ్‌డీ చేసి జీవితంపై ఎంతో విశాల అవగాహన ఉన్న ఆఫియా చట్ట వ్యతిరేక ఉగ్రమార్గాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ విస్మయపరిచే అంశమే. పెద్దయ్యాక పాశ్చాత్యదేశాల్లో పెరిగింది. ఆ దశలో ఆమెకు ఉగ్రభావాలున్న పరిచయం అయ్యే అవకాశం ఉండదు. అంటే పాక్‌లో సెకండరీ విద్యను అభ్యసించే లోపలే... లేదా సేవా కార్యక్రమాల కోసం ప్రపంచదేశాలు తిరుగుతున్న తరుణంలో ఎవరో ఆమెకు బ్రెయిన్‌ వాష్‌ చేసి ఉంటారని అనుకోవచ్చు!.     

ఎవరీ ఆఫియా సిద్ధిఖీ?
ఆఫియా సిద్ధిఖీ పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన న్యూరో సైంటిస్ట్‌. 1990లో టీనేజ్‌లో ఉండగానే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకుంది. బ్రాండీస్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ చేసింది. 1995లో కరాచీకి చెందిన అంజాద్‌ఖాన్‌తో నిఖా జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2002లో భర్తతో విడిపోయింది. అమెరికాలో విద్యార్థిగా ఉండగానే ఆమె మసీదులకి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేది. ఇస్లాం మతం సంరక్షణ కోసం ప్రచారం చేసేది. అఫ్గానిస్తాన్, బోస్నియా, చెచన్యాలో సంక్షోభ పరిస్థితులపై ఉద్యమాలు చేసింది.

భారీగా విరాళాలు సేకరించి ఆయా దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె తండ్రి మహమ్మద్‌ సిద్ధిఖీ వైద్యుడు, సామాజిక కార్యకర్త. పాకిస్తాన్‌ జనరల్‌  జియా ఉల్‌ హక్‌ హయాంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. దీంతో సిద్ధికీ ఏం చేసినా బాగా ప్రచారం వచ్చేది. ఆమెకి ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. పైగా అకర్షణీయమైన రూపం, అత్యంత ప్రతిభావంతురాలు, ఉన్నత విద్యను అభ్యసించి ఉండటంతో... పాక్‌ సమాజంతో పాటు ఎక్కడికెళ్లినా సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా ఉండేది.

–నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement