Crime Story: మోస్ట్‌ వాంటెట్‌.. పరిణీత ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్‌! | Funday Magazine: Sri Sudhamai Telugu Crime Story Mostwanted | Sakshi
Sakshi News home page

Crime Story: మోస్ట్‌ వాంటెట్‌.. పరిణీత ఎందుకలా చేసిందో తెలిసి అందరూ షాక్‌!

Published Fri, Jul 22 2022 4:23 PM | Last Updated on Fri, Jul 22 2022 4:34 PM

Funday Magazine: Sri Sudhamai Telugu Crime Story Mostwanted - Sakshi

సాయంత్రం నుండి హోరున వర్షం కురుస్తూనే ఉంది. అక్కడికి ఎడమపక్కగా ఒక పోలీసుస్టేషన్‌.  ఆ స్టేషన్‌లో ఆకాష్‌ గుప్తా, రజని దంపతులు.. సీఐ నచికేత ఎదురుగా కూర్చుని ఉన్నారు. తన చేతిలో ఉన్న కంప్లైంట్‌ ను దీక్షగా చదువుతున్నాడు నచికేత. కొద్దిసేపటి తరువాత వారిని చూస్తూ..
‘ఇది చాలా క్లిష్టమైన సమస్యలా ఉంది. మనం ఘోరా బాబా ఆశ్రమానికి వెళదాం. వారెంటుతో ఆశ్రమానికి వెళ్ళాలి కాబట్టి మీరు అప్పటివరకు నిరీక్షించక తప్పదు’ అన్నాడు. 
∙∙ 
‘నేను దైవాంశసంభూతుడిని. నన్ను నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుంది. మీ సమస్యలు, కష్టాలు నాతో చెప్పుకోండి. నేను వాటిని తీర్చి మీకు ముక్తిని ప్రసాదిస్తాను’  ఎప్పటినుండో సాగుతున్న ఘోరాబాబా ప్రసంగం ముగిసింది.  

అది గమనించిన బాబా ప్రధానశిష్యులు నలుగురు మెరుపువేగంతో కదిలి ఘోరాబాబా చుట్టూ కవచంలా ఏర్పడ్డారు. రక్షకవలయం నడుమ ఘోరాబాబా లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడున్న భక్తులు దూరం నుండే ఘోరాబాబాకి జై అని నినాదాలు చేయసాగారు. వారిని అనుక్షణం బాబా శిష్యులు అప్రమత్తులై డేగకళ్లతో కాపలా కాస్తున్నారు. చిన్న చీమ కూడా లోపలికి జొరబడకుండా ఆశ్రమం అంతటా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉన్నాయి.

ఘోరాబాబా దర్శనానికి అప్పుడప్పుడు వచ్చే పరిణీత.. గత కొంతకాలంగా  ఆశ్రమంలోనే ఉంటూ అక్కడికి వచ్చే భక్తులను, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని పనుల్లో చురుకుగా పాల్గొంటోంది. ఘోరాబాబా మన్ననలు చూరగొని ప్రియమైన శిష్యురాలిగా మారిపోయింది.  
అది ఒక విశాలమైన హాలు. అక్కడున్న వేదిక మీది వెండి సింహాసనంపై ఘోరాబాబా ఆసీనుడయ్యాడు.  

ఘోరాబాబా చుట్టూ శిష్యులు కవచంలా నిలబడి ఉన్నారు. ఘోరాబాబా తల చుట్టూ తెల్లటి కాంతివలయం మెరిసిపోతూ ఉంది. అందరినీ చూస్తున్న ఘోరాబాబా ‘భక్తులారా..  మీ అందరిని ఉద్ధరించడానికే అవతరించాను. మీ మీ కష్టాలన్నీ నాతో విన్నవించుకోండి’ అని పలుకుతూ తన చేతిని గాలిలో తిప్పాడు. వెంటనే   విభూది ప్రత్యక్షమైంది.

ఆ విభూదిని అక్కడున్న భక్తులు అందరి మీదా పడేటట్టు ఊదాడు ఘోరాబాబా. ఆ విభూది అందరి మీద పడగానే వారందరూ తన్మయత్వంతో వివశులై మంత్రముగ్ధుల్లా మారిపోయారు.
తర్వాత ఘోరాబాబా ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆ ప్రసంగాన్ని అక్కడున్నవారందరూ ఎంతో శ్రద్ధగా వినసాగారు.
వెండి సింహాసనం నుండి దిగిన ఘోరాబాబా సింహాసనం వెనుక భాగం వైపు ఉన్న ఒక మీటను నొక్కాడు. అది నొక్కగానే సింహాసనం పక్కకి జరిగి వేదిక కిందకు మెట్లు కనిపించాయి.

అక్కడే ఉన్న పరిణీతను భక్తులు ఇచ్చిన కానుకల పళ్ళేన్ని పట్టుకుని తన వెంట రమ్మన్నాడు. అక్కడకు వచ్చిన పరిణీత ఆ వేదిక కింద ఉన్న మెట్లను చూసి ఆశ్చర్యపోయింది.

ఇంతలో ఒక శిష్యుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు.. ‘బాబా.. మీకోసం సీఐ వచ్చాడు’ అంటూ. అది వినగానే ఘోరాబాబా.. పరిణీతతో పాటు బయటకు వచ్చాడు.
అక్కడ సీఐ నచికేతతో పాటు ఆకాష్‌ గుప్తా, రజని ఉన్నారు. వారిని చూసిన ఘోరాబాబా ఆశ్చర్యపోయాడు. వారందరినీ అక్కడ చూసిన పరిణీత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారణం ఆకాష్‌ గుప్తా, రజని.. ఆమె తల్లిదండ్రులు కావడమే.

ఘోరాబాబా.. నచికేతను చూస్తూ ‘ సీఐ గారూ.. మా ఆశ్రమాన్ని సందర్శించడానికి కారణం?’ అని అడిగాడు.
‘నేను తమరి ఆశ్రమం సందర్శించడానికి రాలేదు. వారెంటుతో వచ్చాను. మీరు.. పరిణీత అనే అమ్మాయిని మీ ఆశ్రమం నుండి పంపించకుండా బంధించినట్టు మాకు కంప్లయింట్‌ వచ్చింది. అందుకుగాను మీ మీద, మీ ఆశ్రమం మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అన్నాడు పీఐ నచికేత.

ఆ మాటకు  తెలియని కలవరపాటుకు గురైనా కనిపించకుండా సర్దుకున్న ఘోరాబాబా..  ‘పరిణీత ఇక్కడే ఉంది. నేను కానీ మా ఆశ్రమంలో ఇంకెవరు కానీ ఆమెను బంధించలేదు’ అన్నాడు.  

నచికేత.. పరిణీత వద్దకు వెళ్ళాడు.   ‘పరిణీతగారూ.. మీరిలా మీ తల్లిదండ్రులను వదిలి ఇక్కడ ఉండటం సమంజసం కాదు. మీరు వెంటనే మీ పేరెంట్స్‌తో వెళ్లడం మంచిది’ అని చెప్పాడు. 

‘చూడండి సర్‌.. నేనెక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు. అదీ కాక నేను మేజర్‌ని. మేజర్‌కి తాను ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు కూడా ఉంటుందని మీకు బాగా తెలుసనుకుంటాను. దయచేసి మీరందరూ ఇక్కడనుండి వెళ్లిపోండి’ అంది పరిణీత.

జరుగుతున్నదంతా నిర్వికారంగా ఘోరాబాబా,  ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ తో శిష్యులు, కన్నీటితో పరిణీత తల్లిదండ్రులు చూస్తున్నారు.
‘మీరు మేజర్‌ అవునో కాదో  తెలుసుకోవడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా?’ అడిగాడు నచికేత. తన చేతిలో ఉన్న ఒక ఫైలును నచికేతకు అందించింది పరిణీత ‘ఇది చూడండి’ అంటూ.

అందులో ఉన్న సర్టిఫికెట్స్‌ను పరిశీలనగా చూస్తున్న నచికేతకు ఒక కాగితాన్ని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. అది పరిణీత జర్నలిజంలో మాస్టర్స్‌ చేసిన సర్టిఫికెట్‌. అప్పుడర్థమైంది నచికేతకు పరిణీత అక్కడ ఎందుకు ఉందో! 

ఆ సంఘటన జరిగిన నెల రోజులకు..                                                              
ఘోరాబాబా ఆశ్రమం అంతా గగ్గోలుగా ఉంది. ఆ ఆవరణంతా  పోలీసులు.. మీడియాతో నిండి ఉంది.
కొద్దిసేపటిలో సీఐ నచికేత.. ఘోరాబాబాను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లిపోయాడు.
∙∙ 
ఆ వేళ.. కోర్టు హాలు అంతా కిక్కిరిసి ఉంది. ఫైల్‌ చేయబడిన ఘోరాబాబా కేసు తీర్పు ఇవ్వబోతున్నారు జడ్జిగారు. సీఐ నచికేత.. ప్రత్యేక భద్రత నడుమ పరిణీత తల్లిదండ్రులను కోర్టుకు రప్పించాడు. ఒకపక్క కోర్టుబోనులో పరిణీత.. మరోపక్క బోనులో కళ్ళనిండా క్రోధంతో ఘోరాబాబా..
జడ్జిగారు పర్మిషన్‌ ఇవ్వగానే పరిణీత చెప్పడం మొదలుపెట్టింది.

‘జడ్జిగారూ.. నా పేరు పరిణీత. నేను జర్నలిజంలో మాస్టర్స్‌ చేశాను. ఒకరోజు నా ఫ్రెండ్‌..  ఘోరాబాబా ఆశ్రమానికి వెళదామని నన్ను తీసుకువెళ్ళింది. ఘోరాబాబా చుట్టూ ఉన్న వారందరూ భక్తి పేరుతో హిప్నాటిజమ్‌కు గురైనట్టు అనిపించింది. ఆశ్రమంలో దృశ్యాలు కుతూహలం కలిగించాయి. తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించాయి. ఓ సామాన్యురాలిగా ఆశ్రమానికి రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టాను.

ఘోరాబాబాకు ప్రియమైన శిష్యురాలిగా మారిపోయాను. అక్కడ భక్తి ముసుగులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని గ్రహించాను. వాటిని అందరికి తెలియచేసి ఘోరాబాబా నిజస్వరూపం బయటపెట్టాలని నిశ్చయించుకున్నాను. నిజానికి అది ఓ సాహసమే. అయినా నేను వెనకాడలేదు.  

హిప్నాటిజం అనేది ఒక నమ్మకం. దాన్ని గారడిగా మర్చి.. మాస్‌ హిస్టీరియాను సృష్టిస్తూ..  చిన్న చిన్న ట్రిక్స్‌తో, తనకు తనే మహాయోగిగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను టార్గెట్‌ చేస్తున్నాడు ఈ ఘోరాబాబా. ఆ ఘోరాలను నా కళ్లకు అమర్చిన ‘స్పై కెమెరా లెన్స్‌’ తో షూట్‌ చేశాను. ఘోరాబాబా చేసే ప్రతి గారడీ ప్రజలు చూడాలి. అందుకు అవకాశం ఇవ్వండి మిలార్డ్‌’ అంటూ తన దగ్గరున్న ఫుటేజీని జడ్జిగారికి  అందించింది పరిణీత. 

ఆమె ధైర్యసాహసాలకు ముచ్చటపడ్డారు అక్కడున్నవారంతా.  
ఆ ఫుటేజీని స్క్రీన్‌ మీద ప్లే చేయాల్సిందిగా జడ్జిగారు అనుమతినిచ్చారు. 
అనుమతి అందడమే ఆలస్యం ఘోరాబాబా లీలలన్నీ ఒక్కొక్కటిగా ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ మీద కనిపించసాగాయి.  

‘ఒక గదిలో ఘోరాబాబా తన శిష్యులను హిప్నటైజ్‌ చేస్తున్నాడు. వారందరూ ఏదో మత్తులో ఉన్నట్టు ఊగిపోతున్నారు. ఘోరాబాబాను వాళ్ళందరూ దేవుడని పొగుడుతూ కాళ్ళమీద పడి మొక్కుతున్నారు.

తెల్లటి విభూదిని తీసుకొచ్చి అందులో ఏదో కలిపాడు ఘోరాబాబా. ఆ విభూదిని భక్తుల మీద చల్లడానికి ఉపయోగిస్తున్నారు. మరొకచోట అక్కడున్న అమ్మాయిలను కొంతమంది శిష్యులు ఘోరాబాబాకు లొంగిపొమ్మని లేదంటే మీ కుటుంబాలను అన్యాయం చేస్తామని బెదిరిస్తున్నారు. మరొకచోట పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌ వ్యాపారం చేస్తున్నారు.

ఇవన్నీ ఘోరాబాబా ఆశ్రమం అండర్‌ గ్రౌండ్‌లో జరుగుతున్నాయి. ఆశ్రమానికి అండర్‌ గ్రౌండ్‌ ఉందని ఎవరికీ తెలియదని ఘోరాబాబా.. పరిణీతకు చెప్పడం కూడా అందులో ఉంది. 
ప్రజల అమాయకత్వాన్ని.. భక్తివిశ్వాసాలను వ్యాపారంగా మార్చుకుంటున్న ఆ ఘోరమైన దృశ్యాలు ఘోరాబాబా వికృత ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. 
అంతా చూసిన జడ్జిగారు.. ఆ వీడియోలను తక్షణమే ప్రజాతీర్పు కోసం టెలికాస్ట్‌ చేయమని ఆదేశాలు ఇచ్చారు.
∙∙ 
టీవీల్లో ఘోరాబాబా అకృత్యాలు ప్రసారమవడం మొదలయ్యాయి. ఇది జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఘోరాబాబా ఆశ్రమాలు, సంస్థలు భక్తుల ఆగ్రహానికి నేలమట్టమవసాగాయి.
∙∙ 

ప్రజా తీర్పు తర్వాత.. కోర్టు తీర్పూ వెలువడింది.  
ఏడుచువ్వల మధ్య.. కటిక నేల మీద పడుకుని సీలింగ్‌ వంక వెర్రిచూపులు చూస్తూ కాలక్షేపం చేయసాగాడు ఘోరాబాబా.
చదవండి: కథ: ఋణం.. తండ్రి ఋణం నుంచి పిల్లలు తప్పుకోగలరా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement