వీడు మామూలోడు కాదు
- మోస్ట్ వాంటెడ్
- వందల కొద్దీ గొలుసు దొంగతనాలు
- చర్చనీయాంశమైన శివ ఎన్‌కౌంటర్
విజయవాడ సిటీ : ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మోటార్‌సైకిల్‌పై సహచరుడితో కలిసి వేగంగా వస్తాడు. ఆపై గొలుసు తెంచుకుని పరారవుతాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే ఆయుధాలతో దాడి చేసి భయపెడతాడు. సైబరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమైన కొడవలూరి శివకుమార్ అలియాస్ సాంబ నేరం చేసే శైలి ఇది.. దొంగిలించిన సొమ్ముతో ఖరీదైన జీవితం గడపటం శివకు ఇష్టం.
రాష్ట్రంలో మోస్ట్‌వాంటెడ్ గొలుసు దొంగ శివకుమార్ ఎన్‌కౌంటర్ నగర పోలీస్ కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని పటమట, సత్యనారాయణపురం, కృష్ణలంక పోలీసుస్టేషన్ల పరిధిలో పలు గొలుసు దొంగతనం కేసులు ఇతనిపై నమోదవ్వడమే ఇందుకు కారణం. ఇతనితోపాటు సహచరుడు మందపాటి జగదీష్‌పై ఇక్కడ 8కి పైగా గొలుసు దొంగతనాల కేసులు ఉన్నాయి.
అంతర్‌జిల్లా నేరస్తుడు
నెల్లూరు జిల్లా ఆర్మేనుపాడు గ్రామానికి చెందిన శివకుమార్, సహచరుడు జగదీష్‌పై రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 300కు పైగా గొలుసు దొంగతనం కేసులు ఉన్నాయి. విజయవాడతో పాటు విశాఖపట్టణం, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాళహస్తి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. గొలుసు దొంగతనాలకు ముందు అందుకోసం ఎంచుకున్న ప్రాంతాల్లో వీరు రెక్కీ చేస్తారు. ఆ తర్వాత మోటారు సైకిల్‌పై వేగంగా వెళుతూ వంటరిగా ఉండే మహిళల మెడలో గొలుసులు తెంచుకుపోతారు. వీరి వేగానికి మహిళలు భయోత్పానికి గురై తేరుకునే లోగానే మాయమవుతారు.
ఒకవేళ ఎవరైనా వీరిని గమనించి అడ్డుకునేందుకు యత్నిస్తే ఇనుప రాడ్లు, కత్తులతో గాయపరిచి పరారవుతారు. వెంటనే ఆ ప్రాంతం నుంచి మకాం మార్చుతారు. ఇటీవల గొలుసు దొంగతానాలు పెరగడంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసు స్టేషన్లకు చెందిన అధికారులు కొన్నాళ్లుగా గాలింపు జరుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో శివ హతమవ్వడంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
విలాసవంతమైన జీవితం
శివకుమార్ తరుచూ తానుండే ప్రాంతాలను మార్చుతుంటాడు. గొలుసు దొంగతనాల్లో వచ్చిన సొమ్ముతో ఖరీదైన జీవితం గడుపుతాడు. ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుంటాడు. ఉన్నత వర్గాలకు ఏమాత్రం తగ్గని రీతిలో కార్లు, మోటారు సైకిళ్లు కొనుగోలు చేసి వాడతాడు. మద్యం, మగువలు ఇతని జీవితంలో నిత్యకృత్యం. మగువల కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తాడని పోలీసు వర్గాల సమాచారం. గతంలో ఇతణ్ణి రాజమండ్రిలో కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చారు.
ముందస్తు సమాచారంతో అక్కడికి వెళ్లిన క్రైం పార్టీ బృందాలు ఇంటిని చూసి లోనికి వెళ్లేందుకు సాహసించలేదు. తమకు వచ్చిన సమాచారం నిజమైనదేనని రూఢీ చేసుకునేందుకు రెండు రోజుల పాటు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఖచ్చితంగా ఆ ఇల్లు శివకుమార్ ఉంటున్నదేనని నిర్థారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇంట్లోని ఫర్నిచర్, గృహోపకరణాలను చూసి వారు అవాక్కయ్యారంటే..అతడి జీవన విధానం ఎంత దర్జాగా ఉంటుందో ఆలోచించుకోవచ్చు.