మాజీ ఎమ్మెల్యే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
న్యూఢిల్లీ: అతను మాజీ ఎమ్మెల్యే. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. కానీ ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన టాప్ మోస్ట్ వాంటెడ్-20 మంది నేరస్థుల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిలిచాడు. ఆయనను పట్టుకున్నవారికి లక్ష రూపాయల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. ఆయనే రామ్ బిర్ షోకిన్. ఢిల్లీలోని మాండ్కా శాసనసభ స్థానం నుంచి ఆయన 2013లో సంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆయనపై గతేడాది మోకా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసును నమోదు చేశారు. తన మేనకోడలు నీరజ్ భావన ప్రధాన సూత్రధారిగా ఉన్న సిండికేట్ అక్రమ కార్యకలాపాల వ్యవహారంలో ఆయనకు ప్రమేయం ఉండటమే ఇందుకు కారణం. భావనపై విచారణకు ఆటంకం కలిగించినందుకు, గతేడాది ఆయనపై ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి షోకిన్ అజ్ఞాతంలోఉన్నాడు. రెండు నెలల క్రితం ఢిల్లీ పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆయన పేరును చేర్చారు. ఇందులో ఆయన 10 మోస్ట్ వాంటెడ్ నేరస్థునిగా ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.