♦ ఎట్టకేలకు గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
♦ ప్రముఖులను బెదిరించి డబ్బులు వసూళ్లు
♦ ఎమ్మెల్యేలను కూడా వదలని వైనం
♦ 2012లో పెరోల్‌పై విడుదలై పరారీ
సాక్షి, న్యూఢిల్లీ : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాను ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అరెస్టుచేసింది. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు ముండ్కా రోడ్‌లో నీరజ్‌ను అరెస్టు చేశారు. ఈ అరెస్టును స్పెషల్ పోలీస్ సెల్ కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ ధ్రువీకరించారు. బలవంతపు వసూళ్లకు పేరుగాంచిన నీరజ్ గత పదేళ్లలో ఎందరో రియల్టర్లు, ధనిక వ్యాపారులను బెదిరించి భారీ ఎత్తున వసూళ్లు పాల్పడ్డాడు.
చివరికి ఎమ్మెల్యేలను కూడా వదలకుండా వారిని కూడా బెదిరించి అందినకాడికి గుంజుకున్నాడు. రూ. 50 లక్షలు ఇవ్వాలని నరేలా మాజీ ఎమ్మెల్యే జస్వంత్‌సింగ్ రాణా కుమారున్ని నీరజ్ డిమాండ్ చేశాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వకపోతే రాణాను, అతని కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించాడు. ఈ విధంగా అనేక మంది ప్రముఖులను నీరజ్ బవానా బెదిరించాడు. దీంతో అతని నుంచి రక్షణ కల్పించాల్సిందిగా పలువురు ఎమ్మెల్యేలు అప్పటి సీఎం షీలాదీక్షిత్‌కే మొరపెట్టుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
100కు పైగా కేసులు
పశ్చిమ, వాయవ్య ఢిల్లీలో నీరజ్ బనానా బలవంతపు వసూళ్ల రాకెట్ నడిపేవాడు. గతేడాది ఢిల్లీ పోలీసులు నీరజ్ పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చి అతనిపై రూ. లక్ష బహుమానం ప్రకటించారు. నీరజ్‌పై 100 పైగా క్రిమినల్ కేసులున్నాయి. ఇటీవలే అతనిపై మకోకా కింద కూడా కేసు నమోదైంది. ఒక్క ఢిల్లీలోనే అతనిపై 40 కేసులున్నాయి. చిన్నవయసులోనే చిన్న చిన్న నేరాలు చేస్తూ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన నీరజ్ తొలుత నవీన్ బాలీ ముఠాలో సభ్యుడయ్యాడు.
అనంతరం అతను సొంతంగా మూఠా ఏర్పాటు చేసుకున్నాడు. 2012లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అతన్ని అరెస్టు చేసింది. అయితే పెరోల్‌పై విడుదలయ్యాక అతను పోలీసుల చేతికి మళ్లీ చిక్కలేదు. ఈ క్రమంలో 2013లో గ్యాంగ్‌స్టర్ నీటూ దడోడియాను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చడంతో ఢిల్లీ నేరగాళ్లకు నీరజ్ నాయకుడయ్యాడు. అతని అనుచరులు తీహార్ జైలు నుంచి కూడా వసూళ్లకు పాల్పడేవారు. ఇటీవల జరిగిన విధానసభ ఎన్నికల సమయంలోనూ నీరజ్ ముఠా గొడవలు సృష్టించడానికి ప్రయత్నించింది.
షౌకీన్ అండదండలతోనే...
ముండ్కా మాజీ ఎమ్మెల్యే రామ్‌బీర్ షౌకీన్‌కు నీరజ్ బవానా మేనల్లుడు. షౌకీన్ అండదండలతోనే నీరజ్ ఆగడాలు శృతిమించాయని పోలీసులు అంటున్నారు. ఆస్తి వివాదాలను సెటిల్‌మెంట్ చేయడం ద్వారానే నీరజ్ అధికంగా సంపాదించాడు. నీరజ్ కోసం అనేక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. నీరజ్ బవానాను అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ ధ్రువీకరించారు.
డీసీపీ సంజీవ్ యాదవ్ నేతృత్వంలో స్పెషల్ పోలీసు బృందం తెల్లవారుజామున 3.45కు బవానాను ముండ్కా రోడ్‌లో అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. అంతకు ముందు నీరజ్ బవానా సోదరుడు, తల్లిని కాట్రిడ్జ్‌లు కలిగి ఉన్నారనే కారణంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరో సోదరుడు రాజేష్ బవానాను 2013లోనే పోలీసులు అరెస్టు చేశారు.
కటకటాల్లోకి వసూల్ రాజా
Published Tue, Apr 7 2015 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM
Advertisement
Advertisement