delhi polices
-
‘హోదా’ గళాలపై ఉక్కుపాదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండోరోజు బుధవారం ఢిల్లీలో కొనసాగుతున్న ధర్నా సందర్భంగా నేతలు పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీపీఎం నేతలు మధు, వి.శ్రీనివాస్, సీపీఐ నేత రామకృష్ణ, హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి బస్సుల్లోకి ఎక్కించారు. బస్సుకు అడ్డుగా నిల్చున్న కొందరు కార్యకర్తలు, మహిళలను పోలీసులు పక్కకు ఈడ్చిపారేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. -
కటకటాల్లోకి వసూల్ రాజా
♦ ఎట్టకేలకు గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ♦ ప్రముఖులను బెదిరించి డబ్బులు వసూళ్లు ♦ ఎమ్మెల్యేలను కూడా వదలని వైనం ♦ 2012లో పెరోల్‌పై విడుదలై పరారీ సాక్షి, న్యూఢిల్లీ : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాను ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అరెస్టుచేసింది. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు ముండ్కా రోడ్లో నీరజ్‌ను అరెస్టు చేశారు. ఈ అరెస్టును స్పెషల్ పోలీస్ సెల్ కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ ధ్రువీకరించారు. బలవంతపు వసూళ్లకు పేరుగాంచిన నీరజ్ గత పదేళ్లలో ఎందరో రియల్టర్లు, ధనిక వ్యాపారులను బెదిరించి భారీ ఎత్తున వసూళ్లు పాల్పడ్డాడు. చివరికి ఎమ్మెల్యేలను కూడా వదలకుండా వారిని కూడా బెదిరించి అందినకాడికి గుంజుకున్నాడు. రూ. 50 లక్షలు ఇవ్వాలని నరేలా మాజీ ఎమ్మెల్యే జస్వంత్‌సింగ్ రాణా కుమారున్ని నీరజ్ డిమాండ్ చేశాడు. తాను అడిగిన మొత్తం ఇవ్వకపోతే రాణాను, అతని కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించాడు. ఈ విధంగా అనేక మంది ప్రముఖులను నీరజ్ బవానా బెదిరించాడు. దీంతో అతని నుంచి రక్షణ కల్పించాల్సిందిగా పలువురు ఎమ్మెల్యేలు అప్పటి సీఎం షీలాదీక్షిత్‌కే మొరపెట్టుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 100కు పైగా కేసులు పశ్చిమ, వాయవ్య ఢిల్లీలో నీరజ్ బనానా బలవంతపు వసూళ్ల రాకెట్ నడిపేవాడు. గతేడాది ఢిల్లీ పోలీసులు నీరజ్ పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చి అతనిపై రూ. లక్ష బహుమానం ప్రకటించారు. నీరజ్‌పై 100 పైగా క్రిమినల్ కేసులున్నాయి. ఇటీవలే అతనిపై మకోకా కింద కూడా కేసు నమోదైంది. ఒక్క ఢిల్లీలోనే అతనిపై 40 కేసులున్నాయి. చిన్నవయసులోనే చిన్న చిన్న నేరాలు చేస్తూ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన నీరజ్ తొలుత నవీన్ బాలీ ముఠాలో సభ్యుడయ్యాడు. అనంతరం అతను సొంతంగా మూఠా ఏర్పాటు చేసుకున్నాడు. 2012లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అతన్ని అరెస్టు చేసింది. అయితే పెరోల్‌పై విడుదలయ్యాక అతను పోలీసుల చేతికి మళ్లీ చిక్కలేదు. ఈ క్రమంలో 2013లో గ్యాంగ్‌స్టర్ నీటూ దడోడియాను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడంతో ఢిల్లీ నేరగాళ్లకు నీరజ్ నాయకుడయ్యాడు. అతని అనుచరులు తీహార్ జైలు నుంచి కూడా వసూళ్లకు పాల్పడేవారు. ఇటీవల జరిగిన విధానసభ ఎన్నికల సమయంలోనూ నీరజ్ ముఠా గొడవలు సృష్టించడానికి ప్రయత్నించింది. షౌకీన్ అండదండలతోనే... ముండ్కా మాజీ ఎమ్మెల్యే రామ్‌బీర్ షౌకీన్‌కు నీరజ్ బవానా మేనల్లుడు. షౌకీన్ అండదండలతోనే నీరజ్ ఆగడాలు శృతిమించాయని పోలీసులు అంటున్నారు. ఆస్తి వివాదాలను సెటిల్మెంట్ చేయడం ద్వారానే నీరజ్ అధికంగా సంపాదించాడు. నీరజ్ కోసం అనేక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. నీరజ్ బవానాను అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ ధ్రువీకరించారు. డీసీపీ సంజీవ్ యాదవ్ నేతృత్వంలో స్పెషల్ పోలీసు బృందం తెల్లవారుజామున 3.45కు బవానాను ముండ్కా రోడ్లో అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. అంతకు ముందు నీరజ్ బవానా సోదరుడు, తల్లిని కాట్రిడ్జ్‌లు కలిగి ఉన్నారనే కారణంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరో సోదరుడు రాజేష్ బవానాను 2013లోనే పోలీసులు అరెస్టు చేశారు. -
టుండాకు ఐఎంతో లింకు!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా ఉగ్రవాది, హైదరాబాద్‌లో పట్టుబడిన అబ్దుల్ కరీంటుండాకు దిల్షుక్ నగర్లో పేలుళ్లకు తెగబడిన ఐఎం(ఇండియన్ ముజాహిదీన్)తో సంబంధాలున్నాయని ఢిల్లీ పోలీసులు తేల్చారు. ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్తో మరింత సత్సంబంధాలున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ మేరకు గత మంగళవారం ఢిల్లీ కోర్టులో టుండాపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఆయా వివరాలను పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాం తాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతేడాది ఆగస్టులో ఇక్కడ అరెస్టు చేశారు. చార్జ్‌షీట్‌లో పేర్కొన్న మరిన్ని వివరాలు.. - 1994లో బంగ్లాదేశ్ కేంద్రంగా పాక్-ఇండియా టై నెట్‌వర్క్‌ను స్థాపించి వ్యవహారాలు సాగించిన టుండా పాకిస్థానీయులతో పాటు భారత యువతనూ ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. - పాక్‌కు చెందిన ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించడం, వారితో స్థానిక యువతను ఆకర్షించి, బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడం వంటివి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. దీనికోసం ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నలుగురిలో సలీం జునైద్ ఒకడు. ఈయన టుండా తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇది హైదరాబాద్‌లో దాదాపు 6 పేలుళ్లకు పాల్పడింది. జునైద్‌ను హైదరాబాద్ పోలీసులు 1998లో అదుపులోకి తీసుకున్నారు. - మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ టుండాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2005లో ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్‌ను కలిశాడు. కోల్‌కతాకు చెందిన రజాఖాన్ ఐఎం ముసుగులో రియాజ్, ఇక్బాల్ భత్కల్ ద్వారా దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాడు. 2007లో హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల కేసుల్లోనూ రజాఖాన్ వాంటెడ్‌గా ఉన్నాడు. 2005లో టుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన ఓ ఉన్నతాధికారి సాయంతో అమీర్ రజా ఖాన్‌ను కలిశాడని, ఐఎంకు పూర్తిస్థాయి సహకారం అందించేందుకు అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. -
‘క్రేజీ’ ధర్నా ముగిసింది!
కేంద్రంతో రాజీ కుదరడంతో హైడ్రామాకు తెర ఇద్దరు పోలీసులను సెలవులో పంపడానికి కేంద్రం అంగీకారం భారీగా పోలీసుల మోహరింపు; లాఠీచార్జ్; పదిమందికి గాయాలు సాక్షి, న్యూఢిల్లీ: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ధర్నాకు దిగిన అరుదైన ఆందోళనకు మంగళవారం సామరస్య పూర్వక ముగింపు లభించింది. ఢిల్లీ పోలీసులను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తేవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించిన ఆందోళన.. కేంద్ర ప్రభుత్వంతో రాజీ కుదరడంతో మంగళవారం రాత్రి ముగిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో ఇద్దరిని సెలవులో పంపిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో కేజ్రీవాల్ తన పట్టు వీడి ధర్నాను విరమించారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సంప్రదింపులు ఫలించి జనవరి 26, గణతంత్ర దినోత్సవాలకు ముందు జరిగిన ఈ హై డ్రామాకు తెరపడింది. రాజీ ఫార్ములా - డ్రగ్స్, వ్యభిచార మాఫియాపై దాడులకు నిరాకరించిన మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, డెన్మార్క్ మహిళ అత్యాచారానికి గురైన ప్రాంతం పహర్‌గంజ్ పీసీఆర్ వ్యాన్ ఇన్చార్జ్.. ఈ ఇద్దరినీ సెలవులో పంపేందుకు అంగీకారం. - పోలీసుల ఉదాసీనతపై న్యాయవిచారణను వేగవంతం చేయడం. - ఈ రెండు హామీలతో పాటు పవిత్రమైన రిపబ్లిక్ డే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ధర్నాను విరమించాలని కోరుతూ నజీబ్‌జంగ్ పంపిన లేఖను ధర్నా ముగింపు సందర్భంగా కేజ్రీవాల్ ప్రజలకు చూపారు. ఇది ఢిల్లీ ప్రజలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను లేవనెత్తేందుకు ఆప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇబ్బందుల్లో ‘ఆమ్ ఆద్మీ’ కేజ్రీవాల్ ధర్నాతో మంగళవారం కూడా నాలుగు మెట్రోస్టేషన్లను మూసే ఉంచారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సైతం గుర్తింపు కార్డులు చూపినా పోలీసులు గంటల తరబడి లోనికి వెళ్లనివ్వలేదు. ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు కేజ్రీవాల్‌ను విమర్శించడం కనిపించింది. రాష్ర్టపతితో పీఎం భేటీ: కేజ్రీవాల్ ధర్నా నేపథ్యంలో ప్రధాని మన్మోహన్సింగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై, పరిస్థితిని వివరించారు. రానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. కేజ్రీ మంతనాలు మంగళవారం ఉదయం నుంచి వర్షం ఉండడంతో కేజ్రీవాల్ తన కారులోనే ధర్నా కొనసాగించారు. తర్వాత పక్కనే ఉన్న రైల్‌భవన్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని భార్య తెచ్చిన ఆహారాన్ని తిన్నారు. ధర్నాపై ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సహచరులు, నాయకులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జంతర్‌మంతర్‌లో ఆందోళన కొనసాగించాలంటూ కేంద్ర హోంమంత్రి చేసిన సూచనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ధర్నా చేయాలో చెప్పేందుకు షిండే ఎవరని, తాను ఢిల్లీ సీఎంనని ఎక్కడైనా ధర్నా చేసే హక్కు తనకు ఉందన్నారు. వేలాదిగా తరలివెళ్లి గణతంత్ర వేడుకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాత్రంతా చలిలో ఉండటంతో కేజ్రీవాల్‌కు జ్వరం వచ్చినట్లు సమాచారం. స్వల్ప ఉద్రిక్తత సోమవారం రైల్ భవన్ బయట ధర్నాకి దిగిన కేజ్రీవాల్ రాత్రి అక్కడే నిద్రించారు. పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుతో వందలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు మంగళవారం ైరె ల్భవన్కి చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే కూర్చుని నినాదాలతో హోరెత్తించారు. హైసెక్యూరిటీ జోన్ అయి న ప్రధాని కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ, మంత్రుల కార్యాలయాలు ఉన్నచోట నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ధర్నా చేపట్టడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆప్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. దీంతో పోలీసులపై ఆప్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీసులు గాయపడగా, పోలీసుల లాఠీచార్జిలో పదిమంది ఆప్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. -
గంగూలీపై ఫిర్యాదు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తనను లైంగికంగా వేధించాడంటూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏకే గంగూలీపై ఆరోపణలు చేసిన బాధితురాలు తమకు ఫిర్యా దు చేయాలని ఢిల్లీ పోలీసులు కోరారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే విషయమై పరిశీలిస్తామని న్యూఢిల్లీ ఎస్బీఎస్ త్యాగి తెలి పారు. ‘ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, తన వాంగ్మూలాన్ని రికార్డు చేయవలసిందిగా బాధితురాలికి ఈ-మెయిల్ పంపాం. ఆమె ముందుకొచ్చి ఫిర్యాదు చేసినట్లయితే చేపట్టవలసిన తదుపరి చర్యల విషయమై పరిశీలిస్తాం. ఈ విషయంలో న్యాయనిపుణుల నుంచి ఎలాంటి సహాయాన్ని కోరలేదు. వాంగ్మూలాన్ని నమోదుచేసుకోవడానికి ఎప్పుడు? ఎక్కడికి? రావాలో తెలపాల్సిందిగా మాత్రమే బాధితురాలిని మెయిల్లో కోరామ’ని త్యాగి చెప్పారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చే యవలసిందిగా కోరుతూ ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యాయశాస్త్ర విభాగం మాజీ ప్రొఫెసర్ ఇదివరకే తిలక్‌మార్గ్ స్టేషన్‌హౌజ్ ఆఫీసర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీ సులు ఆయన పిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోనప్పటికీ బాధితురాలు ముందుకొచ్చినట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకుంటున్నారు. లా ఇంటర్న్‌గా పనిచేస్తున్న తనను గత సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని హోటల్ గదిలో ఏకే గంగూలీ లైంగికంగా వేధించారంటూ ఓ యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఆమె బ్లాగ్ ద్వారా వెల్లడించింది. కాగా గంగూలీ ఈ ఆరోపణలను ఖండించారు. గంగూలీ ఏడాది కిందట సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఇప్పుడాయన పశ్చిమ బెంగాల్ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. యువతి ఆరోపణలను పరిశీలించడం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో నియమించిన కమిటీ కూడా గంగూలీ ప్రవర్తనను తప్పుపట్టింది. -
తరుణ్ తేజ్‌పాల్ అరెస్టు
లైంగిక దాడి కేసులో కస్టడీకి తీసుకున్న క్రైం బ్రాంచ్ ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన పణజీ కోర్టు ఉదంతంలో తేజ్‌పాల్ పాత్రపై నమ్మదగిన సాక్ష్యం ఉందని కోర్టు స్పష్టీకరణ భిన్న ప్రకటనలతో ఊసరవెల్లిలా తేజ్‌పాల్: పీపీ పణజీ: తోటి పాత్రికేయురాలిపై లైంగిక దాడి కేసులో ‘తెహెల్కా’ పత్రిక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను శనివారం రాత్రి గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత నిబంధనల ప్రకారం వైద్య పరీక్షల నిమిత్తం తేజ్పాల్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసులో గోవా, ఢిల్లీ పోలీసుల బృందం తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున తేజ్‌పాల్ శుక్రవారం పణజీ జిల్లా సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... తేజ్‌పాల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ రాత్రి 8 గంటలకు తీర్పు ఇచ్చారు. ఉదంతంలో తేజ్‌పాల్ పాత్రపై నమ్మదగిన సాక్ష్యం ఉందని స్పష్టీకరించారు. గోవాలోని ఒక హోటల్లో తోటి పాత్రికేయురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు శనివారం 10.30 గంటల వరకు అరెస్టు చేయకుండా పణజీ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శుక్రవారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. తేజ్‌పాల్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శనివారం ఉదయం 10 గంటలకు జడ్జి అనుజా ప్రభుదేశాయ్ మళ్లీ విచారణ ప్రారంభించారు. తేజ్‌పాల్ కోర్టులో హాజరయ్యారు. ఆయన తరఫున న్యాయవాది గీతా లూథ్రా తన వాదనలు కొనసాగించారు. దర్యాప్తు నిమిత్తం పోలీసులు కోరినంత కాలం గోవాలో ఉండటానికి తేజ్‌పాల్ సిద్ధంగా ఉన్నారని కోర్టుకు నివేదించారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయనే వాదనలనూ తోసిపుచ్చారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరేష్ లొట్లికార్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో ప్రాసంగిక సాక్ష్యాలు తేజ్‌పాల్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని, అందువల్ల విచారించేందుకు అతన్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నట్లు నివేదించారు. గోవాలోని హోటల్లో సీసీటీవీ ఫుటేజ్‌లోని చిత్రాలు అత్యాచారం ఆరోపణలకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా నిందితుడు తేజ్‌పాల్ పూటకో రకంగా భిన్నమైన ప్రకటనలు ఇస్తున్నారని వాదించారు. బాధితురాలు తన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నారని పీపీ స్పష్టం చేశారు. తేజ్‌పాల్ గోవా పోలీసులకు అందుబాటులో లేరని, కోర్టు నుంచి తాత్కాలిక బెయిల్ పొందిన తర్వాత మాత్రమే ప్రత్యక్షమయ్యారని చెప్పారు. దర్యాప్తు సక్రమంగా జరగాలంటే నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో దాఖలైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఫిర్యాదురాలి కుటుంబంపై ఒత్తిడి తెచ్చేందుకు తేజ్‌పాల్ ఇంతకుముందు ప్రయత్నించారని ఆరోపించారు. తేజ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పీపీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించారు. తేజ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ 25 పేజీల తీర్పు ఇచ్చారు. తేజ్‌పాల్ బెయిల్‌కు అనర్హుడు... మహిళపై నిర్బంధ అత్యాచారం(ఐపీసీ 376 (2)కె), ఆమె గౌరవానికి భంగం కలిగించడం (ఐపీసీ 354ఏ) కేసుల్లో నిందితుడు తరుణ్ తేజ్‌పాల్ ప్రమేయం ఉన్నట్లు నమ్మదగిన సాక్ష్యం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. నేర తీవ్రత దృష్ట్యా తేజ్‌పాల్‌కు బెయిల్ పొందే అర్హత లేదని తేల్చి చెప్పారు. ‘‘పిటిషనర్ ఆమె (పాత్రికేయురాలు)కు గురువు, తండ్రి వంటివారు. అయితే ఆ స్థానాన్ని అతను దుర్వినియోగం చేశారు. ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇలాంటి కేసుల్లో బాధితురాలికి శారీరకంగానే కాకుండా మానసికంగా దెబ్బ తగులుతుంది. వారి ప్రతిష్ట, గౌరవం, భవిష్యత్తు, ఆర్థిక భద్రత ప్రమాదంలో పడతాయి. బాధితులు, వారి కుటుంబసభ్యులు సామాజికంగా పరిహాసానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిర్యాదు ఆలస్యం కావొచ్చు. అంతమాత్రాన బాధితురాలి ఫిర్యాదును సందేహించాల్సిన అవసరంలేదు. బాధితురాలి సహోద్యోగి ప్రకటనలను పరిశీలిస్తే అత్యాచారం ఉదంతం గురించి అదేరోజు బాధితురాలు సమాచారమిచ్చారు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తనపై కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా కొంతమంది వ్యక్తుల స్వప్రయోజనాలు ఉన్నాయన్న పిటిషనర్ తేజ్‌పాల్ వాదనను తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు రుజువైతే తేజ్‌పాల్‌కు కనీసం పదేళ్ల జైలుశిక్ష నుంచి గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. తీర్పు అనంతరం న్యాయవాది గీతా లూథ్రా మాట్లాడుతూ, సెషన్స్ కోర్డు తీర్పును తాము సవాల్ చేయబోవట్లేదని చెప్పారు. కోర్టుకు హాజరైన తేజ్‌పాల్ సాయంత్రం తిరిగివెళ్తుండగా మంగళ్ చౌధరి అనే ఓ నిరసనకారుడు నల్లజెండాను విసిరాడు. తేజ్‌పాల్ కారులోకి వెళ్లిపోవడంతో అది ఆయనపై పడలేదు. రాజస్థాన్ నుంచి వచ్చి గోవాలో ఉంటున్న మంగళ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వివరాల లీక్‌పై వివరణివ్వండి: జాతీయ మహిళా కమిషన్ ఆదేశం తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలైన మహిళా పాత్రికేయురాలి ఇంటిపేరును ట్విట్టర్లో బహిర్గతం చేయడంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖిని శనివారం ఆదేశించింది. అలాగే బీజేపీ నేత విజయ్ జోలీకి షోకాజ్ నోటీసు, సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. జోలీ సోమవారం కమిషన్ ముందు హాజరుకానున్నట్లు సమాచారమిచ్చారని వెల్లడించారు. -
పోలీసులే బలవంతంగా ఒప్పించారు: శ్రీశాంత్
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో నేరాన్ని ఒప్పుకోవాలని ఢిల్లీ పోలీసులు బలవంతం చేశారని నిషేధిత బౌలర్ శ్రీశాంత్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పట్లో బోర్డు నియమించిన క్రమశిక్షణ కమిటీకి రాసిన ఈ లేఖలోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ‘నేరాన్ని అంగీకరించాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారు. పైగా నా సన్నిహితుల్ని కూడా ఇందులో ఇరికిస్తామని, అరెస్టు కూడా చేస్తామని వాళ్లు భయపెట్టారు. అలా నేను తప్పును ఒప్పుకున్నట్లుగా చెప్పించి స్టేట్మెంట్ను తయారు చేశారు. దీనిపై నా సంతకాన్ని కూడా తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించడం వల్లే సంతకం చేయాల్సి వచ్చింది’ అని శ్రీశాంత్ లేఖలో పేర్కొన్నాడు. పోలీసుల స్టేట్మెంట్లో ఉన్నవి పూర్తిగా నిరాధారమైన అంశాలన్నాడు.