తరుణ్ తేజ్‌పాల్ అరెస్టు | Tarun Tejpal arrested by police | Sakshi
Sakshi News home page

తరుణ్ తేజ్‌పాల్ అరెస్టు

Published Sun, Dec 1 2013 1:20 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

తరుణ్ తేజ్‌పాల్ అరెస్టు - Sakshi

తరుణ్ తేజ్‌పాల్ అరెస్టు

 లైంగిక దాడి కేసులో కస్టడీకి తీసుకున్న క్రైం బ్రాంచ్
 ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన పణజీ కోర్టు
 ఉదంతంలో తేజ్‌పాల్ పాత్రపై నమ్మదగిన సాక్ష్యం ఉందని కోర్టు స్పష్టీకరణ
 భిన్న ప్రకటనలతో ఊసరవెల్లిలా తేజ్‌పాల్: పీపీ
 
 పణజీ: తోటి పాత్రికేయురాలిపై లైంగిక దాడి కేసులో ‘తెహెల్కా’ పత్రిక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను శనివారం రాత్రి గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత నిబంధనల ప్రకారం వైద్య పరీక్షల నిమిత్తం తేజ్‌పాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసులో గోవా, ఢిల్లీ పోలీసుల బృందం తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున తేజ్‌పాల్ శుక్రవారం పణజీ జిల్లా సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... తేజ్‌పాల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ రాత్రి 8 గంటలకు తీర్పు ఇచ్చారు.  ఉదంతంలో తేజ్‌పాల్ పాత్రపై నమ్మదగిన సాక్ష్యం ఉందని స్పష్టీకరించారు.
 గోవాలోని ఒక హోటల్‌లో తోటి పాత్రికేయురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు శనివారం 10.30 గంటల వరకు అరెస్టు చేయకుండా పణజీ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శుక్రవారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. తేజ్‌పాల్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శనివారం ఉదయం 10 గంటలకు జడ్జి అనుజా ప్రభుదేశాయ్ మళ్లీ విచారణ ప్రారంభించారు. తేజ్‌పాల్ కోర్టులో హాజరయ్యారు. ఆయన తరఫున న్యాయవాది గీతా లూథ్రా తన వాదనలు కొనసాగించారు. దర్యాప్తు నిమిత్తం పోలీసులు కోరినంత కాలం గోవాలో ఉండటానికి తేజ్‌పాల్ సిద్ధంగా ఉన్నారని కోర్టుకు నివేదించారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయనే వాదనలనూ తోసిపుచ్చారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరేష్ లొట్లికార్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో ప్రాసంగిక సాక్ష్యాలు తేజ్‌పాల్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని, అందువల్ల విచారించేందుకు అతన్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నట్లు నివేదించారు. గోవాలోని హోటల్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లోని చిత్రాలు అత్యాచారం ఆరోపణలకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా నిందితుడు తేజ్‌పాల్ పూటకో రకంగా భిన్నమైన ప్రకటనలు ఇస్తున్నారని వాదించారు. బాధితురాలు తన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నారని పీపీ స్పష్టం చేశారు. తేజ్‌పాల్ గోవా పోలీసులకు అందుబాటులో లేరని, కోర్టు నుంచి తాత్కాలిక బెయిల్ పొందిన తర్వాత మాత్రమే ప్రత్యక్షమయ్యారని చెప్పారు. దర్యాప్తు సక్రమంగా జరగాలంటే నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో దాఖలైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఫిర్యాదురాలి కుటుంబంపై ఒత్తిడి తెచ్చేందుకు తేజ్‌పాల్ ఇంతకుముందు ప్రయత్నించారని ఆరోపించారు. తేజ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పీపీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించారు. తేజ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ 25 పేజీల తీర్పు ఇచ్చారు.
 తేజ్‌పాల్ బెయిల్‌కు అనర్హుడు...
 మహిళపై నిర్బంధ అత్యాచారం(ఐపీసీ 376 (2)కె), ఆమె గౌరవానికి భంగం కలిగించడం (ఐపీసీ 354ఏ) కేసుల్లో నిందితుడు తరుణ్ తేజ్‌పాల్ ప్రమేయం ఉన్నట్లు నమ్మదగిన సాక్ష్యం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. నేర తీవ్రత దృష్ట్యా తేజ్‌పాల్‌కు బెయిల్ పొందే అర్హత లేదని తేల్చి చెప్పారు. ‘‘పిటిషనర్ ఆమె (పాత్రికేయురాలు)కు గురువు, తండ్రి వంటివారు. అయితే ఆ స్థానాన్ని అతను దుర్వినియోగం చేశారు. ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇలాంటి కేసుల్లో బాధితురాలికి శారీరకంగానే కాకుండా మానసికంగా దెబ్బ తగులుతుంది. వారి ప్రతిష్ట, గౌరవం, భవిష్యత్తు, ఆర్థిక భద్రత ప్రమాదంలో పడతాయి. బాధితులు, వారి కుటుంబసభ్యులు సామాజికంగా పరిహాసానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిర్యాదు ఆలస్యం కావొచ్చు. అంతమాత్రాన బాధితురాలి ఫిర్యాదును సందేహించాల్సిన అవసరంలేదు. బాధితురాలి సహోద్యోగి ప్రకటనలను పరిశీలిస్తే అత్యాచారం ఉదంతం గురించి అదేరోజు బాధితురాలు సమాచారమిచ్చారు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తనపై కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా కొంతమంది వ్యక్తుల స్వప్రయోజనాలు ఉన్నాయన్న పిటిషనర్ తేజ్‌పాల్ వాదనను తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు రుజువైతే తేజ్‌పాల్‌కు కనీసం పదేళ్ల జైలుశిక్ష నుంచి గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. తీర్పు అనంతరం న్యాయవాది గీతా లూథ్రా మాట్లాడుతూ, సెషన్స్ కోర్డు తీర్పును తాము సవాల్ చేయబోవట్లేదని చెప్పారు. కోర్టుకు హాజరైన తేజ్‌పాల్ సాయంత్రం తిరిగివెళ్తుండగా మంగళ్ చౌధరి అనే ఓ నిరసనకారుడు నల్లజెండాను విసిరాడు. తేజ్‌పాల్ కారులోకి వెళ్లిపోవడంతో అది ఆయనపై పడలేదు. రాజస్థాన్ నుంచి వచ్చి గోవాలో ఉంటున్న మంగళ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 బాధితురాలి వివరాల లీక్‌పై వివరణివ్వండి: జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
 తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలైన మహిళా పాత్రికేయురాలి ఇంటిపేరును ట్విట్టర్‌లో బహిర్గతం చేయడంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖిని శనివారం ఆదేశించింది. అలాగే బీజేపీ నేత విజయ్ జోలీకి షోకాజ్ నోటీసు, సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. జోలీ సోమవారం కమిషన్ ముందు హాజరుకానున్నట్లు సమాచారమిచ్చారని వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement