తేజ్ పాల్ మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. వచ్చే నెల 1వ తేదీ వరకూ తేజ్ పాల్ కు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తేజ్పాల్ తల్లి శకుంతల తేజ్పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
అనంతరం ఈ నెల 27 వరకు తేజ్పాల్ మధ్యంతర బెయిల్ ను పొడిగించింది. అతనికి ఇచ్చిన బెయిల్ గడువు నేటితో ముగియనుండటంతో తేజ్ పాల్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం బెయిల్ ను మరో నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.