లైంగిక వేధింపుల కేసులో మాజీ జడ్జి పేరు వెలుగులోకి
న్యూఢిల్లీ: న్యాయవిద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో గోప్యంగా ఉన్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పేరు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సుప్రీం కోర్టులో ఎన్నో కీలక కేసులు పరిష్కరించి, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న జస్టిస్ ఏకే గంగూలీ అని వెల్లడైంది. బాధితురాలితో పాటు జస్టిస్ గంగూలీ వాంగ్మూలాన్ని రికార్డు చేయడం పూర్తవడంతో సుప్రీం కోర్టు అధికారి ఒకరు ఆయన పేరు బయటపెట్టారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్ గంగూలీ ఖండించారు. ఆ ఆరోపణలు తనను షాక్‌నకు గురిచేశాయని చెప్పారు. విచారణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఆ ఆరోపణలు అసత్యమని తేల్చిచెప్పానని, అసలు తనపై అలాంటి నిందలను ఆమె ఎందుకు వేసిందో అర్థం కావడం లేదని తెలిపారు.
అంతకుముందు ఆయన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెహెల్కా’ తరుణ్ తేజ్‌పాల్ కేసుతో తన కేసును పోల్చవద్దని చెప్పారు. ఆ న్యాయ విద్యార్థిని తన కుమార్తె లాంటిదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తానే బాధితుడిగా మిగిలానన్నారు. అయితే పేరు బయటపడిన విషయంపైతానేమీ సిగ్గుపడడంలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆమెను శారీరకంగా హింసించలేదని స్పష్టంచేశారు. ఆమె తన దగ్గర ఇంటర్న్‌షిప్ చేయడానికి అధికారికంగా అనుమతి తీసుకురాలేదని చెప్పారు. వేరే విద్యార్థిని స్థానంలో ఆరోపణలు చేసిన విద్యార్థిని స్వతంత్రంగా వచ్చిందని తెలిపారు. అంతేగాక పనుల నిమిత్తం తన ఇంటికి చాలా సార్లు వచ్చిందని వెల్లడించారు.