న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసులో ఇద్దరు దోషులకు శుక్రవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శిక్ష తగ్గింపును కొట్టివేస్తూ ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును సవాల్ చేస్తూ దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
సమాన సంఖ్యలో జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచి్చన తీర్పుపై తామెలా విచారణ చేపట్టగలమని (రెండు ధర్మాసనాల్లోనూ సమంగా ఇద్దరేసి జడ్జీలు ఉన్నందువల్ల) ప్రశ్నించింది. 2002లో గోద్రా అలర్ల అనంతర ఘటనల్లో గర్భవతి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు హత్యకు గురుయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
భగవాన్‌దాస్ షా పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2022 మే 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా షాను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన బిల్కిస్ బానో కేసుల యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మందిని స్రత్పవర్తన కలిగి ఉన్నారనే కారణంతో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి.
వివిధ రంగాలు చెందిన మేధావులు, ప్రముఖులు ఆరు వేల మంది దోషులకు శిక్ష మినహాయింపును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఒక లేఖలో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 8న వారికి శిక్ష మినహాయింపు సరికాదని తీర్పునిచి్చంది. రెండు వారాల్లోగా దోషులందరూ జైలులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. విచక్షణాధికారాలను తప్పుగా వాడారని, అనైతిక పద్దతుల ద్వారా దోషులకు అనుకూలంగా వ్యవహరించారని గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది.
కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి క్షమాభిక్షను ప్రసాదించే అధికార పరిధి కూడా ఆ రాష్ట్రానిదేనని, గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారాన్ని చట్టవిరుద్ధంగా లాక్కుందని పేర్కొంది. సమానబలం కలిగిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు (రెండూ ద్విసభ్య ధర్మాసనాలే) శిక్ష మినహాయింపుపై పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని, విస్తృత ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయాలని పిటిషనర్లు కోరారు.
‘ఇదేం పిటిషన్. ఇది ఎలా విచారణార్హం అవుతుంది? ఇది పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని వేసిన పిటిషన్. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎలా వేస్తారు? సమాన సంఖ్య ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము సమీక్షించలేం’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లు శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ల తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా తమ వ్యాజ్యాన్ని ఉపసహరించుకోవడానికి అనుమతి కోరారు. ధర్మాసనం దీనికి సమ్మతించింది. భగవాన్‌దాస్ షా మధ్యంతర బెయిల్‌ను కూడా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment