టుండాకు ఐఎంతో లింకు!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా ఉగ్రవాది, హైదరాబాద్‌లో పట్టుబడిన అబ్దుల్ కరీంటుండాకు దిల్‌షుక్ నగర్‌లో పేలుళ్లకు తెగబడిన ఐఎం(ఇండియన్ ముజాహిదీన్)తో సంబంధాలున్నాయని ఢిల్లీ పోలీసులు తేల్చారు. ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్‌తో మరింత సత్సంబంధాలున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ మేరకు గత మంగళవారం ఢిల్లీ కోర్టులో టుండాపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఆయా వివరాలను పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాం తాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతేడాది ఆగస్టులో ఇక్కడ అరెస్టు చేశారు.
చార్జ్‌షీట్‌లో పేర్కొన్న మరిన్ని వివరాలు..
- 1994లో బంగ్లాదేశ్ కేంద్రంగా పాక్-ఇండియా టై నెట్‌వర్క్‌ను స్థాపించి వ్యవహారాలు సాగించిన టుండా పాకిస్థానీయులతో పాటు భారత యువతనూ ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు.
- పాక్‌కు చెందిన ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించడం, వారితో స్థానిక యువతను ఆకర్షించి, బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడం వంటివి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. దీనికోసం ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నలుగురిలో సలీం జునైద్ ఒకడు. ఈయన టుండా తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇది హైదరాబాద్‌లో దాదాపు 6 పేలుళ్లకు పాల్పడింది. జునైద్‌ను హైదరాబాద్ పోలీసులు 1998లో అదుపులోకి తీసుకున్నారు.
- మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ టుండాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2005లో ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్‌ను కలిశాడు. కోల్‌కతాకు చెందిన రజాఖాన్ ఐఎం ముసుగులో రియాజ్, ఇక్బాల్ భత్కల్ ద్వారా దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాడు. 2007లో హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల కేసుల్లోనూ రజాఖాన్ వాంటెడ్‌గా ఉన్నాడు. 2005లో టుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు చెందిన ఓ ఉన్నతాధికారి సాయంతో అమీర్ రజా ఖాన్‌ను కలిశాడని, ఐఎంకు పూర్తిస్థాయి సహకారం అందించేందుకు అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.