Abdul Karim Tunda
-
తుండా విడుదలపై సుప్రీంకు సీబీఐ
న్యూఢిల్లీ: 1993 వరుస పేలుళ్ల కేసులో అబ్దుల్ కరీం తుండా(81)ను నిర్దోషిగా పేర్కొంటూ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ తెలిపింది. కోర్టు తీర్పును క్షుణ్నంగా పరిశీలించాక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పేర్కొంది.తుండాపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని పేర్కొన్న అజ్మేర్లోని ప్రత్యేక టాడా కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది. ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్ అనే వారికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా మరో 22 మంది గాయపడ్డారు. -
93 పేలుళ్ల కేసు నుంచి తుండాకు విముక్తి
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసు నుంచి మాఫియా డాన్, వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అబ్దుల్ కరీం తుండా(81)కు ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అతడిపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. తుండాపై ఉన్న అభియోగాలన్నిటినీ కొట్టి వేస్తూ గురువారం అజ్మేర్లోని ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నివారణ చట్టం (టాడా) కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా 22 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తుండా బాంబుల తయారీకి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. కాగా, హమీదుద్దీన్ 14 ఏళ్లుగా, ఇర్ఫాన్ 17 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. బాంబు పేలుళ్లతోపాటు వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. -
నేడు ఉగ్రవాది తుండా కేసులో తీర్పు
-
కరీం తుండా పై నేడు తుది తీర్పు
-
తిరగదోడుతున్నారు..!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చిన లష్కరేతోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాపై నగరంలో ఒకే కేసు ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాకిస్తానీ సలీం జునైద్ కేసులో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఇతను తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లిమీన్ (టీఐఎం) స్థాపనలో కీలక పాత్ర పోషించినప్పటికీ... ఆ సంస్థ ఘాతుకాలపై నమోదైన కేసుల్లో ఇతడి ప్రస్తావన ఎక్కడా లేదు. దీంతో పాతరికార్డులను తిరగదోడుతున్న పోలీసు, నిఘా వర్గాలు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే టుండాపై ఉన్న కేసులకు సంబంధించి ఓ స్పష్టత వస్తుందని చెబుతున్నారు. బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారంగా ఏర్పడిన తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లిమీన్ (టీఐఎం) సంస్థ దేశ వ్యాప్తంగా 40కి పైగా పేలుళ్లకు పాల్పడింది. దీని ఏర్పాటులో ముంబైకి చెందిన ‘డాక్టర్ బాంబ్’ జలీస్ అన్సారీతో పాటు అప్పట్లో నగరంలో నివసించిన అబ్దుల్ కరీం టుండా సైతం కీలక పాత్ర పోషించారు. 1994లో జలీస్ అన్సారీ సహా కీలక వ్యక్తులు అరెస్టు కావడంతో టుండా దేశం దాటేశాడు. ఆపై బంగ్లాదేశ్ కేంద్రంగా వ్యవహారాలు సాగించిన ఇతను పాకిస్థానీయులతో పాటు భారత్‌కు చెందిన యువతనూ ఉగ్రవాదం వైపు మళ్లించడం ద్వారా లక్ష్యాలను సాధించాలనుకున్నాడు. పాక్–ఇండియా టెర్రర్ నెట్‌వర్క్‌గా పిలిచే దీనిలో అనేక మంది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించడం, వారితో ఆపరేషన్లు చేయించకుండా కేవలం స్థానిక యువతను ఆకర్షించడం, బాంబుల తయారీపై శిక్షణ ఇవ్వడం తదితరాలు చేయించాలని భావించాడు. ఆ నలుగురిలో జునైద్ ఒకరు.. దీనికోసం ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నలుగురిలో సలీం జునైద్ ఒకడు. ఇస్తఖ్ అలియాస్ అబు సాహెబ్ అనే మారుపేర్లు కూడా ఉన్న జునైద్ పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్న మొహల్లా మంగ్ నబీ ప్రాంతంలో జన్మించాడు. 1981లోనే లష్కరే తోయిబా క్యాంప్‌లో చేరి శిక్షణ పొందాడు. ఇతడితో పాటు మరో ముగ్గురిని ఎంపిక చేసుకున్న టుండా బంగ్లాదేశ్‌లో బాంబుల తయారీపై శిక్షణ ఇచ్చాడు. ఇందుకుగాను ఢాకా సమీపంలోని మలీబాగ్లో ఓ ప్రయోగశాలనే స్థాపించాడు. శిక్షణ అనంతరం జునైద్ భారత్‌లోకి ప్రవేశించి నగరంలోని పాతబస్తీలో స్థిరపడ్డాడు. స్థానిక యువతిని వివాహం చేసుకుని యువతను ఆకర్షించడం ప్రారంభించాడు. దీనిపై సమాచారం అందుకున్న నగర పోలీసులు 1998 జూలై 1న అతడిని అరెస్టు చేసి సైలెన్సర్‌తో కూడిన పిస్టల్స్, 18 కేజీల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. డెహ్రాడూన్, లక్నో, ఘజియాబాద్, ముంబై, అలీఘర్‌లతో పాటు గణేష్ ఉత్సవాలకు ముందు హైదరాబాద్‌లోనూ పేలుళ్లకు కుట్రపన్నినట్లు నిర్థారించారు. మొత్తం 24 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో టుండా 22వ నిందితుడు. ఈ కేసులోనే పీటీ వారెంట్‌పై ఢిల్లీ నుంచి తీసుకురావాలని నగర పోలీసులు భావిస్తున్నారు. 2006 జూన్ వరకు చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవించిన జునైద్ ఆపై విశాఖపట్నంలోని డిటెన్షన్ క్యాంప్‌కు చేరాడు. టీఐఎం రికార్డుల పరిశీలన... టీఐఎం సంస్థ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌ల్లో విధ్వంసాలు సృష్టించింది. 1993లో నగరంలోని అబిడ్స్, గోపాలపురం, హుమాయున్‌నగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో నలుగురు మరణించగా... పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నేరుగా ప్రమేయం లేకపోవడంతో ఈ కేసుల్లో టుండా పేరు లేదు. దీంతో అప్ప ట్లో అరెస్టై వారిచ్చిన నేరాంగీకార వాం గ్మూలాల్లో టుండా ప్రస్తావన ఉందా..? అనే కోణంపై పోలీసులు, నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. దీనికోసం అప్పటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిన తరవాత టుండాకు సంబంధించిన కేసులపై ఓ స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీసీఎస్ ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు జునైద్ కేసులో కరీం టుండాను విచారించడానికే సిటీకి తరలించారు. -
టుండాకు ఐఎంతో లింకు!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా ఉగ్రవాది, హైదరాబాద్‌లో పట్టుబడిన అబ్దుల్ కరీంటుండాకు దిల్షుక్ నగర్లో పేలుళ్లకు తెగబడిన ఐఎం(ఇండియన్ ముజాహిదీన్)తో సంబంధాలున్నాయని ఢిల్లీ పోలీసులు తేల్చారు. ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్తో మరింత సత్సంబంధాలున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ మేరకు గత మంగళవారం ఢిల్లీ కోర్టులో టుండాపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఆయా వివరాలను పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాం తాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతేడాది ఆగస్టులో ఇక్కడ అరెస్టు చేశారు. చార్జ్‌షీట్‌లో పేర్కొన్న మరిన్ని వివరాలు.. - 1994లో బంగ్లాదేశ్ కేంద్రంగా పాక్-ఇండియా టై నెట్‌వర్క్‌ను స్థాపించి వ్యవహారాలు సాగించిన టుండా పాకిస్థానీయులతో పాటు భారత యువతనూ ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. - పాక్‌కు చెందిన ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించడం, వారితో స్థానిక యువతను ఆకర్షించి, బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడం వంటివి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. దీనికోసం ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నలుగురిలో సలీం జునైద్ ఒకడు. ఈయన టుండా తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇది హైదరాబాద్‌లో దాదాపు 6 పేలుళ్లకు పాల్పడింది. జునైద్‌ను హైదరాబాద్ పోలీసులు 1998లో అదుపులోకి తీసుకున్నారు. - మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ టుండాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2005లో ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్‌ను కలిశాడు. కోల్‌కతాకు చెందిన రజాఖాన్ ఐఎం ముసుగులో రియాజ్, ఇక్బాల్ భత్కల్ ద్వారా దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాడు. 2007లో హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల కేసుల్లోనూ రజాఖాన్ వాంటెడ్‌గా ఉన్నాడు. 2005లో టుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన ఓ ఉన్నతాధికారి సాయంతో అమీర్ రజా ఖాన్‌ను కలిశాడని, ఐఎంకు పూర్తిస్థాయి సహకారం అందించేందుకు అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. -
రూ.5 నోటు ఉందా.. బహుశా నకిలీ కావొచ్చు!
మీ జేబులో ఐదు రూపాయల నోటు ఉంటే.. బహుశా అది నకిలీ నోటు కావొచ్చు. మళ్లీ ఎప్పుడైనా మీ చేతికి ఐదు రూపాయల నోటు వస్తే ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఐదు రూపాయల నోట్లను స్వాధీన పరుచుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. నకిలీ ఐదు రూపాయల నోట్ల వ్యవహారం వినియోగదారులనే కాకుండా, ఆర్ధిక వ్యవస్థను ఆందోళనకు గురి చేస్తోంది. భారీ మొత్తంలో నకిలీ నోట్ల సరఫరాలో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ది ప్రధాన పాత్ర అని పోలీసులు వెల్లడించారు. నకిలీ నోట్లపై దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు ఓ ఆసక్తికరమైన అంశం దృష్టికి వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీ, ముల్తాన్, క్వెట్టా, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రింటింగ్ ప్రెస్ లోనే నకిలీ భారతీయ కరెన్సీ ప్రింట్ అవుతోందనే సమాచారం అందింది. నకిలీ నోట్లన్ని గుర్తుపట్టని రీతిలో దాదాపు ఒరిజినల్ నోట్లుగానే చెలామణీలో ఉంటాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. గతంలో నకిలీ నోట్లన్ని హై డినామినేషన్ లో వచ్చేవని... నకిలీ నోట్ల సరఫరాలో ప్రస్తుతం మాఫియా వ్యూహాన్ని మార్చారని పోలీసుల తెలిపారు. గతంలో 1000, 500 నోట్లు మాత్రమే నకిలీ నోట్లుగా వచ్చేవని.. ఐతే తక్కువ విలువ నోట్లను మార్పిడి చేయడానికి అంతగా కష్టం ఉండకపోవడంతో పాక్ నకిలీ కరెన్సీ మాఫియా 5 రూపాయలను ఎంచుకుందని ఉన్నతాధికారులు తెలిపారు. గత మూడేళ్లుగా 5, 10, 20 రూపాయల నకిలీ నోట్లను భారత్ లోకి ప్రవేశపెట్టి.. భారీ ఎత్తున ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మాఫియా చెలామణిలోకి తీసుకువస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. కేవలం 2013 సంవత్సరంలో 5.66 కోట్ల రూపాయల భారతీయ నకిలీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను, 20,517 వంద రూపాయల నోట్లను, 60,525 ఐదు వందల నోట్లను, 24,116 వెయి రూపాయల నోట్లను స్వాధీన పరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరెన్సీ పేపర్, ఇంక్, మాగ్నటిక్ దారంను పాక్ మాఫియా భారతీయ కరెన్సీ ప్రింటింగ్ కు వినియోగిస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇటీవల పట్టుబడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్, లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ కరీం తుండాలు ఇంటారాగేషన్ లో వెల్లడించినట్టు పోలీసుల తెలిపారు. పాక్ లో ప్రచురించిన నకిలీ కరెన్సీని బంగ్లాదేశ్, నేపాల్, థాయ్ లాండ్, డెన్మార్క్, హాలెండ్, సింగపూర్, శ్రీలంక దేశాల నుంచి భారత్ లో ప్రవేశపెడుతున్నట్టు విచారణలో సమాచారం తెలిసిందన్నారు. ఏది ఏమైనా నకిలీ కరెన్సీని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కస్టమ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాలతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు. కరెన్సీ నోట్ల మార్పులో ఏదైనా అనుమానం వస్తే వాటిని పోలీసుల దృష్టికి తీసుకురావాలని వినియోగదారులకు విజ్క్షప్తి చేస్తున్నారు. -
తుండా కస్టడీపిటీషన్ పై నేడు విచారణ
-
మూడు రోజుల పోలీస్ కస్టడీకి టుండా
న్యూఢిల్లీ : నగరంలో 1997 అక్టోబర్ 26న జరిగిన బాంబుపేలుడు కేసులో ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఇప్పటివరకు వివిధ బాంబు పేలుళ్ల కేసుల్లో పోలీస్ కస్టడీలో ఉన్న టుండాను శుక్రవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, అతడిని 1997 అక్టోబర్ 26 బాంబు పేలుళ్ల కేసులో విచారించాల్సిన అవసరం ఉందని, అందువల్ల అతడిని తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరగా, మేజిస్ట్రేట్ పై విధంగా తీర్పు చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 37 బాంబు పేలుళ్ల కేసుల్లో టుండాకు సంబంధం ఉందంటూ పోలీసులు అతడిని అరెస్టు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల క్రితం అతని బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు చేయాలన్న పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల అతడికి బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని తెలిపింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ బన్సల్ ఎదుట హాజరైన టుండా.. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ చేయొద్దని కోరాడు. తన వయసు 72 సంవత్సరాలని, వివిధ వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇటీవలే తనకు పేస్ మేకర్ అమర్చారని, హైబీపీతో కూడా బాధపడుతున్నానని తెలిపాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని కోరాడు. తనకు ఈ పరీక్ష అంటే ఏంటో, దాని పరిణామాలేంటో కూడా తెలుసని కోర్టుకు చెప్పాడు. -
బ్రెయిన్ మ్యాపింగ్ వద్దన్న టుండా.. సరేనన్న కోర్టు
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో బాంబుల తయారీలో నిపుణుడైన అబ్దుల్ కరీం టుండా విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు మన్నించింది. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు వద్దని అతడు కోరగా.. టెస్టు చేయాలన్న పోలీసుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల అతడికి బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని తెలిపింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ బన్సల్ ఎదుట హాజరైన టుండా.. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ చేయొద్దని కోరాడు. తన వయసు 72 సంవత్సరాలని, వివిధ వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇటీవలే తనకు పేస్ మేకర్ అమర్చారని, హైబీపీతో కూడా బాధపడుతున్నానని తెలిపాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని కోరాడు. తనకు ఈ పరీక్ష అంటే ఏంటో, దాని పరిణామాలేంటో కూడా తెలుసని కోర్టుకు చెప్పాడు. భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఉన్న ఉగ్రవాద నెట్వర్కు, అతడి సన్నిహితుల గురించి తెలుసుకోడానికి బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష చేయాలంటూ ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కోర్టులో దరఖాస్తు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా టుండా తరఫు న్యాయవాది ఎం.ఎస్.ఖాన్ పై విషయాలను కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితుడి అనుమతి లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్ చేయకూడదంటూ సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. -
భత్కల్‌కు అరదండాలు
మన భద్రతా సంస్థలు చాలా తక్కువ వ్యవధిలో రెండు ఎన్నదగిన విజయాలు సాధించాయి. ఈ రెండూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయడంలో ఎంతగానో ఉపయోగపడేవి. సరిగ్గా పక్షం రోజుల క్రితం ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా పట్టుబడ్డాడు. గురువారం మరో ఉగ్రవాది యాసీన్ భత్కల్ దొరికి పోయాడు. ఇద్దరి మధ్యా వయసులో చాలా వ్యత్యాసమున్నా ఇద్దరికిద్దరూ అత్యంత ప్రమాదకరవ్యక్తులు. టుండా రెండు దశాబ్దాల నుంచి మన భద్రతా సంస్థలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుంటే భత్కల్ గత ఐదేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇద్దరూ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో పనిచేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పథక రచన చేశారు. ఎందరెందరో అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. టుండా చాలాకాలం ఆచూకీ లేకుండా పోయి బంగ్లాదేశ్ నుంచి తన కార్యకలాపాలు కొనసాగించగా, భత్కల్ మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతూ విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ, ఒకటి రెండుసార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. చివరకు ఇద్దరూ నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణే, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్ నగరాల్లో గత అయిదేళ్లుగా జరిగిన బాంబు పేలుడు ఘటనలన్నిటా భత్కల్ హస్తముందన్నది పోలీసుల ఆరోపణ. 17 మంది మరణానికి దారితీసిన పూణే జర్మన్ బేకరీ బాంబు పేలుడు ఘటన సందర్భంగా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో తొలిసారి భత్కల్‌ని గుర్తించారు. ఆరునెలల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల ఘటనల్లో సైతం భత్కల్ ప్రమేయాన్ని సీసీ టీవీ కెమెరాలు రికార్డు చేశాయి. 2009లో కోల్‌కతాలో దొంగనోట్ల కేసులో మారుపేరుతో పట్టుబడి, అసలు విషయం గుర్తించే లోగానే బెయిల్‌పై విడుదలై పరారయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లి ఇండియన్ ముజాహిదీన్ సంస్థ స్థాపకుల్లో ఒకడిగా ఉండి ఐఎస్ఐ సహకారంతో ఈ ఘటనలన్నిటికీ పాల్పడ్డాడు. మొన్న దొరికిన అబ్దుల్ కరీం టుండాగానీ, ఇప్పుడు పట్టుబడిన భత్కల్గానీ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్‌వర్క్‌లో భాగస్తులు. పాకిస్థాన్ సైన్యం తమ గడ్డపై ఇలాంటి ఉగ్రవాదులకు శిక్షణనివ్వడం, అటు తర్వాత వారిని సరిహద్దులు దాటించి భారత్‌లో ఉగ్రవాద ఘటనలకు పాల్పడేలా చేయడం చాలాకాలం నుంచి సాగుతోంది. భత్కల్‌కు వరసకు సోదరులయ్యే రియాజ్, ఇక్బాల్ ఇప్పటికీ పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నారని మన గూఢచార సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇలా దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్న దాదాపు 12మంది పాక్‌లోనే ఉంటున్నారు. వీరుకాక లష్కరే తొయిబా నేతలు హఫీజ్ సయీద్, జకీ-ఉర్-రెహ్మాన్, మౌలానా మసూద్ అజర్ తదితరులను అప్పగించాలని సాక్ష్యాధారాలు సమర్పించినా పాకిస్థాన్ నిజాయితీగా వ్యవహరించలేదు. 1993 ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్న దావూద్ ఇబ్రహీం కూడా కరాచీలోనే ఉన్నాడు. పాక్ సైన్యం కనుసన్నల్లో పనిచేసే ఐఎస్ఐ వీరందరినీ వెనకుండి నడిపిస్తున్నది కాబట్టే పాకిస్థాన్‌లో ఉన్న పౌర ప్రభుత్వాలు చర్య తీసుకోలేకపోతున్నాయి. ఆ మాట చెబితే తమ చేతగానితనం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో భారత్ సమర్పించిన సాక్ష్యాధారాలు సరిపోవని సాకులు వెదుకుతున్నాయి. ఈమధ్య గద్దెనెక్కిన ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తమ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారడానికి అంగీకరించ బోమని చెప్పినా చేతలు మాత్రం ఇంతవరకూ మొదలుకాలేదు. సరిహద్దుల్లో జరిగిన ఇటీవలి ఘటనలు చూస్తే పాకిస్థాన్‌లో ఏవిధమైన మార్పూ రాలేదన్న సంగతి స్పష్టమవుతోంది. టుండా, భత్కల్ పట్టుబడటంవల్ల దేశంలో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులకు మరింత స్పష్టత వస్తుంది. ఆ నెట్‌వర్క్‌లో ఎంత మంది, ఏ ఏ స్థాయిల్లో పనిచేస్తున్నారో, ఎవరి సహాయ సహకారాలు వారికి అందుతున్నాయో వెల్లడయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్ నుంచి అందే సాయంపై పకడ్బందీ సాక్ష్యాధారాలు లభించవచ్చు. ఈ క్రమంలో మరింత మంది పట్టుబడవచ్చు కూడా. భత్కల్ ఇప్పటికే తన కార్యకలాపాల గురించి, తన నేరాల గురించి విలువైన సమాచారం అందించాడని భోగట్టా. ముఖ్యంగా హైదరాబాద్‌లో 2007లో జరిగిన లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్‌లో జరిగిన పేలుళ్లు, ఇటీవలి దిల్సుఖ్నగర్ పేలుళ్ల విషయమై ఎన్నో కొత్త కోణాలు బయట పడతాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న ప్రతిసారీ ఇంటెలిజెన్స్ సంస్థల వైఫల్యమో, వారిచ్చిన నివేదికలపై సరిగా స్పందించని పోలీసుల వైఖరో బయట పడుతోంది. వాటిని సరిచేసుకోవడంతోపాటు ఉగ్రవాదులు రూపొందడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేస్తున్నాయో, ఏ పరిణామాలు కొందరు యువకుల్ని అలాంటి కంటకమార్గం వైపు నడిపిస్తున్నాయో, సమాజానికి పెను ముప్పుగా మారుస్తున్నాయో అధ్యయనం చేయాల్సిన బాధ్యత, నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. భత్కల్ వంటివారిని పట్టుకోవడం, వారి నేరాలను నిరూపించి కఠినశిక్ష పడేలా చేయడం ఒక ఎత్తయితే... సమాజంలో భిన్నవర్గాల మధ్య చిచ్చుపెట్టే శక్తులను సకాలంలో గుర్తించడం మరో ఎత్తు. అదృష్టవశాత్తూ ఎందరు ఎంత రెచ్చగొట్టినా సంయ మనం పాటించడం, హేతుబద్ధంగా ఆలోచించడం ఈ గడ్డపై ఆది నుంచీ ఉంది. అయితే, చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అందరూ ఒకేవిధంగా స్పందించరు. పరిస్థితుల ప్రభావంతో ఒక్కరు పెడదోవ పట్టినా వారివల్ల మొత్తం సమాజమంతా ఇబ్బందుల్లో పడుతుంది. నష్టపోతుంది. అలాంటి పరిస్థితులను నివారించడంపై కూడా దృష్టిపెడితే ఇరుగుపొరుగు దేశాల కుట్రలను మొగ్గలోనే తుంచడం, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యమవుతుంది. -
బీహార్ పోలీసుల అదుపులో భత్కల్: షిండే
ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టును కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు. ఉత్తర బీహార్‌లో బీహార్-నేపాల్ సరిహద్దు వద్ద అతడిని ఇంటెలిజెన్స్ బలగాలు గతరాత్రి అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. పార్లమెంట్ హౌస్ వెలుపల షిండే విలేకరులతో మాట్లాడారు. యాసిన్ భత్కల్ ప్రస్తుతం బీహార్ పోలీసుల అదుపులో ఉన్నాడని వెల్లడించారు. అతడిని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇటీవల పట్టుబడ్డ అబ్దుల్ కరీం టుండా ఇచ్చిన సమాచారం ఆధారంగా యాసీన్ భత్కల్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడయిన టుండాను ఈనెల 16 భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ముంబై మారణహోమ సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన టుండా.. బాంబుల తయారీలో దిట్ట. చాలాకాలంపాటు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు బాంబులు తయారు చేసిపెట్టాడు. 30 ఏళ్ల యాసిన్ భత్కల్ దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లకు సూత్రధారి. అహ్మదాబాద్, బెంగళూరు, పుణె, సూరత్, ఢిల్లీ, హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో అతడి కోసం భద్రతా దళాలు వెతుకుతున్నాయి. సోదరుడు రియాజ్‌తో కలిసి 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2010లో ఈ సంస్థను ప్రభుత్వం నిషేధించింది. మరుసటి ఏడాదే అమెరికా కూడా విదేశీ తీవ్రవాద సంస్థల జాబితాలో దీన్ని చేర్చింది. -
లఖ్వీతో నాకు పడదు:కరీమ్ టుండా
న్యూఢిల్లీ: తాను లష్కరే తోయిబాలో ఉన్నత స్థానానికి ఎదగకుండా దాని కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ తీవ్రంగా అడ్డుపడ్డాడని ఇటీవల అరెస్టయిన ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ టుండా పోలీసులకు చెప్పాడు. లష్కరే తోయిబా భారత్‌లో విస్తరించడానికి తానే కారణమైనప్పటికీ లఖ్వీ తన అవకాశాలను దూరంచేశాడన్నాడు. అందుకే లఖ్వీ అంటే తనకు ద్వేషమని అతడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బాంబుల తయారీలో నిష్ణాతుడైన 70 ఏళ్ల టుండాను పోలీసులు ఈనెల 16న అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి అయిన లఖ్వీ దాడుల వ్యూహరచన సమయంలో తనను దూరంగా పెట్టాడని టుండా చెప్పినట్లు అతడిని విచారిస్తున్న పోలీసులు తెలిపారు. లఖ్వీతో ఉన్న ఆర్థిక విభేదాల కారణంగా లష్కరే అగ్రనాయకత్వం కూడా ముంబై ఆపరేషన్ సమయంలో తనను పక్కన పెట్టి యువకులైన అబూ జుందాల్ లాంటి వాళ్లను దగ్గరకు తీశారన్నాడు. దీని గురించి జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ తనకు చెప్పాడని... ఇక భారత్ నకిలీ నోట్ల పంపిణీపై దృష్టి సారించమని సూచించాడన్నాడు. -
కోర్టు ప్రాంగణంలో టుండాపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: లష్కరే తోయిబాకు చెందిన బాంబుల నిపుణుడు అబ్దుల్ కరీం టుండాపై మంగళవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో దాడి జరిగింది. శివకుమార్ రాఘవ్ అనే హిందూసేన కార్యకర్త టుండా వీపుపై బలంగా చరిచాడు. ముఖంపై కూడా కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. టుండాను కోర్టులో హాజరుపరచిన నేపథ్యంలో కోర్టు ఆవరణలో హిందూసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడి, అతడికి మరణశిక్ష విధించాలంటూ నినాదాలు చేశారు. ఇంతలోనే ఒక వ్యక్తి అకస్మాత్తుగా భద్రతా వలయాన్ని ఛేదించుకుంటూ వెళ్లి అతడిపై దాడికి పాల్పడ్డాడు. టుండాపై దాడి చేసిన రాఘవ్‌తో పాటు విష్ణు గుప్తా అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయ్ తరేజా ఇన్ కెమెరా విచారణకు ఆదేశించారు. తన వద్ద డబ్బు లేదని, అందువల్ల తాను లాయర్‌ను పెట్టుకోలేనని టుండా మేజిస్ట్రేట్‌కు చెప్పాడు. అతడి తరపున వాదించేందుకు కొందరు లాయర్లు ముందుకు వచ్చారు. అయితే, టుండా వకాల్తనామాపై సంతకం చేశాడంటూ ఎం.ఎస్.ఖాన్ అనే న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీనిపై మేజిస్ట్రేట్ టుండాను ప్రశ్నించగా, తనకు న్యాయవాది ఖాన్ పెద్దగా తెలియదని, అయితే, ఆయన తన తరఫున వాదిస్తారని చెప్పాడు. ఈలోగా ఒక న్యాయవాది ‘టుండా ఉగ్రవాది’ అంటూ కేకలు వేయడంతో కోర్టులో గలభా రేగింది. దీంతో నిందితుడి తరఫు న్యాయవాది మినహా మరెవరూ కోర్టు గదిలో ఉండరాదని మేజిస్ట్రేట్ ఆదేశించారు. టుండాను నాలుగు రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టుండాను ప్రశ్నించనున్న హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో గతంలో జరిగిన పేలుళ్లతో సంబంధాలు ఉన్న టుండాను ప్రశించాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. పీటీ వారంట్‌పై అతడిని ఇక్కడకు రప్పించనున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ఐఎస్ఐ బ్రిగేడియర్ నుంచి టుండాకు నకిలీ కరెన్సీ పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చెందిన ఒక బ్రిగేడియర్ నుంచి టుండాకు నకిలీ భారత కరెన్సీ అందేదని ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. పలుసార్లు అతడు ఐఎస్ఐ బ్రిగేడియర్ నుంచి నకిలీ కరెన్సీ అందుకున్నాడని వారు చెప్పారు. -
కోర్టులోనే అబ్దుల్ కరీమ్ టుండాపై దాడి, పోలీస్ కస్టడీ విధింపు!
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ కరీమ్ టుండాను పది రోజల కస్టడీకి సిటీ కోర్టు నుంచి ఢిల్లీ పోలీసులు అనుమతి తీసుకున్నారు. పోలీసు కస్టడీ విధించడానికి ముందు టుండాపై కోర్టు రూమ్ లో అడ్వకేట్ దాడి ఘటన గందరగోళం సృష్టించడంతో టుండాను రహస్యంగా విచారించారు. టుండాను కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు లో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు ప్రాంగణంలోనే హిందు సేనా అధ్యక్షుడు విష్ణు గుప్తా చెంప దెబ్బ కొట్టడంతో కోర్టు లో గందరగోళం నెలకొంది. దేశంలో సుమారు 40 ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో సంబంధమున్నట్టు కేసులు నమోదయ్యాయి. 20 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో జాబితాలో టుండా ఒకరు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో టుండా నిందితుడుగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీంకు అతిసన్నిహితుడైన టుండాను భారత, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉత్తరఖండ్ లోని బాన్ బసా ప్రాంతంలో శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
చేజిక్కిన ఉగ్రవాద భూతం!
సంపాదకీయం: దాదాపు రెండు దశాబ్దాల నుంచి మన భద్రతాసంస్థలు జల్లెడపడుతున్న ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ అన్వేషణ ఒక దేశంలో కాదు, ఒక నగరంలో కాదు... దాదాపు భూగోళమంతా సాగింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక బాంబు పేలుడు ఘటనలో టుండా విగతజీవుడయ్యాడని 2000 సంవత్సరం ప్రాంతంలో వచ్చిన సమాచారంతో దాదాపు ఐదేళ్లపాటు ఈ అన్వేషణ తాత్కాలికంగా ఆగింది. ఏడేళ్లక్రితం కెన్యాలో దొరికిపోయాడన్నారు. తీరా చూస్తే అతను వేరే వ్యక్తి. అనుమానం కలిగితే స్థావరాన్ని మారుస్తూ, దేశాలన్నీ చుట్టబెడుతూ గుట్టుగా బతికిన టుండా చివరకు చిక్కాడు. 1996లోనే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసినా ఇన్నాళ్లపాటు తప్పించుకు తిరిగాడంటే మాటలు కాదు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్థావర ప్రాంతంగా మారిందని మన దేశం తరచు చేసే ఆరోపణల్లో యదార్థముందని పట్టుబడే సమయానికి టుండా వద్ద దొరికిన పాస్‌పోర్టు ధ్రువీకరించింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆద్యుడిగా, 1993 మొదలుకొని అనేకచోట్ల జరిగిన బాంబు పేలుళ్లతో ప్రత్యక్ష సంబంధాలున్నవాడిగా అనుమానిస్తున్న టుండాపై వాటికి సంబంధించి ఇప్పటికే ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి. వందలమంది మరణానికి దారితీసిన ఆ కేసులన్నీ ఒక ఎత్తయితే, టుండా వద్ద ఉండగల కీలక సమాచారం మరో ఎత్తు. దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా, అతనికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్నా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ద్వారానే వారిద్దరికీ మధ్య బాంధవ్యం ఏర్పడిందనేది మన భద్రతా సంస్థల మాట. ఐఎస్ఐ చీఫ్‌గా పనిచేసి రిటైరైన హమీద్ గుల్ అదుపాజ్ఞల్లో తాను ఈ కార్యకలాపాలు నడిపానని ఇప్పటికే టుండా వెల్లడించాడంటున్నారు. దేశ విభజన, అనంతరం జరిగిన దురదృష్టకర పరిణామాలు రెండు దేశాల మధ్యా పొరపొచ్చాలు సృష్టించాయి. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో వచ్చిన విభేదాలు యుద్ధాల వరకూ వెళ్లాయి. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం అమెరికా పాకిస్థాన్‌ను చేరదీయడంతో పాటు. దానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేసి భారత్‌ను చికాకు పరచాలని చూసింది. అయితే, ఆ ప్రచ్ఛన్నయుద్ధకాలం ముగిసి రెండు దశాబ్దాలు దాటుతున్నా వెనకటి అలవాటును పాక్ సైన్యం వదులుకోలేకపోతోంది. అందులో భాగంగానే మన గడ్డపైకి ఉగ్రవాదులను పంపి, ఏదోరకంగా నష్టపరచాలని చూస్తున్నది. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట అమెరికా ప్రారంభించిన పోరాటం పాకిస్థాన్‌ను కూడా దారికి తెస్తుందని భావించినవారికి నిరాశే మిగిలింది. తమకు ముప్పు కలుగుతుందనుకుంటే ద్రోన్ దాడులతో పదులకొద్దీమందిని చంపడానికి వెనకాడని అమెరికా... భారత్ విషయంలో పాకిస్థాన్ పాల్పడుతున్న చేష్టలను మాత్రం పట్టించుకోవడంలేదు. అందువల్లే ముంబైలో పాకిస్థాన్నుంచి వచ్చిన ఉగ్రవాదులు 2008లో మారణహోమం సృష్టించగలిగారు. ఆ ఘటనలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన డేవిడ్ హెడ్లీ దొరికినా, అతను ఇంటరాగేషన్‌లో ఎంతో విలువైన సమాచారాన్ని అందించినా అందులో మనకు తెలిసింది కొంత మాత్రమే. కరాచీలో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీంను, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, లష్కరే తొయిబా కమాండర్ జాకీ ఉర్ రహ్మాన్ లఖ్వీ, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ వంటి 20 మందిని అప్పగించాలని మన దేశం కోరుతున్నా పాకిస్థాన్ రకరకాల జవాబులిస్తోంది. దావూద్ తమ గడ్డపై లేడని దబాయించి, మిగిలినవారిపై సాక్ష్యాధారాలిస్తే తప్ప అప్పగించడం సాధ్యంకాదని చెబుతోంది. ఈ విషయంలో అమెరికా పాకిస్థాన్‌పై తగిన ఒత్తిడి తేలేకపోతోంది. దావూద్ ఇబ్రహీం పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో సాగిస్తున్న స్మగ్లింగ్ కార్యకలాపాలతో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కూ, అతని ఉగ్రవాద నెట్వర్క్కూ సంబంధముందని 2003లో అమెరికాయే స్వయంగా ప్రకటించింది. అయినా, ‘జాతీయ ప్రయోజనాల రీత్యా’ తప్పనిసరంటూ పాక్‌కు ఎడాపెడా సైనిక, ఆర్ధిక సాయం అందిస్తూనే ఉంది. ఇప్పుడు అరెస్టయిన టుండా దాదాపు ఈ రెండు దశాబ్దాల ఉగ్రవాద కార్యకలాపాలపై కీలక సమాచారాన్ని అందించగలిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలపై కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనల్లో పోలీసులు అమాయకుల్ని అరెస్టుచేశారని ఆరోపణలు వచ్చాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తులో ఎందరో ముస్లిం యువకులు నిర్దోషులుగా తేలారు. ఇలాంటి పరిస్థితుల్లో టుండా వెల్లడించే సమాచారంవల్ల అసలు దోషులు పట్టుబడే అవకాశం ఉంది. ఎందుకంటే, ఐఎస్ఐ కనుసన్నల్లో అతను బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇండియన్ ముజాహిదీన్, హూజీ, జైషే మహమ్మద్వంటి సంస్థలతో సంబంధాలు నెలకొల్పుకుని వాటి కార్యకలాపాలను సమన్వయం చేశాడు. అందులో భాగంగా ఎన్నో సందర్భాల్లో వారితో భేటీ అయ్యాడు. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కదలికల గురించి, అతనికి ఐఎస్ఐ కల్పిస్తున్న రక్షణ గురించి వెల్లడించిన అంశాలేవీ కొత్తవి కాదు. వాటన్నిటినీ ‘రా’ వంటి మన గూఢచార సంస్థలు ఎప్పుడో రాబట్టాయి. అయితే, టుండా దావూద్ ప్రమేయంపై మరింత లోతైన, సాధికారమైన సమాచారాన్ని ఇవ్వగలుగుతాడు. పర్యవసానంగా మన అప్రమత్తతలో, మన సంసిద్ధతలో ఉన్న లోపాలు కూడా బహిర్గతమవుతాయి. దాడులను నిరోధించడానికి, అసలు అవి జరగకుండా నివారించడానికి ఎలాంటి చర్యలు అవసరమో అధ్యయనం చేయడానికి తోడ్పడతాయి. అంతిమంగా అంతర్గత భద్రత పటిష్టతకు ఇవన్నీ దోహదపడతాయి. దీంతోపాటు ఈ సమాచారం ఆధారంగా పాకిస్థాన్‌పై దౌత్యపరంగా మరింత ఒత్తిడి పెంచి, ఇలాంటి కార్యకలాపాలకు అది అడ్డాగా మారకుండా చేయగలిగినప్పుడే అసలైన విజయం సాధించినట్టవుతుంది. కొందరంటున్నట్టు పాకిస్థాన్‌తో చర్చలకు తలుపులు మూయడం మాత్రం పరిష్కారమార్గం కాదు. -
ఐఎస్ఐ మాజీ చీఫ్‌ను సంప్రదించేవాడిని: టుండా
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా బాంబుల నిపుణుడు అబ్దుల్ కరీం టుండా ఇంటరాగేషన్‌లో మరిన్ని వివరాలను వెల్లడించాడు. ఢిల్లీ పోలీసులకు నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డ టుండా తనకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ తదితరులతో గల సంబంధాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐఎస్ఐ మాజీ అధినేత హమీద్ గుల్‌తో తరచూ సంప్రదింపులు జరిపేవాడి నని అతడు తాజాగా వెల్లడించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఐఎస్ఐ మాజీ చీఫ్ గుల్‌ను తొలిసారిగా 1995లో తాను కలుసుకున్నానని, అప్పటి నుంచి తాను ఆయనతో తరచూ సంప్రదింపులు కొనసాగిస్తూ వచ్చానని టుండా చెప్పాడు. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దావా వంటి డజన్ల కొద్దీ ఉగ్రవాద సంస్థలన్నీ ఐఎస్ఐ నీడలోనే పనిచేస్తున్నాయని తెలిపాడు. లష్కరే తోయిబాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది పంజాబీలేనని, వారికి నెలకు కేవలం రూ.3 వేల నుంచి రూ.4 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని టుండా చెప్పినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, టుండా మాటలను గుల్ ఖండించారు. కాశ్మీర్ ‘ఉగ్ర’ చర్యల్లో టుండా కొడుకు: టుండా కొడుకుల్లో ఒకరు తండ్రి అడుగు జాడల్లోనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించి, ఎనిమిదేళ్లు జైలులో గడిపాడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. టుండాకు ముగ్గురు భార్యల ద్వారా ఏడుగురు సంతానం ఉండగా, రెండో భార్య ముంతాజ్‌కు పుట్టిన మూడో కొడుకు వారిస్ కాశ్మీర్లో లష్కరే తరఫున పనిచేశాడని తెలిపారు. శిక్ష అనుభవించాక తిరిగి పాక్‌కు వెళ్లినట్లు చెప్పారు. టుండా లాహోర్, కరాచీలలో ఏర్పాటు చేసిన దుస్తుల కర్మాగారాన్ని, పరిమళ ద్రవ్యాల వ్యాపారాలను అతడి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని తెలిపారు. -
ఐఎస్ఐ రక్షణలోనే దావూద్
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థానీ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ రక్షణలో ఉంటున్నాడు. నేపాల్ సరిహద్దుల్లో శుక్రవారం పట్టుబడిన ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా (70) ఈ విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు. కరాచీలోని ఒక సురక్షితమైన ఇంట్లో ఉంటున్న దావూద్ కదలికలను ఐఎస్ఐ నియంత్రిస్తోందని చెప్పాడు. పోలీసుల ఇంటరాగేషన్‌లో అతడు పలు కీలకమైన విషయాలను వెల్లడించాడు. కరాచీలో తాను పలుసార్లు దావూద్‌ను కలుసుకున్నట్లు చెప్పాడు. దావూద్ తనను తొలిసారిగా 2010లో పిలిపించినట్లు తెలిపాడు. ఐఎస్ఐతో పాటు ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, బబ్బర్ ఖల్సాలతో తాను సంప్రదింపులు కొనసాగించేవాడినని, హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ తదితర ఉగ్రవాద నాయకులతో భేటీ అయ్యేవాడినని తెలిపాడు. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అబు జుందాల్ కంటే టుండా మరింత ‘పెద్దచేప’ అని పోలీసులు అభివర్ణించారు. ఇంటరాగేషన్‌లో అతడు బయటపెట్టిన వివరాలను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆదివారం మీడియాకు వెల్లడించారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలన్నింటితోనూ అతడు సంబంధాలు నెరపాడని, కిందిస్థాయి ఉగ్రవాదులతోనూ భేటీ అయ్యేవాడని ఆయన తెలిపారు. టుండాకు విస్తృతమైన నెట్వర్క్ ఉండేదని, దాని ద్వారానే అతడు భారత్‌కు ఉగ్రవాదులను, పేలుడు పదార్థాలను, నకిలీ భారత కరెన్సీని భారత్‌కు పంపేవాడని చెప్పారు. కరాచీలో అతడు ‘మెహ్దూద్-తాలిమ్-ఇస్లామే దార్-అల్-ఫనూన్’ పేరిట పెద్దసంఖ్యలో మదర్సాలను నడుపుతున్నాడని, వాటి పేరిట భారీగా విరాళాలు వసూలు చేసేవాడని, ఈ మదర్సాలలోనే అతడు యువకులకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవాడని వివరించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అధినేత వాధవా సింగ్ 2010 సెప్టెంబర్-అక్టోబర్‌లో పేలుడు పదార్థాలను బంగ్లా మీదుగా భారత్‌కు తరలించేందుకు టుండానే సంప్రదించాడంటే అతడి నెట్వర్క్ ఏ స్థాయిలో పనిచేస్తోందో తెలుసుకోవచ్చని అన్నారు. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో అతడి నెట్వర్క్ విస్తరించి ఉందని చెప్పారు. పాక్ వెలుపల తయారయ్యే పేలుడు పదార్థాలను ఢిల్లీ లేదా పంజాబ్‌లో ఏదో ఒక చోటికి తరలించే ప్రయత్నంలో ఉండగా, బంగ్లాలో టుండా మనుషులు పట్టుబడటంతో ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పారు. టుండా తన వాక్చాతుర్యంతో యువకులను ఉగ్రవాదంవైపు మళ్లించేవాడని, వారికి అవసరమైన పేలుడు పదార్థాలను కూడా సమకూర్చేవాడని తెలిపారు. ముంబై దాడుల ప్రధాన కుట్రదారు లఖ్వీతో తనకు ఏర్పడిన విభేదాలను గురించి కూడా అతడు వివరించినట్లు చెప్పారు. ముంబైకి చెందిన జలీస్ అన్సారీతో కలసి టుండా 1993లో ముంబై, హైదరాబాద్‌లలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడని, 1994 జనవరిలో అన్సారీ అరెస్టవడంతో ఢాకాకు పారిపోయాడని తెలిపారు. ఢాకా నుంచి భారత్‌కు వచ్చాక 1996-98లో పలు పేలుళ్ల వెనుక కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. 1998 తర్వాత తాను భారత్‌కు తిరిగి రావడం ఇదే మొదటిసారి అని టుండా చెబుతున్నాడు. అయితే, భద్రతా సంస్థలు అతడి మాటల్లోని నిజా నిజాలను నిర్ధారించుకునే పనిలో పడ్డాయి. గత పదిహేనేళ్లలో అతడు ఏమేం చేశాడనే విషయమై ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలతో కూడిన సంయుక్త బృందం టుండాను ఇంటరాగేట్ చేస్తోంది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు అమీర్ రజా, ఇతర లష్కరే ఉగ్రవాదులతో జరిపిన భేటీలపై అతడి నుంచి సమాచారాన్ని రాబట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పన్నెండేళ్ల వయసు నుంచే బాంబులపై మోజు లష్కరే తోయిబా బాంబుల నిపుణుడు టుండాకు పన్నెండేళ్ల వయసు నుంచే బాంబులపై మోజు మొదలైంది. బాంబులపై తనకు ఎప్పటి నుంచి ఎలా ఆకర్షణ మొదలైందో అతడు పోలీసులకు వివరించాడు. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో 1943లో టుండా జన్మించాడు. అతడికి సుమారు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక చిరు వర్తకుడు అతడి ప్రాంతానికి సైకిల్‌పై వచ్చేవాడు. పిల్లలను ఆకట్టుకునేందుకు అతడు మందుగుండుతో తమాషాలు చేసేవాడు. ఒక కట్టెకు ‘చూరణ్’ (పొటాష్ పొడి) తగిలించి, దానికి తెల్లటి పదార్థాన్ని పూసేవాడు. దానిపై ఒక ద్రవాన్ని చల్లగానే భగ్గున మండి మెరుపులు వచ్చేవి. ఈ తమాషా టుండాను విపరీతంగా ఆకర్షించడమే కాకుండా, అతడిలో కుతూహలాన్ని పెంచింది. తర్వాతి కాలంలో అతడు కట్టెకు తగిలించిన పొడి పొటాష్ అని, దానిపై పూసే తెల్లని పదార్థం చక్కెర అని, దానిపై చల్లే ద్రవం ఒకరకం యాసిడ్ అని తెలుసుకున్నాడు. మహారాష్ట్రలోని భివండీలో 1985లో జరిగిన మత కలహాల్లో తన బంధువులు కొందరు మృతి చెందడంతో టుండా జిహాదీ శక్తులవైపు మళ్లాడు. చిన్నతనంలో నేర్చుకున్న తమాషా ఆధారంగా పొటాష్, చక్కెర, సల్ఫూరిక్ యాసిడ్ల మిశ్రమంతో బాంబుల తయారీ ప్రారం భించాడు. ఈ క్రమంలోనే భారీ బాంబులను చేయడం నేర్చుకున్నాడు. ఒకసారి బాంబు తయారు చేస్తుండగానే ఎడమచేతిని పొగొట్టుకున్నాడు. ఆ సంఘటన తర్వాతే అతడికి ‘టుండా’ అనే పేరు వచ్చింది. -
మెత్తం 40పేలుళ్లవరకు బాధ్యుడు తుండా