ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌ను సంప్రదించేవాడిని: టుండా
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా బాంబుల నిపుణుడు అబ్దుల్ కరీం టుండా ఇంటరాగేషన్‌లో మరిన్ని వివరాలను వెల్లడించాడు. ఢిల్లీ పోలీసులకు నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డ టుండా తనకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ తదితరులతో గల సంబంధాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐఎస్‌ఐ మాజీ అధినేత హమీద్ గుల్‌తో తరచూ సంప్రదింపులు జరిపేవాడి నని అతడు తాజాగా వెల్లడించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఐఎస్‌ఐ మాజీ చీఫ్ గుల్‌ను తొలిసారిగా 1995లో తాను కలుసుకున్నానని, అప్పటి నుంచి తాను ఆయనతో తరచూ సంప్రదింపులు కొనసాగిస్తూ వచ్చానని టుండా చెప్పాడు. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దావా వంటి డజన్ల కొద్దీ ఉగ్రవాద సంస్థలన్నీ ఐఎస్‌ఐ నీడలోనే పనిచేస్తున్నాయని తెలిపాడు. లష్కరే తోయిబాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది పంజాబీలేనని, వారికి నెలకు కేవలం రూ.3 వేల నుంచి రూ.4 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని టుండా చెప్పినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, టుండా మాటలను గుల్ ఖండించారు.
కాశ్మీర్ ‘ఉగ్ర’ చర్యల్లో టుండా కొడుకు: టుండా కొడుకుల్లో ఒకరు తండ్రి అడుగు జాడల్లోనే జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించి, ఎనిమిదేళ్లు జైలులో గడిపాడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. టుండాకు ముగ్గురు భార్యల ద్వారా ఏడుగురు సంతానం ఉండగా, రెండో భార్య ముంతాజ్‌కు పుట్టిన మూడో కొడుకు వారిస్ కాశ్మీర్‌లో లష్కరే తరఫున పనిచేశాడని తెలిపారు. శిక్ష అనుభవించాక తిరిగి పాక్‌కు వెళ్లినట్లు చెప్పారు. టుండా లాహోర్, కరాచీలలో ఏర్పాటు చేసిన దుస్తుల కర్మాగారాన్ని, పరిమళ ద్రవ్యాల వ్యాపారాలను అతడి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని తెలిపారు.