‘ఆమె ట్విటర్‌ ఫాలోవర్స్‌ అంతా ఉగ్రవాదులే’ | NIA Investigates Banned Dukhtaran-E-Millat Chief Asiya Andrabi | Sakshi
Sakshi News home page

‘హఫీజ్‌ సయీద్‌ నన్ను సోదరిగా భావిస్తాడు’

Published Tue, Jul 10 2018 9:48 AM | Last Updated on Tue, Jul 10 2018 12:33 PM

NIA Investigates Banned Dukhtaran-E-Millat Chief Asiya Andrabi - Sakshi

నిషేధిత దుఖ్‌తరన్‌-ఈ-మిలత్‌ చీఫ్‌ ఆసియా ఆండ్రాబీ

సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్‌-ఎ-తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీ విచారణ కొనసాగుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వర్గాలు తెలిపాయి. ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు గత శుక్రవారం ఆమెను శ్రీనగర్‌ జైలు నుంచి ఢిల్లీకి తరలించారు. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పలువురు మహిళా అధికారులతో ఆమెను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌ విషయంలో అంత కఠినంగా ప్రవర్తించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సోదరిగా భావిస్తాడు గనుకే....
విచారణ భాగంగా ఆసియా చెప్పిన పలు విషయాలను ఎన్‌ఐఏ అధికారి వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా హఫీజ్‌ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఆసియా.. హఫీజ్‌ తనను సోదరిగా భావిస్తాడని అందుకే తనతో ఎల్లప్పుడూ ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉంటాడని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌ ప్రభుత్వం ఆసియా పట్ల చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే ఎన్ని సార్లు గృహ నిర్భందం విధించినా ఆమె తన వైఖరిని మార్చుకోలేదన్నారు. అనేక మంది లష్కర్‌ ఉగ్రవాదులు ఆసియాను ట్విటర్‌లో ఫాలో అవుతున్నట్లు గుర్తించామన్న ఆయన.. వీరిలో చాలా మంది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అల్లర్లు సృష్టిస్తోన్న వారేనని తెలిపారు. భారత దేశాన్ని, జాతీయతను వ్యతిరే​కిస్తూ ఉర్దూ భాషలో అనేక ట్వీట్లు చేసిన ఆసియా.. ర్యాలీలు నిర్వహించి మరీ మహిళా విద్యార్థులను రెచ్చగొట్టేవారని పేర్కొన్నారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్‌ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్‌ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆసియా ఆండ్రాబీ నేపథ్యం..
కశ్మీర్‌లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్‌ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్‌ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్‌తరన్‌-ఈ-మిలాత్‌ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే పలువురు విద్యార్థులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్‌ జెండాలు ఎగరవేసినందుకు పలుమార్లు అరెస్టయ్యారు. ఆసియాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్‌బోర్న్‌లో ఎంటెక్‌ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement