టెల్ అవివ్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోకి లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ తీవ్రవాదుల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లో హెజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లతో ఘర్షణకు దిగారు.
ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీనివల్ల ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువులైన హెజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తోంది. హెజ్బుల్లా వద్ద వేలాది రాకెట్లు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో హెజ్బుల్లా మిలిటెంట్లు మకాం వేశారు. ఆదివారం ఒక్కడి నుంచి మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు.ప్రతిగా ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో లెబనాన్ వైపు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఉత్తర సరిహద్దులో ప్రస్తుతం సాధారణ పరిస్థితులుండగా దక్షిణ ప్రాంతంలో పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment