Lashkar e-Taiba
-
కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్ : ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు, పోలీసులు సమిష్టిగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తుజార్ గ్రామంలో ఓ ఇంటిపై గ్రెనేడ్ దాడి చేసిన కేసులో ఈ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధ సామాగ్రి, హ్యాండ్ గ్రెనేడ్స్తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘ఆమె ట్విటర్ ఫాలోవర్స్ అంతా ఉగ్రవాదులే’
సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీ విచారణ కొనసాగుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు గత శుక్రవారం ఆమెను శ్రీనగర్ జైలు నుంచి ఢిల్లీకి తరలించారు. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పలువురు మహిళా అధికారులతో ఆమెను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ విషయంలో అంత కఠినంగా ప్రవర్తించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదరిగా భావిస్తాడు గనుకే.... విచారణ భాగంగా ఆసియా చెప్పిన పలు విషయాలను ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఆసియా.. హఫీజ్ తనను సోదరిగా భావిస్తాడని అందుకే తనతో ఎల్లప్పుడూ ఫోన్లో కాంటాక్ట్‌లో ఉంటాడని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ ప్రభుత్వం ఆసియా పట్ల చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే ఎన్ని సార్లు గృహ నిర్భందం విధించినా ఆమె తన వైఖరిని మార్చుకోలేదన్నారు. అనేక మంది లష్కర్ ఉగ్రవాదులు ఆసియాను ట్విటర్లో ఫాలో అవుతున్నట్లు గుర్తించామన్న ఆయన.. వీరిలో చాలా మంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో అల్లర్లు సృష్టిస్తోన్న వారేనని తెలిపారు. భారత దేశాన్ని, జాతీయతను వ్యతిరేకిస్తూ ఉర్దూ భాషలో అనేక ట్వీట్లు చేసిన ఆసియా.. ర్యాలీలు నిర్వహించి మరీ మహిళా విద్యార్థులను రెచ్చగొట్టేవారని పేర్కొన్నారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసియా ఆండ్రాబీ నేపథ్యం.. కశ్మీర్లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్తరన్-ఈ-మిలాత్ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే పలువురు విద్యార్థులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జెండాలు ఎగరవేసినందుకు పలుమార్లు అరెస్టయ్యారు. ఆసియాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్బోర్న్లో ఎంటెక్ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
ఐఎస్ఐ మాజీ చీఫ్‌ను సంప్రదించేవాడిని: టుండా
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా బాంబుల నిపుణుడు అబ్దుల్ కరీం టుండా ఇంటరాగేషన్‌లో మరిన్ని వివరాలను వెల్లడించాడు. ఢిల్లీ పోలీసులకు నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డ టుండా తనకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ తదితరులతో గల సంబంధాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐఎస్ఐ మాజీ అధినేత హమీద్ గుల్‌తో తరచూ సంప్రదింపులు జరిపేవాడి నని అతడు తాజాగా వెల్లడించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఐఎస్ఐ మాజీ చీఫ్ గుల్‌ను తొలిసారిగా 1995లో తాను కలుసుకున్నానని, అప్పటి నుంచి తాను ఆయనతో తరచూ సంప్రదింపులు కొనసాగిస్తూ వచ్చానని టుండా చెప్పాడు. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దావా వంటి డజన్ల కొద్దీ ఉగ్రవాద సంస్థలన్నీ ఐఎస్ఐ నీడలోనే పనిచేస్తున్నాయని తెలిపాడు. లష్కరే తోయిబాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది పంజాబీలేనని, వారికి నెలకు కేవలం రూ.3 వేల నుంచి రూ.4 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని టుండా చెప్పినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, టుండా మాటలను గుల్ ఖండించారు. కాశ్మీర్ ‘ఉగ్ర’ చర్యల్లో టుండా కొడుకు: టుండా కొడుకుల్లో ఒకరు తండ్రి అడుగు జాడల్లోనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించి, ఎనిమిదేళ్లు జైలులో గడిపాడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. టుండాకు ముగ్గురు భార్యల ద్వారా ఏడుగురు సంతానం ఉండగా, రెండో భార్య ముంతాజ్‌కు పుట్టిన మూడో కొడుకు వారిస్ కాశ్మీర్లో లష్కరే తరఫున పనిచేశాడని తెలిపారు. శిక్ష అనుభవించాక తిరిగి పాక్‌కు వెళ్లినట్లు చెప్పారు. టుండా లాహోర్, కరాచీలలో ఏర్పాటు చేసిన దుస్తుల కర్మాగారాన్ని, పరిమళ ద్రవ్యాల వ్యాపారాలను అతడి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని తెలిపారు. -
ఢిల్లీకి ‘ఉగ్ర’ ముప్పు
పంద్రాగస్టు నేపథ్యంలో దాడులకు లష్కరే కుట్ర ఎర్రకోట, ప్రధాన మార్కెట్లలో భారీ విధ్వంసానికి రెక్కీ తమ ఉగ్రవాదులు హస్తినలో దాడి చేస్తారని గత నెలలో సయీద్ ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి ఉగ్రవాదుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. పంద్రాగస్టు నేపథ్యంలో ఢిల్లీ చారిత్రక కట్టడం ఎర్రకోటతో పాటు రద్దీగా ఉండే ప్రధాన మార్కెట్లలో భారీ దాడులకు లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు సమాచారం. దీని కోసం రెక్కీలు కూడా చేసినట్లు నిఘా సంస్థ(ఐబీ) పసిగట్టింది. దీంతో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. పంద్రాగస్టు, ఆ తర్వాత రాఖీ తదితర పండుగలు రానున్న నేపథ్యంలో ఎర్రకోట, చాందినీ చౌక్, కన్నాట్‌ప్లేస్, ఢిల్లీ కంటోన్మెంట్లలో దాడులకు ముష్కరులు వారం కిందట రెక్కీ చేశారని ఐబీ నగర పోలీసులకు తెలిపింది. తమ ఉగ్రవాదులు హస్తినలో దాడులకు పాల్పడతారని లష్కరే తోయిబా నేత సయీద్ హఫీజ్ గత నెల పాక్‌లో ఓ ప్రసంగంలో హెచ్చరించినట్లు తెలిపింది. ‘ముంబై’ దాడుల ఉగ్రవాది కసబ్ ఉరికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంది. దీంతో పోలీసులు ప్రధాన మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ నెల 15న స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించనున్న ఎర్రకోటతోపాటు, పార్లమెంటు వద్ద నిఘాను పటిష్టం చేశారు. పంద్రాగస్టు, రాఖీ, కృష్ణ జన్మాష్టమి వంటి వేడుకల్లో మార్కెట్లు రద్దీగా ఉంటాయని కనుక ఉగ్రవాదులు దాడుల కోసం ఆ ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం. 2000లో ఎర్రకోటపై జరిగిన ఉగ్రదాడిని పునరావృతం చేయాలని సయీద్ పిలుపునిచ్చిన ట్లు తెలుస్తోంది. కాశ్మీర్, పాలస్తీనా, మయన్మార్‌లలో అణచివేతకు గురవుతున్నవారు ఈద్‌ను స్వేచ్ఛగా జరుపుకునే రోజు దగ్గర్లోనే ఉందని హఫీజ్ శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేసిన వ్యాఖ్యల వెనుక దాడుల హెచ్చరిక ఉందని నిఘా వర్గాల అనుమానం. సయీద్ లాహోర్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ప్రసంగింస్తూ.. కసబ్ ఉరికి ప్రతీకారం తీసుకోవాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.