లఖ్వీతో నాకు పడదు:కరీమ్ టుండా
న్యూఢిల్లీ: తాను లష్కరే తోయిబాలో ఉన్నత స్థానానికి ఎదగకుండా దాని కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ తీవ్రంగా అడ్డుపడ్డాడని ఇటీవల అరెస్టయిన ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ టుండా పోలీసులకు చెప్పాడు. లష్కరే తోయిబా భారత్‌లో విస్తరించడానికి తానే కారణమైనప్పటికీ లఖ్వీ తన అవకాశాలను దూరంచేశాడన్నాడు. అందుకే లఖ్వీ అంటే తనకు ద్వేషమని అతడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బాంబుల తయారీలో నిష్ణాతుడైన 70 ఏళ్ల టుండాను పోలీసులు ఈనెల 16న అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి అయిన లఖ్వీ దాడుల వ్యూహరచన సమయంలో తనను దూరంగా పెట్టాడని టుండా చెప్పినట్లు అతడిని విచారిస్తున్న పోలీసులు తెలిపారు. లఖ్వీతో ఉన్న ఆర్థిక విభేదాల కారణంగా లష్కరే అగ్రనాయకత్వం కూడా ముంబై ఆపరేషన్ సమయంలో తనను పక్కన పెట్టి యువకులైన అబూ జుందాల్ లాంటి వాళ్లను దగ్గరకు తీశారన్నాడు. దీని గురించి జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ తనకు చెప్పాడని... ఇక భారత్ నకిలీ నోట్ల పంపిణీపై దృష్టి సారించమని సూచించాడన్నాడు.