రూ.5 నోటు ఉందా.. బహుశా నకిలీ కావొచ్చు!
రూ.5 నోటు ఉందా.. బహుశా నకిలీ కావొచ్చు!
Published Sun, Jan 19 2014 7:31 PM | Last Updated on Thu, Jul 26 2018 2:02 PM
మీ జేబులో ఐదు రూపాయల నోటు ఉంటే.. బహుశా అది నకిలీ నోటు కావొచ్చు. మళ్లీ ఎప్పుడైనా మీ చేతికి ఐదు రూపాయల నోటు వస్తే ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఐదు రూపాయల నోట్లను స్వాధీన పరుచుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. నకిలీ ఐదు రూపాయల నోట్ల వ్యవహారం వినియోగదారులనే కాకుండా, ఆర్ధిక వ్యవస్థను ఆందోళనకు గురి చేస్తోంది.
భారీ మొత్తంలో నకిలీ నోట్ల సరఫరాలో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ది ప్రధాన పాత్ర అని పోలీసులు వెల్లడించారు. నకిలీ నోట్లపై దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు ఓ ఆసక్తికరమైన అంశం దృష్టికి వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీ, ముల్తాన్, క్వెట్టా, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రింటింగ్ ప్రెస్ లోనే నకిలీ భారతీయ కరెన్సీ ప్రింట్ అవుతోందనే సమాచారం అందింది. నకిలీ నోట్లన్ని గుర్తుపట్టని రీతిలో దాదాపు ఒరిజినల్ నోట్లుగానే చెలామణీలో ఉంటాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. గతంలో నకిలీ నోట్లన్ని హై డినామినేషన్ లో వచ్చేవని... నకిలీ నోట్ల సరఫరాలో ప్రస్తుతం మాఫియా వ్యూహాన్ని మార్చారని పోలీసుల తెలిపారు. గతంలో 1000, 500 నోట్లు మాత్రమే నకిలీ నోట్లుగా వచ్చేవని.. ఐతే తక్కువ విలువ నోట్లను మార్పిడి చేయడానికి అంతగా కష్టం ఉండకపోవడంతో పాక్ నకిలీ కరెన్సీ మాఫియా 5 రూపాయలను ఎంచుకుందని ఉన్నతాధికారులు తెలిపారు.
గత మూడేళ్లుగా 5, 10, 20 రూపాయల నకిలీ నోట్లను భారత్ లోకి ప్రవేశపెట్టి.. భారీ ఎత్తున ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మాఫియా చెలామణిలోకి తీసుకువస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. కేవలం 2013 సంవత్సరంలో 5.66 కోట్ల రూపాయల భారతీయ నకిలీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను, 20,517 వంద రూపాయల నోట్లను, 60,525 ఐదు వందల నోట్లను, 24,116 వెయి రూపాయల నోట్లను స్వాధీన పరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరెన్సీ పేపర్, ఇంక్, మాగ్నటిక్ దారంను పాక్ మాఫియా భారతీయ కరెన్సీ ప్రింటింగ్ కు వినియోగిస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు.
ఇటీవల పట్టుబడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్, లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ కరీం తుండాలు ఇంటారాగేషన్ లో వెల్లడించినట్టు పోలీసుల తెలిపారు. పాక్ లో ప్రచురించిన నకిలీ కరెన్సీని బంగ్లాదేశ్, నేపాల్, థాయ్ లాండ్, డెన్మార్క్, హాలెండ్, సింగపూర్, శ్రీలంక దేశాల నుంచి భారత్ లో ప్రవేశపెడుతున్నట్టు విచారణలో సమాచారం తెలిసిందన్నారు. ఏది ఏమైనా నకిలీ కరెన్సీని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కస్టమ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాలతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు. కరెన్సీ నోట్ల మార్పులో ఏదైనా అనుమానం వస్తే వాటిని పోలీసుల దృష్టికి తీసుకురావాలని వినియోగదారులకు విజ్క్షప్తి చేస్తున్నారు.
Advertisement
Advertisement