మన భద్రతా సంస్థలు చాలా తక్కువ వ్యవధిలో రెండు ఎన్నదగిన విజయాలు సాధించాయి. ఈ రెండూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయడంలో ఎంతగానో ఉపయోగపడేవి. సరిగ్గా పక్షం రోజుల క్రితం ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా పట్టుబడ్డాడు. గురువారం మరో ఉగ్రవాది యాసీన్ భత్కల్ దొరికి పోయాడు. ఇద్దరి మధ్యా వయసులో చాలా వ్యత్యాసమున్నా ఇద్దరికిద్దరూ అత్యంత ప్రమాదకరవ్యక్తులు. టుండా రెండు దశాబ్దాల నుంచి మన భద్రతా సంస్థలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుంటే భత్కల్ గత ఐదేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇద్దరూ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కనుసన్నల్లో పనిచేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పథక రచన చేశారు. ఎందరెందరో అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు.
టుండా చాలాకాలం ఆచూకీ లేకుండా పోయి బంగ్లాదేశ్ నుంచి తన కార్యకలాపాలు కొనసాగించగా, భత్కల్ మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతూ విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ, ఒకటి రెండుసార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. చివరకు ఇద్దరూ నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణే, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్ నగరాల్లో గత అయిదేళ్లుగా జరిగిన బాంబు పేలుడు ఘటనలన్నిటా భత్కల్ హస్తముందన్నది పోలీసుల ఆరోపణ. 17 మంది మరణానికి దారితీసిన పూణే జర్మన్ బేకరీ బాంబు పేలుడు ఘటన సందర్భంగా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో తొలిసారి భత్కల్‌ని గుర్తించారు. ఆరునెలల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల ఘటనల్లో సైతం భత్కల్ ప్రమేయాన్ని సీసీ టీవీ కెమెరాలు రికార్డు చేశాయి. 2009లో కోల్‌కతాలో దొంగనోట్ల కేసులో మారుపేరుతో పట్టుబడి, అసలు విషయం గుర్తించే లోగానే బెయిల్‌పై విడుదలై పరారయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లి ఇండియన్ ముజాహిదీన్ సంస్థ స్థాపకుల్లో ఒకడిగా ఉండి ఐఎస్‌ఐ సహకారంతో ఈ ఘటనలన్నిటికీ పాల్పడ్డాడు.
మొన్న దొరికిన అబ్దుల్ కరీం టుండాగానీ, ఇప్పుడు పట్టుబడిన భత్కల్‌గానీ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్‌వర్క్‌లో భాగస్తులు. పాకిస్థాన్ సైన్యం తమ గడ్డపై ఇలాంటి ఉగ్రవాదులకు శిక్షణనివ్వడం, అటు తర్వాత వారిని సరిహద్దులు దాటించి భారత్‌లో ఉగ్రవాద ఘటనలకు పాల్పడేలా చేయడం చాలాకాలం నుంచి సాగుతోంది. భత్కల్‌కు వరసకు సోదరులయ్యే రియాజ్, ఇక్బాల్ ఇప్పటికీ పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నారని మన గూఢచార సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇలా దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్న దాదాపు 12మంది పాక్‌లోనే ఉంటున్నారు.
వీరుకాక లష్కరే తొయిబా నేతలు హఫీజ్ సయీద్, జకీ-ఉర్-రెహ్మాన్, మౌలానా మసూద్ అజర్ తదితరులను అప్పగించాలని సాక్ష్యాధారాలు సమర్పించినా పాకిస్థాన్ నిజాయితీగా వ్యవహరించలేదు. 1993 ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్న దావూద్ ఇబ్రహీం కూడా కరాచీలోనే ఉన్నాడు. పాక్ సైన్యం కనుసన్నల్లో పనిచేసే ఐఎస్‌ఐ వీరందరినీ వెనకుండి నడిపిస్తున్నది కాబట్టే పాకిస్థాన్‌లో ఉన్న పౌర ప్రభుత్వాలు చర్య తీసుకోలేకపోతున్నాయి. ఆ మాట చెబితే తమ చేతగానితనం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో భారత్ సమర్పించిన సాక్ష్యాధారాలు సరిపోవని సాకులు వెదుకుతున్నాయి. ఈమధ్య గద్దెనెక్కిన ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తమ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారడానికి అంగీకరించ బోమని చెప్పినా చేతలు మాత్రం ఇంతవరకూ మొదలుకాలేదు. సరిహద్దుల్లో జరిగిన ఇటీవలి ఘటనలు చూస్తే పాకిస్థాన్‌లో ఏవిధమైన మార్పూ రాలేదన్న సంగతి స్పష్టమవుతోంది.
టుండా, భత్కల్ పట్టుబడటంవల్ల దేశంలో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులకు మరింత స్పష్టత వస్తుంది. ఆ నెట్‌వర్క్‌లో ఎంత మంది, ఏ ఏ స్థాయిల్లో పనిచేస్తున్నారో, ఎవరి సహాయ సహకారాలు వారికి అందుతున్నాయో వెల్లడయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్ నుంచి అందే సాయంపై పకడ్బందీ సాక్ష్యాధారాలు లభించవచ్చు. ఈ క్రమంలో మరింత మంది పట్టుబడవచ్చు కూడా. భత్కల్ ఇప్పటికే తన కార్యకలాపాల గురించి, తన నేరాల గురించి విలువైన సమాచారం అందించాడని భోగట్టా.
ముఖ్యంగా హైదరాబాద్‌లో 2007లో జరిగిన లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్‌లో జరిగిన పేలుళ్లు, ఇటీవలి దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల విషయమై ఎన్నో కొత్త కోణాలు బయట పడతాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న ప్రతిసారీ ఇంటెలిజెన్స్ సంస్థల వైఫల్యమో, వారిచ్చిన నివేదికలపై సరిగా స్పందించని పోలీసుల వైఖరో బయట పడుతోంది. వాటిని సరిచేసుకోవడంతోపాటు ఉగ్రవాదులు రూపొందడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేస్తున్నాయో, ఏ పరిణామాలు కొందరు యువకుల్ని అలాంటి కంటకమార్గం వైపు నడిపిస్తున్నాయో, సమాజానికి పెను ముప్పుగా మారుస్తున్నాయో అధ్యయనం చేయాల్సిన బాధ్యత, నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
భత్కల్ వంటివారిని పట్టుకోవడం, వారి నేరాలను నిరూపించి కఠినశిక్ష పడేలా చేయడం ఒక ఎత్తయితే... సమాజంలో భిన్నవర్గాల మధ్య చిచ్చుపెట్టే శక్తులను సకాలంలో గుర్తించడం మరో ఎత్తు. అదృష్టవశాత్తూ ఎందరు ఎంత రెచ్చగొట్టినా సంయ మనం పాటించడం, హేతుబద్ధంగా ఆలోచించడం ఈ గడ్డపై ఆది నుంచీ ఉంది. అయితే, చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అందరూ ఒకేవిధంగా స్పందించరు. పరిస్థితుల ప్రభావంతో ఒక్కరు పెడదోవ పట్టినా వారివల్ల మొత్తం సమాజమంతా ఇబ్బందుల్లో పడుతుంది. నష్టపోతుంది. అలాంటి పరిస్థితులను నివారించడంపై కూడా దృష్టిపెడితే ఇరుగుపొరుగు దేశాల కుట్రలను మొగ్గలోనే తుంచడం, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యమవుతుంది.
భత్కల్‌కు అరదండాలు
Published Fri, Aug 30 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement