Inter-Services Intelligence
-
వాంటెడ్ హిందీ ట్యూటర్స్!
* దేశ వ్యాప్తంగా వెతుకుతున్న ఎల్ఈటీ * ఉగ్రవాదులకు ఇక్కడి భాష నేర్పేందుకే.. * తాజాగా గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు * సిటీ సహా మెట్రోల్లో అప్రమత్తత సాక్షి, సిటీబ్యూరో: ఇదేదో విద్యా సంస్థకు చెందిన ప్రకటన అనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్టే. పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రోద్భలంతో రెచ్చిపోతున్న ఆ దేశ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) తాజా ఎత్తుగడ. ఈ అంశాన్ని గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాలను అప్రమత్తం చేశాయి. నిఘా ముమ్మరం చేయడం ద్వారా ‘దరఖాస్తుదారులు’ ఉంటే గుర్తించడంతో పాటు అడ్డుకోవాలని హెచ్చరించాయి. ‘కరాచీ ప్రాజెక్ట్’లో భాగంగా.. లష్కరే తొయిబా సంస్థ కొన్నేళ్ల క్రితమే భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని ‘కరాచీ ప్రాజెక్ట్’ పేరుతో భారీ కుట్రకు తెరలేపింది. ఎల్ఈటీ, హుజీ, జైషే మహ్మద్ వంటి ‘విదేశీ’ ఉగ్రవాద సంస్థలకు, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) తరహా ‘స్థానిక’ టైస్ట్ ఆర్గనైజేషన్స్ మధ్య సమన్వయం ఏర్పాటు చేయడం.. తద్వారా వీలున్నంత విధ్వంసం, అనిశ్చితి కల్పిండమే దీని ప్రధాన లక్ష్యం. ఐఎస్ఐ గతంలో హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్స్ కోసం పాకిస్థాన్ జాతీయులకు శిక్షణ ఇచ్చి పంపేది. వీరు పట్టుబడినప్పుడల్లా అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ముద్ర పడడంతో పాటు ఒత్తిడి పెరుగుతుండడంతో పంథా మార్చింది. కొన్ని పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని ఇక్కడి యువతకే గాలం వేసి ఉగ్రబాట పట్టించి, తన ‘పని’ పూర్తి చేయించడం ప్రారంభించింది. నగరంలో 2007, 2013లో విధ్వంసాలు సృష్టించిన ఐఎం ఉగ్రవాదుల్లో వఖాస్ మినహా అంతా భారతీయులే కావడం దీనికి నిదర్శనం. ఈ ఐఎం మాడ్యుల్ దాదాపు కనుమరుగవడంతో పాటు కొత్తవి తయారయ్యాయి. దీంతో కొన్ని ఇబ్బందులు వస్తుండటంతో ఐఎస్ఐ సహా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు మళ్లీ పాత పంథా వైపే మొగ్గు చూపుతున్నాయి. ‘భాష’తో చిక్కుతున్నారని.. ఓవైపు ఇక్కడ ఉన్న వారిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూనే.. మరోపక్క భారత్‌లో ఆపరేషన్స్ నిర్వహించడానికి సుశిక్షుతులైన పాకిస్థానీలను పంపడానికి వ్యూహ రచన చేస్తోంది. విధ్వంసాలకు స్థానికుల్ని వాడుకున్నా అందుకు అవసరమైన బాంబుల తయారీకి పాక్ నుంచే సుశిక్షితులు వస్తున్నారు. ఐఎం మాడ్యుల్‌కు సంబంధించి 2013 నాటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో అరెస్టయిన వారిలో పాకిస్థానీ వఖాస్ ఉండటమే దీనికి ఉదాహరణ. దీనికోసం లష్కరే తొయిబా సంస్థ కొందరికి పేలుడు పదార్థాల తయారీ, మారణాయుధాల వినియోగం వంటి అంశాల్లో శిక్షణ కూడా ఇచ్చింది.. ఇస్తోంది. ఇలా దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో కొందరిని ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించి ఆయా రాష్ట్ర ఏజెన్సీల ద్వారా అరెస్టు చేశాయి. వీరు చిక్కడానికి నిఘా వర్గాల సాంకేతిక నిఘాతో పాటు వారి భాష కూడా కారణమని ఐఎస్ఐతో పాటు ఎల్ఈటీ కూడా భావిస్తోంది. ‘పంజాబీ’ బదులు ‘హిందీ’ ఉచ్ఛారణ పాకిస్థాన్‌లో వినియోగంలో ఉన్న హిందీ భాష ఆ దేశంలో ఉన్న పంజాబీ యాసను పోలి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు ఎల్ఈటీ తన ట్రైనింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందుతున్న వారికి పాకిస్థానీయులతో అదే యాసలో హిందీ నేర్పుతోంది. ఈ యాసను భారత్‌లోకి ప్రవేశించిన తరవాత ఉగ్రవాదులు మాట్లాడితే నిఘా, పోలీసు వర్గాలు గుర్తిస్తున్న కారణంగానే తమ వారు చిక్కుతున్నారనేది పాక్ నిఘా, ఉగ్రవాద సంస్థల భావన. ఈ నేపథ్యంలోనే భారత్‌లో వినియోగంలో ఉన్న ఉచ్ఛారణలోనే హిందీ నేర్పించి పంపాలని పథక రచన చేశాయి. ఇలా పంపినవారు ఓ ఆపరేషన్ కోసం ఎన్నాళ్ల పాటు ఎక్కడ స్లీపర్ సెల్‌గా ఉన్నా గుర్తించడం కష్టమవుతుందన్నది ముష్కర మూకల కుట్రగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి ‘ట్యూటర్ల’కు ఎల్ఈటీ నెలకు రూ. 30 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం సేకరించాయి. ‘లోకల్ కాంటాక్ట్’ ద్వారా పేద, మధ్యతరగతి వారికి ఈ భారీ మొత్తంతో వలవేసి, ఆసక్తి చూపిన వారిని బంగ్లాదేశ్ మీదుగా పాక్‌కు తీసుకువెళ్లాలని కుట్ర పన్నినట్టు నిర్ధారించాయి. వీరికి ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లోనే బస, తిండి, ఇతర సౌకర్యాలు కల్పించాలని యోచిస్తున్నట్లు తేల్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని మెట్రోలతో పాటు ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఉద్యోగం: హిందీ ట్యూటర్ చేయాల్సింది: ఎంపిక చేసిన వారికి ఆ భాష నేర్పడం అర్హత: భాషపై పట్టుతో పాటు భారతీయులై ఉండడం జీతం: నెలకు రూ. 30 వేలు ఆపైన.. అదనం: బస, ఇతర సౌకర్యాలు -
రూ.5 నోటు ఉందా.. బహుశా నకిలీ కావొచ్చు!
మీ జేబులో ఐదు రూపాయల నోటు ఉంటే.. బహుశా అది నకిలీ నోటు కావొచ్చు. మళ్లీ ఎప్పుడైనా మీ చేతికి ఐదు రూపాయల నోటు వస్తే ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఐదు రూపాయల నోట్లను స్వాధీన పరుచుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. నకిలీ ఐదు రూపాయల నోట్ల వ్యవహారం వినియోగదారులనే కాకుండా, ఆర్ధిక వ్యవస్థను ఆందోళనకు గురి చేస్తోంది. భారీ మొత్తంలో నకిలీ నోట్ల సరఫరాలో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ది ప్రధాన పాత్ర అని పోలీసులు వెల్లడించారు. నకిలీ నోట్లపై దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు ఓ ఆసక్తికరమైన అంశం దృష్టికి వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీ, ముల్తాన్, క్వెట్టా, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రింటింగ్ ప్రెస్ లోనే నకిలీ భారతీయ కరెన్సీ ప్రింట్ అవుతోందనే సమాచారం అందింది. నకిలీ నోట్లన్ని గుర్తుపట్టని రీతిలో దాదాపు ఒరిజినల్ నోట్లుగానే చెలామణీలో ఉంటాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. గతంలో నకిలీ నోట్లన్ని హై డినామినేషన్ లో వచ్చేవని... నకిలీ నోట్ల సరఫరాలో ప్రస్తుతం మాఫియా వ్యూహాన్ని మార్చారని పోలీసుల తెలిపారు. గతంలో 1000, 500 నోట్లు మాత్రమే నకిలీ నోట్లుగా వచ్చేవని.. ఐతే తక్కువ విలువ నోట్లను మార్పిడి చేయడానికి అంతగా కష్టం ఉండకపోవడంతో పాక్ నకిలీ కరెన్సీ మాఫియా 5 రూపాయలను ఎంచుకుందని ఉన్నతాధికారులు తెలిపారు. గత మూడేళ్లుగా 5, 10, 20 రూపాయల నకిలీ నోట్లను భారత్ లోకి ప్రవేశపెట్టి.. భారీ ఎత్తున ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మాఫియా చెలామణిలోకి తీసుకువస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. కేవలం 2013 సంవత్సరంలో 5.66 కోట్ల రూపాయల భారతీయ నకిలీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను, 20,517 వంద రూపాయల నోట్లను, 60,525 ఐదు వందల నోట్లను, 24,116 వెయి రూపాయల నోట్లను స్వాధీన పరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరెన్సీ పేపర్, ఇంక్, మాగ్నటిక్ దారంను పాక్ మాఫియా భారతీయ కరెన్సీ ప్రింటింగ్ కు వినియోగిస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇటీవల పట్టుబడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్, లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ కరీం తుండాలు ఇంటారాగేషన్ లో వెల్లడించినట్టు పోలీసుల తెలిపారు. పాక్ లో ప్రచురించిన నకిలీ కరెన్సీని బంగ్లాదేశ్, నేపాల్, థాయ్ లాండ్, డెన్మార్క్, హాలెండ్, సింగపూర్, శ్రీలంక దేశాల నుంచి భారత్ లో ప్రవేశపెడుతున్నట్టు విచారణలో సమాచారం తెలిసిందన్నారు. ఏది ఏమైనా నకిలీ కరెన్సీని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కస్టమ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాలతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు. కరెన్సీ నోట్ల మార్పులో ఏదైనా అనుమానం వస్తే వాటిని పోలీసుల దృష్టికి తీసుకురావాలని వినియోగదారులకు విజ్క్షప్తి చేస్తున్నారు.