వాంటెడ్ హిందీ ట్యూటర్స్! | Wanted Hindi Tutors in ISI | Sakshi
Sakshi News home page

వాంటెడ్ హిందీ ట్యూటర్స్!

Published Thu, Dec 10 2015 3:31 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

వాంటెడ్ హిందీ ట్యూటర్స్! - Sakshi

వాంటెడ్ హిందీ ట్యూటర్స్!

* దేశ వ్యాప్తంగా వెతుకుతున్న ఎల్‌ఈటీ
* ఉగ్రవాదులకు ఇక్కడి భాష నేర్పేందుకే..
* తాజాగా గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు
* సిటీ సహా మెట్రోల్లో అప్రమత్తత


సాక్షి, సిటీబ్యూరో: ఇదేదో విద్యా సంస్థకు చెందిన ప్రకటన అనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్టే. పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ప్రోద్భలంతో రెచ్చిపోతున్న ఆ దేశ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) తాజా ఎత్తుగడ. ఈ అంశాన్ని గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాలను అప్రమత్తం చేశాయి. నిఘా ముమ్మరం చేయడం ద్వారా ‘దరఖాస్తుదారులు’ ఉంటే గుర్తించడంతో పాటు అడ్డుకోవాలని హెచ్చరించాయి.
 
‘కరాచీ ప్రాజెక్ట్’లో భాగంగా..
లష్కరే తొయిబా సంస్థ కొన్నేళ్ల క్రితమే భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని ‘కరాచీ ప్రాజెక్ట్’ పేరుతో భారీ కుట్రకు తెరలేపింది. ఎల్‌ఈటీ, హుజీ, జైషే మహ్మద్ వంటి ‘విదేశీ’ ఉగ్రవాద సంస్థలకు, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) తరహా ‘స్థానిక’ టైస్ట్ ఆర్గనైజేషన్స్ మధ్య సమన్వయం ఏర్పాటు చేయడం.. తద్వారా వీలున్నంత విధ్వంసం, అనిశ్చితి కల్పిండమే దీని ప్రధాన లక్ష్యం.

ఐఎస్‌ఐ గతంలో హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్స్ కోసం పాకిస్థాన్ జాతీయులకు శిక్షణ ఇచ్చి పంపేది. వీరు పట్టుబడినప్పుడల్లా అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ముద్ర పడడంతో పాటు ఒత్తిడి పెరుగుతుండడంతో పంథా మార్చింది. కొన్ని పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని ఇక్కడి యువతకే గాలం వేసి ఉగ్రబాట పట్టించి, తన ‘పని’ పూర్తి చేయించడం ప్రారంభించింది.

నగరంలో 2007, 2013లో విధ్వంసాలు సృష్టించిన ఐఎం ఉగ్రవాదుల్లో వఖాస్ మినహా అంతా భారతీయులే కావడం దీనికి నిదర్శనం. ఈ ఐఎం మాడ్యుల్ దాదాపు కనుమరుగవడంతో పాటు కొత్తవి తయారయ్యాయి. దీంతో కొన్ని ఇబ్బందులు వస్తుండటంతో ఐఎస్‌ఐ సహా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు మళ్లీ పాత పంథా వైపే మొగ్గు చూపుతున్నాయి.

‘భాష’తో చిక్కుతున్నారని..
ఓవైపు ఇక్కడ ఉన్న వారిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూనే.. మరోపక్క భారత్‌లో ఆపరేషన్స్ నిర్వహించడానికి సుశిక్షుతులైన పాకిస్థానీలను పంపడానికి వ్యూహ రచన చేస్తోంది. విధ్వంసాలకు స్థానికుల్ని వాడుకున్నా అందుకు అవసరమైన బాంబుల తయారీకి పాక్ నుంచే సుశిక్షితులు వస్తున్నారు.

ఐఎం మాడ్యుల్‌కు సంబంధించి 2013 నాటి దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో అరెస్టయిన వారిలో పాకిస్థానీ వఖాస్ ఉండటమే దీనికి ఉదాహరణ. దీనికోసం లష్కరే తొయిబా సంస్థ కొందరికి పేలుడు పదార్థాల తయారీ, మారణాయుధాల వినియోగం వంటి అంశాల్లో శిక్షణ కూడా ఇచ్చింది.. ఇస్తోంది. ఇలా దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో కొందరిని ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించి ఆయా రాష్ట్ర ఏజెన్సీల ద్వారా అరెస్టు చేశాయి. వీరు చిక్కడానికి నిఘా వర్గాల సాంకేతిక నిఘాతో పాటు వారి భాష కూడా కారణమని ఐఎస్‌ఐతో పాటు ఎల్‌ఈటీ కూడా భావిస్తోంది.
 
‘పంజాబీ’ బదులు ‘హిందీ’ ఉచ్ఛారణ
పాకిస్థాన్‌లో వినియోగంలో ఉన్న హిందీ భాష ఆ దేశంలో ఉన్న పంజాబీ యాసను పోలి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు ఎల్‌ఈటీ తన ట్రైనింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందుతున్న వారికి పాకిస్థానీయులతో అదే యాసలో హిందీ నేర్పుతోంది. ఈ యాసను భారత్‌లోకి ప్రవేశించిన తరవాత ఉగ్రవాదులు మాట్లాడితే నిఘా, పోలీసు వర్గాలు గుర్తిస్తున్న కారణంగానే తమ వారు చిక్కుతున్నారనేది పాక్ నిఘా, ఉగ్రవాద సంస్థల భావన.

ఈ నేపథ్యంలోనే భారత్‌లో వినియోగంలో ఉన్న ఉచ్ఛారణలోనే హిందీ నేర్పించి పంపాలని పథక రచన చేశాయి. ఇలా పంపినవారు ఓ ఆపరేషన్ కోసం ఎన్నాళ్ల పాటు ఎక్కడ స్లీపర్ సెల్‌గా ఉన్నా గుర్తించడం కష్టమవుతుందన్నది ముష్కర మూకల కుట్రగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి ‘ట్యూటర్ల’కు ఎల్‌ఈటీ నెలకు రూ. 30 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం సేకరించాయి.

‘లోకల్ కాంటాక్ట్’ ద్వారా పేద, మధ్యతరగతి వారికి ఈ భారీ మొత్తంతో వలవేసి, ఆసక్తి చూపిన వారిని బంగ్లాదేశ్ మీదుగా పాక్‌కు తీసుకువెళ్లాలని కుట్ర పన్నినట్టు నిర్ధారించాయి. వీరికి ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లోనే బస, తిండి, ఇతర సౌకర్యాలు కల్పించాలని యోచిస్తున్నట్లు తేల్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని మెట్రోలతో పాటు ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి.
 
ఉద్యోగం: హిందీ ట్యూటర్
చేయాల్సింది: ఎంపిక చేసిన వారికి ఆ భాష నేర్పడం
అర్హత: భాషపై పట్టుతో పాటు భారతీయులై ఉండడం
జీతం: నెలకు రూ. 30 వేలు ఆపైన..
అదనం: బస, ఇతర సౌకర్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement