ఐఎస్‌ఐ రక్షణలోనే దావూద్
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థానీ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ రక్షణలో ఉంటున్నాడు. నేపాల్ సరిహద్దుల్లో శుక్రవారం పట్టుబడిన ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా (70) ఈ విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు. కరాచీలోని ఒక సురక్షితమైన ఇంట్లో ఉంటున్న దావూద్ కదలికలను ఐఎస్‌ఐ నియంత్రిస్తోందని చెప్పాడు. పోలీసుల ఇంటరాగేషన్‌లో అతడు పలు కీలకమైన విషయాలను వెల్లడించాడు. కరాచీలో తాను పలుసార్లు దావూద్‌ను కలుసుకున్నట్లు చెప్పాడు. దావూద్ తనను తొలిసారిగా 2010లో పిలిపించినట్లు తెలిపాడు. ఐఎస్‌ఐతో పాటు ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, బబ్బర్ ఖల్సాలతో తాను సంప్రదింపులు కొనసాగించేవాడినని, హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ తదితర ఉగ్రవాద నాయకులతో భేటీ అయ్యేవాడినని తెలిపాడు. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అబు జుందాల్ కంటే టుండా మరింత ‘పెద్దచేప’ అని పోలీసులు అభివర్ణించారు. ఇంటరాగేషన్‌లో అతడు బయటపెట్టిన వివరాలను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆదివారం మీడియాకు వెల్లడించారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలన్నింటితోనూ అతడు సంబంధాలు నెరపాడని, కిందిస్థాయి ఉగ్రవాదులతోనూ భేటీ అయ్యేవాడని ఆయన తెలిపారు.
టుండాకు విస్తృతమైన నెట్‌వర్క్ ఉండేదని, దాని ద్వారానే అతడు భారత్‌కు ఉగ్రవాదులను, పేలుడు పదార్థాలను, నకిలీ భారత కరెన్సీని భారత్‌కు పంపేవాడని చెప్పారు. కరాచీలో అతడు ‘మెహ్దూద్-తాలిమ్-ఇస్లామే దార్-అల్-ఫనూన్’ పేరిట పెద్దసంఖ్యలో మదర్సాలను నడుపుతున్నాడని, వాటి పేరిట భారీగా విరాళాలు వసూలు చేసేవాడని, ఈ మదర్సాలలోనే అతడు యువకులకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవాడని వివరించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అధినేత వాధవా సింగ్ 2010 సెప్టెంబర్-అక్టోబర్‌లో పేలుడు పదార్థాలను బంగ్లా మీదుగా భారత్‌కు తరలించేందుకు టుండానే సంప్రదించాడంటే అతడి నెట్‌వర్క్ ఏ స్థాయిలో పనిచేస్తోందో తెలుసుకోవచ్చని అన్నారు. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో అతడి నెట్‌వర్క్ విస్తరించి ఉందని చెప్పారు.
పాక్ వెలుపల తయారయ్యే పేలుడు పదార్థాలను ఢిల్లీ లేదా పంజాబ్‌లో ఏదో ఒక చోటికి తరలించే ప్రయత్నంలో ఉండగా, బంగ్లాలో టుండా మనుషులు పట్టుబడటంతో ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పారు. టుండా తన వాక్చాతుర్యంతో యువకులను ఉగ్రవాదంవైపు మళ్లించేవాడని, వారికి అవసరమైన పేలుడు పదార్థాలను కూడా సమకూర్చేవాడని తెలిపారు. ముంబై దాడుల ప్రధాన కుట్రదారు లఖ్వీతో తనకు ఏర్పడిన విభేదాలను గురించి కూడా అతడు వివరించినట్లు చెప్పారు. ముంబైకి చెందిన జలీస్ అన్సారీతో కలసి టుండా 1993లో ముంబై, హైదరాబాద్‌లలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడని, 1994 జనవరిలో అన్సారీ అరెస్టవడంతో ఢాకాకు పారిపోయాడని తెలిపారు. ఢాకా నుంచి భారత్‌కు వచ్చాక 1996-98లో పలు పేలుళ్ల వెనుక కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. 1998 తర్వాత తాను భారత్‌కు తిరిగి రావడం ఇదే మొదటిసారి అని టుండా చెబుతున్నాడు. అయితే, భద్రతా సంస్థలు అతడి మాటల్లోని నిజా నిజాలను నిర్ధారించుకునే పనిలో పడ్డాయి. గత పదిహేనేళ్లలో అతడు ఏమేం చేశాడనే విషయమై ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలతో కూడిన సంయుక్త బృందం టుండాను ఇంటరాగేట్ చేస్తోంది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు అమీర్ రజా, ఇతర లష్కరే ఉగ్రవాదులతో జరిపిన భేటీలపై అతడి నుంచి సమాచారాన్ని రాబట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పన్నెండేళ్ల వయసు నుంచే బాంబులపై మోజు
లష్కరే తోయిబా బాంబుల నిపుణుడు టుండాకు పన్నెండేళ్ల వయసు నుంచే బాంబులపై మోజు మొదలైంది. బాంబులపై తనకు ఎప్పటి నుంచి ఎలా ఆకర్షణ మొదలైందో అతడు పోలీసులకు వివరించాడు. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో 1943లో టుండా జన్మించాడు. అతడికి సుమారు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక చిరు వర్తకుడు అతడి ప్రాంతానికి సైకిల్‌పై వచ్చేవాడు. పిల్లలను ఆకట్టుకునేందుకు అతడు మందుగుండుతో తమాషాలు చేసేవాడు. ఒక కట్టెకు ‘చూరణ్’ (పొటాష్ పొడి) తగిలించి, దానికి తెల్లటి పదార్థాన్ని పూసేవాడు. దానిపై ఒక ద్రవాన్ని చల్లగానే భగ్గున మండి మెరుపులు వచ్చేవి. ఈ తమాషా టుండాను విపరీతంగా ఆకర్షించడమే కాకుండా, అతడిలో కుతూహలాన్ని పెంచింది. తర్వాతి కాలంలో అతడు కట్టెకు తగిలించిన పొడి పొటాష్ అని, దానిపై పూసే తెల్లని పదార్థం చక్కెర అని, దానిపై చల్లే ద్రవం ఒకరకం యాసిడ్ అని తెలుసుకున్నాడు. మహారాష్ట్రలోని భివండీలో 1985లో జరిగిన మత కలహాల్లో తన బంధువులు కొందరు మృతి చెందడంతో టుండా జిహాదీ శక్తులవైపు మళ్లాడు. చిన్నతనంలో నేర్చుకున్న తమాషా ఆధారంగా పొటాష్, చక్కెర, సల్ఫూరిక్ యాసిడ్‌ల మిశ్రమంతో బాంబుల తయారీ ప్రారం భించాడు. ఈ క్రమంలోనే భారీ బాంబులను చేయడం నేర్చుకున్నాడు. ఒకసారి బాంబు తయారు చేస్తుండగానే ఎడమచేతిని పొగొట్టుకున్నాడు. ఆ సంఘటన తర్వాతే అతడికి ‘టుండా’ అనే పేరు వచ్చింది.