రెండు, మూడు రోజుల్లో భారత్‌కు చోటా
తొలిసారి ప్రశ్నించిన భారత్ అధికారులు
♦ దావూద్ పాక్‌లో ఉన్నాడని విలేకర్లతో చెప్పిన రాజన్
బాలి: ఇండోనేసియాలోని బాలిలో అరెస్టయిన మాఫియా డాన్ చోటా రాజన్‌ను రెండుమూడు రోజుల్లో భారత్‌కు అప్పగించే అవకాశముంది. సోమవారం భారత దర్యాప్తు అధికారులు బాలిలో అతణ్ని తొలిసారి ప్రశ్నించారు. ‘రాజన్‌ను రేపోమాపో స్థానిక కోర్టుకు హాజరుపరచి భారత్‌లో అతనిపై ఉన్న కేసుల గురించి పోలీసులు నివేదిస్తారు. రాజన్‌ను సాధ్యమైనంత త్వరగా కస్టడీలోకి తీసుకోవడానికి భారత అధికారులు మాతో కలసి పనిచేస్తున్నారు. రాజన్ న్యాయవాది వ్యతిరేకించకపోతే అతణ్ని భారత పోలీసులకు అప్పగిస్తాం. ఈ ప్రక్రియ అంతా రెండుమూడు రోజుల్లో ముగుస్తుంది’ అని ఇండోనేసియా అధికారి ఒకరు తెలిపారు. సీబీఐ, ఢిల్లీ పోలీసులతో కూడిన బృందం రాజన్‌ను జైల్లో ఇండోనేసియా పోలీసుల సమక్షంలో ప్రశ్నించింది. రాజన్‌ను విచారణ కోసం తీసుకెళ్తున్నప్పుడు అతడు విలేకర్లతో మాట్లాడాడు. తన శత్రువైన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ సంరక్షణలో ఉన్నాడని చెప్పాడు.
దావూద్‌కు ప్రత్యేక కమాండోల రక్షణ
చోటా రాజన్ అరెస్టు నేపథ్యంలో పాక్‌లో ఉన్న మాఫియా డాన్ దావూద్‌కు ఆ దేశ ఆర్మీ భద్రత కట్టుదిట్టం చేసింది. కరాచీ, ఇస్లామాబాద్‌లలో అతని ఇళ్ల వద్ద ప్రత్యేక కమాండోలను మోహరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
‘లేఖల మార్పిడి అక్కర్లేదు’
కాగా, ఇరు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం గత ఏడాది డిసెంబర్ నుంచే అమల్లో ఉన్నందున దీని అమలు కోసం కొత్తగా లేఖలు ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం లేదని ఇరు దేశాలు నిర్ణయించాయి. రాజన్ అరెస్టు నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకోవడం తెలిసిందే.