సంపాదకీయం: దాదాపు రెండు దశాబ్దాల నుంచి మన భద్రతాసంస్థలు జల్లెడపడుతున్న ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ అన్వేషణ ఒక దేశంలో కాదు, ఒక నగరంలో కాదు... దాదాపు భూగోళమంతా సాగింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక బాంబు పేలుడు ఘటనలో టుండా విగతజీవుడయ్యాడని 2000 సంవత్సరం ప్రాంతంలో వచ్చిన సమాచారంతో దాదాపు ఐదేళ్లపాటు ఈ అన్వేషణ తాత్కాలికంగా ఆగింది. ఏడేళ్లక్రితం కెన్యాలో దొరికిపోయాడన్నారు. తీరా చూస్తే అతను వేరే వ్యక్తి. అనుమానం కలిగితే స్థావరాన్ని మారుస్తూ, దేశాలన్నీ చుట్టబెడుతూ గుట్టుగా బతికిన టుండా చివరకు చిక్కాడు. 1996లోనే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసినా ఇన్నాళ్లపాటు తప్పించుకు తిరిగాడంటే మాటలు కాదు.
ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్థావర ప్రాంతంగా మారిందని మన దేశం తరచు చేసే ఆరోపణల్లో యదార్థముందని పట్టుబడే సమయానికి టుండా వద్ద దొరికిన పాస్‌పోర్టు ధ్రువీకరించింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆద్యుడిగా, 1993 మొదలుకొని అనేకచోట్ల జరిగిన బాంబు పేలుళ్లతో ప్రత్యక్ష సంబంధాలున్నవాడిగా అనుమానిస్తున్న టుండాపై వాటికి సంబంధించి ఇప్పటికే ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి. వందలమంది మరణానికి దారితీసిన ఆ కేసులన్నీ ఒక ఎత్తయితే, టుండా వద్ద ఉండగల కీలక సమాచారం మరో ఎత్తు. దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా, అతనికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్నా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ద్వారానే వారిద్దరికీ మధ్య బాంధవ్యం ఏర్పడిందనేది మన భద్రతా సంస్థల మాట. ఐఎస్‌ఐ చీఫ్‌గా పనిచేసి రిటైరైన హమీద్ గుల్ అదుపాజ్ఞల్లో తాను ఈ కార్యకలాపాలు నడిపానని ఇప్పటికే టుండా వెల్లడించాడంటున్నారు.
దేశ విభజన, అనంతరం జరిగిన దురదృష్టకర పరిణామాలు రెండు దేశాల మధ్యా పొరపొచ్చాలు సృష్టించాయి. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో వచ్చిన విభేదాలు యుద్ధాల వరకూ వెళ్లాయి. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం అమెరికా పాకిస్థాన్‌ను చేరదీయడంతో పాటు. దానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేసి భారత్‌ను చికాకు పరచాలని చూసింది. అయితే, ఆ ప్రచ్ఛన్నయుద్ధకాలం ముగిసి రెండు దశాబ్దాలు దాటుతున్నా వెనకటి అలవాటును పాక్ సైన్యం వదులుకోలేకపోతోంది. అందులో భాగంగానే మన గడ్డపైకి ఉగ్రవాదులను పంపి, ఏదోరకంగా నష్టపరచాలని చూస్తున్నది. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట అమెరికా ప్రారంభించిన పోరాటం పాకిస్థాన్‌ను కూడా దారికి తెస్తుందని భావించినవారికి నిరాశే మిగిలింది.
తమకు ముప్పు కలుగుతుందనుకుంటే ద్రోన్ దాడులతో పదులకొద్దీమందిని చంపడానికి వెనకాడని అమెరికా... భారత్ విషయంలో పాకిస్థాన్ పాల్పడుతున్న చేష్టలను మాత్రం పట్టించుకోవడంలేదు. అందువల్లే ముంబైలో పాకిస్థాన్‌నుంచి వచ్చిన ఉగ్రవాదులు 2008లో మారణహోమం సృష్టించగలిగారు. ఆ ఘటనలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన డేవిడ్ హెడ్లీ దొరికినా, అతను ఇంటరాగేషన్‌లో ఎంతో విలువైన సమాచారాన్ని అందించినా అందులో మనకు తెలిసింది కొంత మాత్రమే. కరాచీలో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీంను, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, లష్కరే తొయిబా కమాండర్ జాకీ ఉర్ రహ్మాన్ లఖ్వీ, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ వంటి 20 మందిని అప్పగించాలని మన దేశం కోరుతున్నా పాకిస్థాన్ రకరకాల జవాబులిస్తోంది. దావూద్ తమ గడ్డపై లేడని దబాయించి, మిగిలినవారిపై సాక్ష్యాధారాలిస్తే తప్ప అప్పగించడం సాధ్యంకాదని చెబుతోంది. ఈ విషయంలో అమెరికా పాకిస్థాన్‌పై తగిన ఒత్తిడి తేలేకపోతోంది. దావూద్ ఇబ్రహీం పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో సాగిస్తున్న స్మగ్లింగ్ కార్యకలాపాలతో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కూ, అతని ఉగ్రవాద నెట్‌వర్క్‌కూ సంబంధముందని 2003లో అమెరికాయే స్వయంగా ప్రకటించింది. అయినా, ‘జాతీయ ప్రయోజనాల రీత్యా’ తప్పనిసరంటూ పాక్‌కు ఎడాపెడా సైనిక, ఆర్ధిక సాయం అందిస్తూనే ఉంది.
ఇప్పుడు అరెస్టయిన టుండా దాదాపు ఈ రెండు దశాబ్దాల ఉగ్రవాద కార్యకలాపాలపై కీలక సమాచారాన్ని అందించగలిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలపై కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనల్లో పోలీసులు అమాయకుల్ని అరెస్టుచేశారని ఆరోపణలు వచ్చాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తులో ఎందరో ముస్లిం యువకులు నిర్దోషులుగా తేలారు. ఇలాంటి పరిస్థితుల్లో టుండా వెల్లడించే సమాచారంవల్ల అసలు దోషులు పట్టుబడే అవకాశం ఉంది. ఎందుకంటే, ఐఎస్‌ఐ కనుసన్నల్లో అతను బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇండియన్ ముజాహిదీన్, హూజీ, జైషే మహమ్మద్‌వంటి సంస్థలతో సంబంధాలు నెలకొల్పుకుని వాటి కార్యకలాపాలను సమన్వయం చేశాడు. అందులో భాగంగా ఎన్నో సందర్భాల్లో వారితో భేటీ అయ్యాడు.
ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కదలికల గురించి, అతనికి ఐఎస్‌ఐ కల్పిస్తున్న రక్షణ గురించి వెల్లడించిన అంశాలేవీ కొత్తవి కాదు. వాటన్నిటినీ ‘రా’ వంటి మన గూఢచార సంస్థలు ఎప్పుడో రాబట్టాయి. అయితే, టుండా దావూద్ ప్రమేయంపై మరింత లోతైన, సాధికారమైన సమాచారాన్ని ఇవ్వగలుగుతాడు. పర్యవసానంగా మన అప్రమత్తతలో, మన సంసిద్ధతలో ఉన్న లోపాలు కూడా బహిర్గతమవుతాయి. దాడులను నిరోధించడానికి, అసలు అవి జరగకుండా నివారించడానికి ఎలాంటి చర్యలు అవసరమో అధ్యయనం చేయడానికి తోడ్పడతాయి. అంతిమంగా అంతర్గత భద్రత పటిష్టతకు ఇవన్నీ దోహదపడతాయి. దీంతోపాటు ఈ సమాచారం ఆధారంగా పాకిస్థాన్‌పై దౌత్యపరంగా మరింత ఒత్తిడి పెంచి, ఇలాంటి కార్యకలాపాలకు అది అడ్డాగా మారకుండా చేయగలిగినప్పుడే అసలైన విజయం సాధించినట్టవుతుంది. కొందరంటున్నట్టు పాకిస్థాన్‌తో చర్చలకు తలుపులు మూయడం మాత్రం పరిష్కారమార్గం కాదు.
చేజిక్కిన ఉగ్రవాద భూతం!
Published Tue, Aug 20 2013 2:27 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement