హై అలర్ట్.. దాడులకు ‘బంగ్లా’ ఉగ్రవాదుల కుట్ర
బెంగళూరు:
ఐటీ నగరి బెంగళూరులో ఏ క్షణంలోనైనా బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ నగరంలో హై అలర్ట్‌ను ప్రకటించింది. ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌లో జరిగిన తరహాల్లో నగరంలో కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బెంగళూరులోనే కాక మంగళూరులో కూడా ఈ తరహా దాడులకు ఆస్కారం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులు బెంగళూరుతో పాటు మంగళూరు ప్రాంతాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు.
బెంగళూరులో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశీయుల్లో ఉగ్రవాదులు కూడా కలిసిపోయి దాడులకు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర అధికారులు పేర్కొన్నారు. బెంగళూరులోనే కాక మడికేరి, చిక్కమగళూరు ప్రాంతాల్లోని కాఫీ, టీ ఎస్టేట్‌లలో సైతం కార్మికుల మాదిరిగా ఈ ఉగ్రవాదులు చేరిపోయారని, అందువల్ల వీరి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నగరంలో విదేశీయులు ఉన్న ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోకి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బెంగళూరులో లక్షలాది అక్రమ వలసదారులు
బెంగళూరులో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ వలసదారుల సంఖ్య ఏడాదికేడాదికి పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పోలీసు శాఖలో నమోదైన వివరాల ప్రకారం బెంగళూరులో లక్షల సంఖ్యలో బంగ్లా అక్రమ వలసదారులు ఉంటున్నారు. వీరంతా నకిలీ ధృవపత్రాలు, ఆధార్‌కార్డు, ఐడీ కార్డులను కలిగి ఉన్నట్లు సమాచారం. నగరంలో సుమారు పది లక్షలమంది ఉన్నారని ఇటీవల డీజీపీ సైతం ప్రకటించడం తెలిసిందే. దేశ సరిహద్దుల్లో అధికారులకు లంచాలు ముట్టజెప్పి వారు దేశంలోకి చొరబడుతున్నారని, ఉపాధి కోసం బెంగళూరుకు భారీగా వలస వస్తున్నారని డీజీపీ తెలిపారు. వారు స్థానిక అధికారులకు ముడుపులు ఇచ్చి ఆధార్ వంటి ధ్రువపత్రాలు పొందడం పెద్ద సమస్యగా మారిందని అన్నారు.