ఢాకా దాడుల పాపం షేక్ హసీనాదే! | Why the Revelations About the Dhaka Attackers Are Not Surprising | Sakshi
Sakshi News home page

ఢాకా దాడుల పాపం షేక్ హసీనాదే!

Published Thu, Jul 7 2016 2:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

ఢాకా దాడుల పాపం షేక్ హసీనాదే!

ఢాకా దాడుల పాపం షేక్ హసీనాదే!

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో వారం రోజుల్లోనే టెర్రరిస్టులు మూకలు రెండుసార్లు  విరుచుకుపడ్డాయి. అమాయక ప్రజలను ఊచకోతకోశాయి. వారం క్రితం ఢాకాలోని ఓ రెస్టారెంట్‌పై జరిగిన దారుణ దాడికి తామే కారణమంటూ ఐసిస్ టెర్రరిస్టులు ప్రకటించినప్పటికీ జాతీయ తీవ్రవాదులే అందుకు బాధ్యులనే విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వమే ప్రకటించింది. ఎవరీ దాడులకు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు, ఈ దాడులకు బాధ్యులెవరూ, అందుకు దారితీసిన పరిణామాలు ఏమిటన్నవి? క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ ముష్కరులే ఢాకా రెస్టారెంట్ ఊచకోతకు కారణమని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అన్సరుల్లా బంగ్లా టీమ్ హస్తం కూడా లేకపోలేదని అక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కూడా ప్రధాన మంత్రి షేక్ హసీనా వాజెద్ నాయకత్వంలోని అవామీలీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. జమాత్ ఈ ఇస్లామీ సంస్థకు అనుబంధంగా జమాత్ ఉల్ ముజాహీదీన్ పనిచేస్తోంది.

బేగమ్ ఖలీదా జియా నాయకత్వంలోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ జాతీయ పార్టీకి ఈ రెండు సంస్థలతోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షేక్ హసీనా హయాంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలసిన నేపథ్యంలో ఓ మాజీ సైన్యాధికారి అన్సరుల్లా బంగ్లా టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేసే అవకాశం లేకపోవడంతో ఈ రెండు సంస్థలు తీవ్రవాద పంథాను ఎంచుకున్నాయి. అప్పటి నుంచి అడపాదడపా దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

2014లో అత్యంత వివాదాస్పదంగా జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా వాజెద్ దేశ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధాన ప్రతిపక్షమైన నేషనలిస్ట్ పార్టీ సహా పలు పార్టీలు ఎన్నికలను బహిష్కరించడంతో షేక్ హసీనా ఎలాంటి పోటీ లేకుండానే నాటి ఎన్నికల్లో గెలిచారు. ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియా బహిరంగ సభలపై షేక్ హసీనా నిషేధం విధించారు. ఖలీదా జియాను గృహ నిర్బంధంలో ఉంచి హింసించారు. అప్పటి నుంచి ప్రతిపక్షానికి చెందిన పలువురు నాయకులు హఠాత్తుగా అదృష్యమవుతూ వచ్చారు. వారి ఆచూకి ఇప్పటి వరకు తెలియదు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా అణచివేస్తూ వచ్చారు.

దీంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఉన్నత చదువులు చదివిన విద్యావేత్తలు కూడా ఈ తీవ్రవాద సంస్థలవైపు ఆకర్షిలవుతూ వచ్చారు. 1971 యుద్ధ ఖైదీలకు ఉరిశిక్షలను విధించడం కూడా ఆగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ పరిణామాల పర్యవసానమే ఢాకాలో జరిగిన దాడులు. భారత ప్రభుత్వం కూడా వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా షేక్ హసీనా ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వస్తోంది. ఫలితంగా సరిహద్దుల నుంచి మనకు కూడా ముప్పు ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement