Dhaka attacks
-
ఢాకా ఉగ్రవాది బెంగాల్లో దాక్కున్నాడా..!
కోల్‌కతా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహాన్ని రచించిన కీలక ఉగ్రవాది భారత్‌లోనే తల దాచుకున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతడు పశ్చిమ బెంగాల్లో ఏదో ఒక చోట ఉండి ఉంటాడని బంగ్లాదేశ్ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే భారత్ అధికారులతో పంచుకోనున్నారట. ఢాకాలో ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు 22 మందిని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగిన వెంటనే దాదాపు వందమంది 20 ఏళ్లలోపు యువకులు కనిపించకుండా పోయారని, వారిలో కీలక వ్యూహకర్త కూడా ఉన్నాడని అంటున్నారు. భారత్-బంగ్లాదేశ్ ఒప్పందాల ప్రకారం ఉగ్రవాద సమస్యను ఉమ్మడిగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా సలహాదారు గవార్ రిజ్వి చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన భావిస్తున్న ప్రకారం ఢాకాలోని గుల్షాన్ రెస్టారెంట్ పై దాడికి వ్యూహాన్ని రచించన వ్యక్తి గత ఏడు నెలల కిందటే దేశం విడిచి భారత్‌లోకి అడుగుపెట్టాడు. బెంగాల్‌లోని ఏదో ఒక మూల తలదాచుకుని ఉంటాడు. అతడికోసం వారు తీవ్రంగా గాలిస్తున్నారు. -
'టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు'
ముంబై: ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రసంగాలపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముంబై పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. 'టెర్రరిస్టులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, తాను ఎవరినీ టెర్రరిజం వైపు మళ్లించలేదని జాకీర్ తన వాట్సాప్ వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. బంగ్లాదేశ్ లో 90 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలకు తాను తెలుసునని, అందులో 50 శాతం తన అభిమానులు ఉన్నారని.. అయితే తాను చెప్పిన అన్ని విషయాలను వాళ్లు పాటించడం లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడులకు యువతను రెచ్చగొట్టి అమాయక ప్రజలను చావుకు కారణమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు డాక్టర్ జాకీర్ నాయక్ కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తన ప్రసంగాలతో యువకులను రెచ్చగొడుతున్నాడని జాకీర్ పై ఆరోపణలున్నాయి. భారత్ లోనే కాదు విదేశాలలో ఉండే ముస్లిం యువకులు ఆయన ప్రసంగాలు విని చెడువైపు అడుగులు వేస్తున్నారని బంగ్లాదేశ్ ఆరోపించింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఆయన ప్రసంగాల వీడియోలను చూసి ఆ తర్వాత చర్య తీసుకుంటామన్నారు. మీడియాలో మాత్రం ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారని కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. -
ఉగ్రదాడిపై స్పందించిన ఆమిర్ ఖాన్
ముంబై: సమాజంలో జరుగుతున్న వర్తమాన అంశాలపై గళం వినిపించే బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ మరోసారి స్సందించారు. బంగ్లాదేశ్ లో జరిగిన రెండో ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాద్రానికి, ఉగ్రవాదులకు మతం లేదని వ్యాఖ్యానించారు. రంజాన్ పండుగ సందర్భంగా బాంద్రాలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఎవరైతే ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారో, ఉగ్రవాదులుగా మారుతున్నారో వారికి మతం లేద'ని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. రంజాన్ రోజున తన తల్లితో నాణ్యమైన సమయం గడపనున్నట్టు 'దంగల్' స్టార్ తెలిపాడు. బంగ్లాదేశ్ లోని షొలాకియా ప్రాంతంలో గురువారం రంజాన్ ప్రార్థనలు చేస్తున్నవారిపై ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. 14 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. వారం క్రితం ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరిపై దాడి చేసి 28 మందిని ఉగ్రదాదులు పొట్టన పెట్టుకున్నారు. -
ఢాకా దాడుల పాపం షేక్ హసీనాదే!
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో వారం రోజుల్లోనే టెర్రరిస్టులు మూకలు రెండుసార్లు విరుచుకుపడ్డాయి. అమాయక ప్రజలను ఊచకోతకోశాయి. వారం క్రితం ఢాకాలోని ఓ రెస్టారెంట్‌పై జరిగిన దారుణ దాడికి తామే కారణమంటూ ఐసిస్ టెర్రరిస్టులు ప్రకటించినప్పటికీ జాతీయ తీవ్రవాదులే అందుకు బాధ్యులనే విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వమే ప్రకటించింది. ఎవరీ దాడులకు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు, ఈ దాడులకు బాధ్యులెవరూ, అందుకు దారితీసిన పరిణామాలు ఏమిటన్నవి? క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ ముష్కరులే ఢాకా రెస్టారెంట్ ఊచకోతకు కారణమని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అన్సరుల్లా బంగ్లా టీమ్ హస్తం కూడా లేకపోలేదని అక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కూడా ప్రధాన మంత్రి షేక్ హసీనా వాజెద్ నాయకత్వంలోని అవామీలీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. జమాత్ ఈ ఇస్లామీ సంస్థకు అనుబంధంగా జమాత్ ఉల్ ముజాహీదీన్ పనిచేస్తోంది. బేగమ్ ఖలీదా జియా నాయకత్వంలోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ జాతీయ పార్టీకి ఈ రెండు సంస్థలతోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షేక్ హసీనా హయాంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలసిన నేపథ్యంలో ఓ మాజీ సైన్యాధికారి అన్సరుల్లా బంగ్లా టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేసే అవకాశం లేకపోవడంతో ఈ రెండు సంస్థలు తీవ్రవాద పంథాను ఎంచుకున్నాయి. అప్పటి నుంచి అడపాదడపా దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2014లో అత్యంత వివాదాస్పదంగా జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా వాజెద్ దేశ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధాన ప్రతిపక్షమైన నేషనలిస్ట్ పార్టీ సహా పలు పార్టీలు ఎన్నికలను బహిష్కరించడంతో షేక్ హసీనా ఎలాంటి పోటీ లేకుండానే నాటి ఎన్నికల్లో గెలిచారు. ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియా బహిరంగ సభలపై షేక్ హసీనా నిషేధం విధించారు. ఖలీదా జియాను గృహ నిర్బంధంలో ఉంచి హింసించారు. అప్పటి నుంచి ప్రతిపక్షానికి చెందిన పలువురు నాయకులు హఠాత్తుగా అదృష్యమవుతూ వచ్చారు. వారి ఆచూకి ఇప్పటి వరకు తెలియదు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా అణచివేస్తూ వచ్చారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఉన్నత చదువులు చదివిన విద్యావేత్తలు కూడా ఈ తీవ్రవాద సంస్థలవైపు ఆకర్షిలవుతూ వచ్చారు. 1971 యుద్ధ ఖైదీలకు ఉరిశిక్షలను విధించడం కూడా ఆగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ పరిణామాల పర్యవసానమే ఢాకాలో జరిగిన దాడులు. భారత ప్రభుత్వం కూడా వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నించకుండా షేక్ హసీనా ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వస్తోంది. ఫలితంగా సరిహద్దుల నుంచి మనకు కూడా ముప్పు ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. -
'వారు చేసింది నీచమైన పని'
ఢాకా: ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఆ విధంగా కృషి చేసే ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు సాగుతామని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఢాకాలోని ఓ రెస్టారెంటుపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఆమె స్పందిస్తూ ఈ దాడి ముమ్మాటికి నీచాతి నీచమైనదే అన్నారు. ఇలాంటి వారిని ఏ ముస్లింలు అని అనాలి? అసలు వీరికి మతమంటూ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రంజాన్ పవిత్ర ప్రార్ధనలు పక్కకుపెట్టి వారు ప్రజలను చంపడానికి వెళ్లారు. ఇలాంటి చర్య ఏమాత్రం సహించరానిది కాదు. వారికి అసలు ఏ మతం లేదు. ఉగ్రవాదమే వారి మతం' అని చెప్పారు.