బంగ్లాదేశ్‌పై మరో ఉగ్ర పంజా
* రంజాన్ ప్రార్థనల్లో పేలుళ్లు
* లిబియాలోనూ దాడులు
ఢాకా/అక్రా/బెంఘాజీ: వారం తిరగకముందే బంగ్లాదేశ్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉత్తర కిశోర్‌గంజ్ జిల్లా షోలకియాలో రంజాన్ ప్రార్థనల సందర్భంగా గురువారం ఉగ్రవాదులు బాంబులు పేల్చడంతో నలుగురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పుల సందర్భంగా ఇంట్లో కూర్చుని ఉన్న మహిళకు తూటా తాకడంతో ఆమె కూడా మరణించింది. ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
షోలకియాలోని స్థానిక ఈద్గా మైదానంలో దాదాపు 2 లక్షల మంది గుమిగూడిన వేళ ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
లిబియాలో 11 మంది దుర్మరణం
లిబియాలోని రెండో పెద్ద నగరం బెంఘాజీలో గురువారం సాయంత్రం రంజాన్ ప్రార్థనల్లో కారు బాంబు పేలి 11 మంది మృతిచెందారు. జనరల్ ఖలీఫా హఫ్తర్ నాయకత్వంలోని దళాలు ఐసిస్ ఉగ్రవాదుల్ని నగరం నుంచి తరిమికొట్టాక ఇటీవల కాలంలో బెంఘాజీపై దాడులు పెరిగాయి. ఇదిలా ఉండగా, ఘనాలోని కుమాసి నగరంలో బుధవారం రాత్రి రంజాన్ విందు సందర్భంగా తొక్కిసలాటలో 9 మంది మృతిచెందారు.