‘2,010మంది ఉగ్రవాదులు బోర్డర్ దాటారు’
కోల్‌కతా: కేంద్ర హోంశాఖకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఓ నివేదిక కలకలం రేపుతోంది. తమ దేశం నుంచి పలువురు ఉగ్రవాదులు భారతదేశంలోకి అడుగుపెట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు బంగ్లా నిఘా సంస్థ నివేదిక సమర్పించింది. గతంలో కంటే మూడింతలు అదనంగా ఉగ్రవాదులు చొరబడినట్లు పేర్కొంది. హర్కత్ ఉల్ జిహాది అల్ ఇస్లామి(హుజి), జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన దాదాపు 2,010 ఉగ్రవాదులు 2016లో బంగ్లా సరిహద్దును దాటి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టినట్లు బంగ్లా అధికారులు నివేదికలో చెప్పారు.
బెంగాల్ సరిహద్దు నుంచి 720మంది, 1,290మంది మాత్రం త్రిపుర, అసోం రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రవేశించినట్లు తెలిపింది. అయితే, బెంగాల్ ప్రభుత్వానికి ముందే ఇంటెలిజెన్స్‌నుంచి ఈ సమాచారం ఉన్నప్పటికీ ఎంతమంది అనే విషయంలో స్పష్టత లేదంట. 2014, 2015లలో బంగ్లాదేశ్ నుంచి వరుసగా 800, 659మంది ప్రవేశించారని తమకు సమాచారం ఉండగా తాజాగా అది కాస్త 2,010కి చేరడంతో ఇప్పుడు వారు తీవ్ర ఆలోచనలో పడ్డారు. బంగ్లా ప్రభుత్వం ఇచ్చిన నివేదికపట్ల ఇప్పటికే బెంగాల్ తర్జనాభర్జనలు పడుతుండగా త్రిపుర, అసోం రాష్ట్రాలు మాత్రం తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై తీవ్ర ఆలోచనలు చేస్తోంది.