అనవసరంగా మతాన్ని లాగి, మనుషుల్ని రెచ్చగొడితే ఏమవుతుంది? బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యా కులపై జరుగుతున్న హింసాకాండలా ఉంటుంది. పవిత్ర ఇస్లామ్ మతగ్రంథాన్ని మరో మతం దేవుడి పాదాల వద్ద దుర్గాపూజ పందిళ్ళలో పెట్టారనే పుకారు ఆ దేశంలో ఆరని చిచ్చు రేపింది. వారం క్రితం అక్టోబర్ 13న ఈ పుకార్లతో బంగ్లాదేశ్‌లోని కుమిల్లా జిల్లాలో మతఘర్షణలు మొదలయ్యాయి. వంగభూమిలో దుర్గాపూజ వేళ ఈ ఘర్షణలు అనేక జిల్లాలకు, రాజధాని ఢాకాకూ పాకాయి.
పదికి పైగా ఆలయాలు, 50కి పైగా విగ్రహాలు, అల్పసంఖ్యాకులకు చెందిన వందలాది ఇళ్ళు, దుకాణాలు విధ్వంసానికి, లూఠీకి గురయ్యాయి. పోలీసులు సహా పదుల మంది గాయపడ్డారు. పలువురు మరణించారు. సోషల్ మీడియా గాలివార్త ఇంతటి అనర్థం తేవడం అత్యంత విషాదం. ప్రాంతాలు, దేశాలకు అతీతంగా దక్షిణాసియాలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సహా అనేకచోట్ల అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా పెరుగుతున్న హింస, విధ్వంసాలకు ఇది తాజా తార్కాణం.
ఐక్యరాజ్యసమితి (ఐరాస), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా అంతర్జాతీయ వేదికలు బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులను ఖండించాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువులపై దాడులకు పాల్పడినవారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలంటూ ఆ దేశ హోమ్ మంత్రిని తాజాగా ఆదేశించారు. గడచిన గురువారమే ఆమె తొలి ప్రకటన చేస్తూ, కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆమె హెచ్చరించినా, హింసను అరికట్టడానికి బలగాలను దింపినా సరే, బంగ్లాలో పరిస్థితులు అదుపులోకి రాకపోగా, విధ్వంసం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం విడ్డూరం. కార్యక్షేత్రంలో పోలీసులు తగినంతలేరనీ, సమర్థంగా పనిచేయలేదనీ, నేతలు చూసీచూడనట్టున్నారనీ వార్త. అసలీ విధ్వంసం మునుపెన్నడో పథకం వేసుకొని, బెంగాలీ హిందువుల పెద్ద పండుగ దసరా వేళ చేశారనీ కథనం.
ఇదే సందుగా ‘బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి’ అనే ప్రముఖ సంస్థ తాలూకు వాళ్ళమని నమ్మేలా చేస్తూ, అజ్ఞాత వ్యక్తులు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. ‘బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్’ అనే దొంగపేరుతో, అనేక పాత దాడుల ఫోటోలు, వీడియోలను కొత్తవిగా ప్రచారం చేస్తున్నారు. సందట్లో సడేమియాగా దీన్ని అందిపుచ్చుకొని, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఈ హింసాకాండను అస్త్రంగా వాడుకోవాలని హిందూత్వపార్టీలు ప్రయత్నిస్తుండడం శోచనీయం. బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం సైతం మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత ఛాందసవాదాన్ని నూరిపోస్తున్న మదరసాల పుణ్యమా అని ఆ దేశం ఇప్పుడు ‘జిహాదిస్తాన్’గా మారిపోయిందని రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆరోపించారు.
పాకిస్తాన్ అనుకూల తీవ్రవాద సంస్థ ‘జమాతే ఇస్లామీ’ ఈ దాడుల వెనుక ఉందని వినిపిస్తోంది. ఖలీదా జియా సారథ్యంలోని ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ సంకీర్ణ ప్రభుత్వంలో 2001 –06 మధ్య ఆ సంస్థ కూడా భాగం. దేశంలో కనీసం 10 శాతం మందిపై పట్టున్న ఈ బృందం అధికారంలోకి రాలేకున్నా, హింసనైతే ప్రేరేపించగలదు. జమాత్‌కు కళ్ళెం వేయడం కోసం షేక్ హసీనా ప్రభుత్వం మరో ఇస్లామిస్టు బృందం ‘హెఫాజతే ఇస్లామ్’ (హిమ్)తో దోస్తీ కట్టింది.
దాని ఒత్తిడి మేరకే 2017లో సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహం తొలగించారు. మదరసా డిగ్రీని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీగా గుర్తించాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన వేళ నిరసనలు, హిందువులపై హింసాకాండకూ ‘హిమ్’ కారణమట. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ సర్కార్ తప్పు తెలుసుకొనేసరికే ఆలస్యమైంది. వెరసి, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనే వికృత రాజకీయక్రీడ భారత్ నుంచి బంగ్లాదేశ్ దాకా అనేకచోట్లకు పాకింది.
జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదుల తూటాలకు హిందువులు, సిక్కులు... అఫ్గాన్‌లో మసీదులపై దాడులతో పదుల కొద్దీ షియాలు... బంగ్లాదేశ్ ఘర్షణల్లో హిందువులు! సమయం, సందర్భం, కారణం, కారకులు వేరైనా–ప్రతీచోటా అల్పసంఖ్యాక మతస్థులే లక్ష్యం. దక్షిణాసియాలో మైనారిటీలు అభద్రతలో మునిగిపోయారు. ఉపఖండంలోని ప్రతి దేశం ఇప్పుడొక మతావేశ భూమిగా మారుతోంది. కాశ్మీర్‌లోనూ, బంగ్లాదేశ్‌లోనూ ఛాందసవాద బృందాలకు మద్దతుగా నిలిచి, మతం ఆసరాగా విద్వేషాన్ని రగిలించాలన్న పాకిస్తాన్ ప్రయత్నం జగద్విదితం. అందుకే, మతపరంగా సజాతీయతను రుద్ది, రాజకీయ ఆధిపత్యం సాధించాలనుకొనే శక్తులను కనిపెట్టి ఉండాలి.
గతంలో ఉత్తర భారతమంతటా గో సంరక్షణ పేరిట ముస్లిమ్‌ల ఊచకోత జరిగిన ఘట్టాలూ చూశాం. ఇప్పుడు కశ్మీర్‌లో పండిట్లతో పాటు వలస కార్మికుల ఉసురు తీస్తున్న ఉగ్రమూకల్ని చూస్తున్నాం. సాటిమనిషిని బతకనివ్వని ఛాందసం సిందూరమైతేనేం, హరితవర్ణ బంగారమైతేనేం! 2013 – 16 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌లో జరిగిన దారుణమైన ఇస్లామిస్ట్ హింసాకాండను హసీనా మర్చిపోరాదు. దశాబ్దాలుగా హిందువుల సంఖ్య క్షీణించడంపైనా, మానవహక్కుల సంఘం లెక్కల్లో హిందువులపై 3700 పైగా జరిగిన దాడులపైనా ఆమె తక్షణం దృష్టి పెట్టాలి.
తీవ్రవాద శక్తులపై ఉక్కుపాదం మోపితేనే, నేటి స్వర్ణోత్సవ స్వతంత్ర బంగ్లాదేశ్ సాధించిన ఆర్థిక పురోగతికి సార్థకత. భారత్ భద్రతకు సానుకూలత. తాజాగా ఢాకా విశ్వవిద్యాలయం బయట నిరసనకారుల చేతిలో ప్రముఖంగా కనిపించిన బ్యానర్‌లో మాట – ‘దేశంలోని మైనారిటీల భద్రతను కాపాడాలి’. అవును... అది బంగ్లాదేశ్ అయినా, భారత్ అయినా, అఫ్గాన్ అయినా ముందు చేయాల్సింది అదే!
Comments
Please login to add a commentAdd a comment