కోర్టు ప్రాంగణంలో టుండాపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: లష్కరే తోయిబాకు చెందిన బాంబుల నిపుణుడు అబ్దుల్ కరీం టుండాపై మంగళవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో దాడి జరిగింది. శివకుమార్ రాఘవ్ అనే హిందూసేన కార్యకర్త టుండా వీపుపై బలంగా చరిచాడు. ముఖంపై కూడా కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. టుండాను కోర్టులో హాజరుపరచిన నేపథ్యంలో కోర్టు ఆవరణలో హిందూసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడి, అతడికి మరణశిక్ష విధించాలంటూ నినాదాలు చేశారు. ఇంతలోనే ఒక వ్యక్తి అకస్మాత్తుగా భద్రతా వలయాన్ని ఛేదించుకుంటూ వెళ్లి అతడిపై దాడికి పాల్పడ్డాడు. టుండాపై దాడి చేసిన రాఘవ్‌తో పాటు విష్ణు గుప్తా అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన నేపథ్యంలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయ్ తరేజా ఇన్ కెమెరా విచారణకు ఆదేశించారు. తన వద్ద డబ్బు లేదని, అందువల్ల తాను లాయర్‌ను పెట్టుకోలేనని టుండా మేజిస్ట్రేట్‌కు చెప్పాడు. అతడి తరపున వాదించేందుకు కొందరు లాయర్లు ముందుకు వచ్చారు. అయితే, టుండా వకాల్తనామాపై సంతకం చేశాడంటూ ఎం.ఎస్.ఖాన్ అనే న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీనిపై మేజిస్ట్రేట్ టుండాను ప్రశ్నించగా, తనకు న్యాయవాది ఖాన్ పెద్దగా తెలియదని, అయితే, ఆయన తన తరఫున వాదిస్తారని చెప్పాడు. ఈలోగా ఒక న్యాయవాది ‘టుండా ఉగ్రవాది’ అంటూ కేకలు వేయడంతో కోర్టులో గలభా రేగింది. దీంతో నిందితుడి తరఫు న్యాయవాది మినహా మరెవరూ కోర్టు గదిలో ఉండరాదని మేజిస్ట్రేట్ ఆదేశించారు. టుండాను నాలుగు రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టుండాను ప్రశ్నించనున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్‌లో గతంలో జరిగిన పేలుళ్లతో సంబంధాలు ఉన్న టుండాను ప్రశించాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. పీటీ వారంట్‌పై అతడిని ఇక్కడకు రప్పించనున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు.
ఐఎస్‌ఐ బ్రిగేడియర్ నుంచి టుండాకు నకిలీ కరెన్సీ
పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకు చెందిన ఒక బ్రిగేడియర్ నుంచి టుండాకు నకిలీ భారత కరెన్సీ అందేదని ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. పలుసార్లు అతడు ఐఎస్‌ఐ బ్రిగేడియర్ నుంచి నకిలీ కరెన్సీ అందుకున్నాడని వారు చెప్పారు.