మరో 26/11 ముంబై తరహా దాడి జరిగితే..!
న్యూఢిల్లీ: 26/11 ముంబై తరహా దాడులకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు మరోసారి తెగబడితే.. భారత్ సహనంగా ఉండటం ఎంతమాత్రం సాధ్యపడదని బ్రసెల్స్‌కు చెందిన ఓ అంతర్జాతీయ మేధో సంస్థ అభిప్రాయపడింది. దక్షిణాసియాలో ఉగ్రవాదంపై అమెరికా విధానాన్ని విశ్లేషిస్తూ ఇంటర్నేషనల క్రైసిస్ గ్రూప్ తాజాగా ఓ నివేదిక వెలువరించింది. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రధాన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌కు చెప్పుకోదగినస్థాయిలో పాక్ సర్కారు మద్దతు ఉందని విశ్లేషించిన ఆ సంస్థ.. ఈ ఉగ్రవాద గ్రూపులతో అమెరికాకు కూడా ముప్పేనని స్పష్టం చేసింది.
‘ఈ ఉగ్రవాద గ్రూపులకు అల్ కాయిదాకు నేరుగా సంబంధాలు లేకపోయినా.. వాటి ఫైటర్లు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌లలో అంతర్జాతీయ ఉగ్రవాదులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ ఉగ్రవాద గ్రూపులు పాకిస్థాన్‌కే కాదు భారత్, అమెరికాకు కూడా ప్రమాదకరమే’ అని పేర్కొంది. గత ఏడాది కశ్మీర్‌లో భద్రతా దళాలపై ఉగ్రవాదుల దాడిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రతిస్పందనను అంచనా వేస్తే.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఆయన ప్రతిచర్యలు ఉంటాయని స్పష్టమవుతోంది. కానీ, 2008లో ముంబైలో చాలామందిని పొట్టనబెట్టుకున్న మారణహోమంలాంటిది మరొకటి జరిగితే.. భారత్ సహనంగా ఉండటం చాలా కష్టం’ అని అభిప్రాయపడింది.
గత ఏడాది ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత సైనికులు ఎల్‌వోసీను దాటి మరీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి.. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్‌ను ధ్వంసం చేసి.. పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ’కౌంటర్ టెర్రరిజం పిట్‌ఫాల్స్: వాట్ ద యూస్ ఫైట్ అగైనెస్ట్ ఐఎస్‌ఐఎస్ అండ్ అల్ కాయిదా షూడ్ అవైడ్’ పేరిట రూపొందించిన ఈ నివేదికలో భారత వ్యతిరేక ఉగ్రవాద గ్రూపుల నియంత్రణ, తాలిబన్లతో చర్చల దిశగా పాకిస్థాన్ సైన్యాన్ని ఒప్పించడమే అమెరికా ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొంది.