lashkar-e-taiba terrorist
-
హఫీజ్ సయీద్‌ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్‌ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్‌ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
క్రికెట్ ఆడుతుండగా కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఓ పోలీసు అధికారి క్రికెట్ ఆడుతుండగా ఉగ్రకాల్పులకు బారిన పడ్డారు. ఇన్స్పెక్టర్ మన్సూర్ అహ్మద్ వనీ శ్రీనగర్ శివార్లలో ఈద్గా క్రీడాస్థలంలో క్రికెడ్‌ఆడుతుండగా లష్కరే తొయిబా ఉగ్రవాది ఒకడు అతి సమీపం నుంచి మూడు రౌండ్లు కాల్పులకు దిగాడు. కంట్లోకి, పొట్టలోకి, చేతిలోకి తూటాలు దూసుకెళ్లడంతో వని కుప్పకూలారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ముష్కరుడిని బాసిత్ దార్గా గుర్తించినట్టు ఏడీజీ విజయ్ కుమార్ తెలిపారు. అతని కోసం ఆ ప్రాంతాన్నంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు. -
పాక్ టెర్రరిస్టుకు చైనా అండ.. 4 నెలల్లో ఐదోసారి మోకాలడ్డు
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు వంతు పాడే చైనా మరోమారు తన కుటిల బుద్ధిని చూపించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే భారత్-అమెరికా ప్రతిపాదను అడ్డుకుంది. పాకిస్థాన్‌కు చెందిన తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా ప్రతిపాదించగా.. బీజింగ్ హోల్డ్‌లో పెట్టింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది షాహిద్ మహమూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించటాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే మరోమారు చైనా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌ను ఇటీవలే ఉగ్రవాదిగా గుర్తించింది భారత్. చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం 1967 కింద హఫీజ్ సయీద్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది. తల్హా సయీద్.. భారత్‌లో లష్కరే తోయిబా కోసం నియామకాలు చేపట్టటం, నిధులు సేకరించటం, దాడులకు ప్రణాళికలు రచించటంలో కీలకంగా వ్యవహరించినట్లుపేర్కొంది. ఐక్యరాజ్య సమితిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీలో భారత్, అమెరికా ప్రతిపాదనలకు చైనా అడ్డుకోవటం ఇదేం మొదటిసారి కాదు. గడిచిన నాలుగు నెలల్లోనే చైనా ఓ ఉగ్రవాదికి మద్దతు ఇవ్వటం ఇది ఐదోసారి. ఇటీవలే లష్కరే సభ్యుడు షాహిద్ మహమూద్, సెప్టెంబర్‌లో సాహిద్ మిర్, జూన్‌లో జమాత్ ఉద్ దావా లీటర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, ఆగస్టులో జైషే మహమ్మద్ చీఫ్ సోదరుడు అబ్దుల్ రావూఫ్ అజార్‌లకు మద్దతు తెలిపింది. వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులగా గుర్తించాలని ప్రతిపాదనకు అడ్డుపడింది. ఇదీ చదవండి: భారత్‌పై దొంగదెబ్బ తీసిన కమాండర్లకు చైనా ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం! -
భారత్, అమెరికాకు షాకిచ్చిన చైనా
భారత్, అమెరికాకు డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి బిగ్ షాకిచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ విషయంలో చివరి నిమిషంలో చైనా ట్విస్ట్ ఇచ్చింది. అబ్దుల్ రెహ్మాన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. అయితే, అంతకుముందు.. ఇండియా, అమెరికా దేశాలు.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐసిస్, ఆల్ ఖైయిదా ఆంక్షల కమిటీ కింద ఉగ్రవాది మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ప్రతిపాదన చేశాయి. కాగా, సెప్టెంబర్ 26 దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సోదరుడే మక్కి. ఇక, మక్కిని ప్రత్యేకమైన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా చేస్తూ అమెరికా ట్రెజరీ శాఖ 2010 నవంబర్‌లో ప్రకటన చేసింది. దాని ప్రకారం మక్కీ ఆస్తుల్ని సీజ్ చేశారు. మక్కి తలపై రెండు మిలియన్ల డాలర్ల రివార్డును కూడా అమెరికా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. తాజాగా మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ప్రతిపాదనను డ్రాగెన్ చైనా అడ్డుకుంది. ఇక, గతంలోనూ పాక్ ఉగ్రవాదులను నిషేధిత జాబితాలో చేర్చుతున్న సమయంలో ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. లష్కరే సంస్థ కోసం మక్కీ నిధులను సమీకరించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్ -
కసబ్ కాదు.. దినేశ్ చౌధరి!
ముంబై: భారత్‌పై అనుక్షణం విషం చిమ్మే పాకిస్తాన్ ప్రేరేపిత ముంబై ఉగ్రదాడులు గుర్తున్నాయా? 2008లో నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 166 మంది చనిపోయారు. ఆ టెర్రరిస్ట్ల్లో ప్రాణాలతో పట్టుబడింది అబ్జల్ కసబ్ మాత్రమే. కసబ్ ప్రాణాలతో పట్టుబడటం వల్ల ఈ దాడుల వెనుకనున్న పాక్ హస్తం బట్టబయలైంది. కసబ్‌ను హిందూత్వ ఉగ్రవాదిగా చిత్రీకరించి, ఆ దాడులు హిందూత్వ ఉగ్రదాడులుగా చిత్రించాలని కుట్ర పన్నడం, పోలీసులకు చిక్కిన కసబ్‌ను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, లష్కరే సంస్థలు చంపాలనుకోవడం తదితర ఆసక్తికర అంశాలను ఆ కేసును విచారించిన ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా తన పుస్తకం ‘లెట్ మి సే ఇట్ నౌ’లో కళ్లకు కట్టారు. కేసులో భాగంగా ఆనాడు కసబ్‌ను మారియా విచారించారు. సోమవారం మార్కెట్లోకి విడుదలైన ఆ పుస్తకంలోని పలు ఆసక్తికర అంశాలివి.. ►నిజానికి ఐఎస్ఐ, లష్కరే ఆ దాడులను 2008లో నవంబర్ 26న కాకుండా, సెప్టెంబర్ 27వ తేదీన జరపాలనుకున్నాయి. ఆ తేదీ అప్పటి రంజాన్ ఉపవాస రోజుల్లో 27వది. ►కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా చిత్రించాలనుకున్నాయి. అందుకే, కసబ్ కుడి చేతికి ఎర్రని దారం కట్టింది. సమీర్ దినేశ్ చౌధరి అని, బెంగళూరు వాసి అని ఒక నకిలీ ఐడీ కార్డును సృష్టించాయి. భారత భద్రతాదళాల చేతిలో కసబ్ చనిపోతాడని, ఆ ఐడీ కార్డు ద్వారా అతడు హిందూ ఉగ్రవాదిగా ముద్రపడ్తాడని, మీడియా కూడా అదే విషయాన్ని ప్రచారం చేస్తుందని, మీడియా సంస్థలన్నీ బెంగళూరుకు వెళ్తాయని భావించాయి. కానీ, వారి ప్లాన్ ఫ్లాప్ అయింది. కసబ్ ప్రాణాలతో చిక్కాడు. ఆ విషయంలో కసబ్‌ను ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకున్న కాన్స్టేబుల్ తుకారాం ఓంబ్లే సాహసం అనన్యసామాన్యం. కసబ్ ఐడెంటిటీని వెంటనే బయటపెట్టకుండా పోలీసులు సంయమనం పాటించారు. దాంతో ఆయన అసలు ఐడెంటిటీ బయటపడింది. అతడు పాకిస్తాన్‌లోని ఫరీద్కోట్కు చెందిన అజ్మల్ అమిర్ కసబ్‌గా ప్రపంచానికి వెల్లడి చేయగలిగాం. హైదరాబాద్‌కు చెందిన అరుణోదయ కాలేజ్ నకిలీ ఐడీ కార్డులు ఇతర ఉగ్రవాదుల వద్ద లభించాయి. ►తమ ప్రమేయం బయటపడుతుందని ఐఎస్ఐ, లష్కరే భావించాయి. అందుకే భారత్‌లో జైళ్లో ఉన్న కసబ్‌ను హతమార్చాలని నిర్ణయించి ఆ బాధ్యతను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించాయి. ►నిజానికి దోపిడీలు చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కసబ్ లష్కరే ఉగ్రసంస్థలో చేరాడు. అతడికి జిహాద్ అంటే ఏంటో కూడా తెలియదు. అయితే, కసబ్‌ను భారత్‌లో ఉగ్రదాడుల కోసం పంపాలని నిర్ణయించుకున్న తరువాత.. అతడికి భారత వ్యతిరేకత నూరిపోశారు. భారత్‌లో ముస్లింలను నమాజ్ చేయనివ్వరని అబద్ధాలు చెప్పారు. మేం ఒకసారి ముంబైలో అతడిని మసీదుకు తీసుకువెళ్లాం. అక్కడ జరుగుతున్న నమాజ్‌ను చూసి కసబ్ ఆశ్చర్యపోయాడు. ►భారత్ పంపేముందు కసబ్‌కు వారం పాటు సెలవు ఇచ్చి, రూ. 1.25 లక్షలు ఇచ్చి ఇంటికి పంపించారు. ఆ డబ్బును సోదరి వివాహానికి ఖర్చు చేయమని కుటుంబానికి ఇచ్చాడు. ►నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీశారు -
తమిళనాడులోకి లష్కరే ఉగ్రవాదులు; హై అలర్ట్
చెన్నై: ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులో ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఆరుగురిలో ఒకరు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి కాగా మిగతా ఐదుగురు శ్రీలంకకు చెందిన ముస్లింలని పేర్కొన్నాయి. హిందువులుగా దేశంలోకి చొరబడి ఉగ్ర చర్యలకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు పోలీస్ శాఖ కొయంబత్తూర్‌లో హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. అటు చెన్నైలో బలగాలను పెంచారు. ఈ రెండు నగరాల్లో హోటళ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన స్థలాల్లో నిఘాను పెంచారు. తీర ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానితులుగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించేందుకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ ఉసిగొల్పనుందని నిఘా సంస్థలు ఇటీవల హెచ్చరించాయి. ఆ ఉగ్రమూకలు కశ్మీర్లోకి చొరబడటానికి ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. -
కశ్మీర్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని బారాముల్లా, అనంత్‌నాగ్ జిల్లాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని క్రీరీ ప్రాంతంలో ఉగ్రసంచారం వార్త తెలిసి భద్రతాబలగాలు గాలింపు చేపట్టగా వారిపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతమయ్యారు. అనంత్‌నాగ్ జిల్లాలోని అర్వానీ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. రెండు ఘటనాస్థలాల్లో ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది హతం
శ్రీనగర్: కశ్మీర్లో లష్కరేతోయిబా కార్యకలాపాలకు సూత్రధారిగా ఉన్న మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్ బంగ్రూ సహా ముగ్గురిని భద్రతాబలగాలు బుధవారం మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త బృందం బుధవారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఫతేహ్‌కదల్ ప్రాంతంలో ఉగ్రమూకలు నక్కిన ఇంటిని చుట్టుముట్టింది. అనంతరం ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ కమల్ కిశోర్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ఎన్కౌంటర్లో మెహ్రాజుద్దీన్ బంగ్రూతో పాటు ఫహద్ వజా, రయీస్ అబ్దుల్లాలను బలగాలు మట్టుబెట్టాయి. ఈ విషయమై కశ్మీర్ పోలీస్‌శాఖ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్వయం ప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. శ్రీనగర్‌లో జరిగిన పలు ఉగ్రదాడులు, ఆయుధాల దొంగతనం, బ్యాంకుల లూటీతో పాటు లష్కరేకు దాడులకు బంగ్రూ కీలక సూత్రధారిగా వ్యవహరించాడని తెలిపారు. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గావ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు చెందిన ఐదుగురు కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం ఆందోళనకారుల రాళ్ల దాడిని తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందాడు. కుల్గావ్ జిల్లా క్వాజిగుండ్ ప్రాంతంలోని చౌగామ్ సమీపంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలందరినీ దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించిన అనంతరం బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు దీటుగా స్పందించాయి. భద్రతా బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ముష్కరులు మృతి చెందారు. ఉగ్రవాదులంతా కుల్గావ్, అనంత్‌నాగ్ జిల్లాలకు చెందిన వారేనని భద్రతా బలగాల ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గత నెలలో బలగాల కాల్పుల్లో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అల్తాఫ్ కుచ్రూకు సన్నిహితుడైన గుల్జార్ అహ్మద్ పొద్దార్ అలియాస్ సైఫ్ కూడా మృతుల్లో ఉన్నాడు. గత ఏడాది పాంబేలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను కాల్చి చంపిన కేసులో పొద్దార్ ప్రధాన నిందితుడు. మిగతా వారికి వివిధ తీవ్ర నేరాలతో సంబంధముందని అధికారులు వివరించారు. ఎన్కౌంటర్ స్థలంలో పెద్ద సంఖ్యలో గుమికూడిన అల్లరిమూకలు భద్రతాబలగాలపై రాళ్లు రువ్వాయి. వారిని అదుపు చేసేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోగా పదిమంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బారాముల్లా –క్వాజిగుండ్ మధ్య రైళ్ల రాకపోకలను, కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. -
ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు ఆదివారం లష్కరే తోయిబా కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. మరొకరిని ప్రాణాలతో పట్టుకున్నాయి. ఈ విషయమై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కశ్మీర్ రేంజ్) స్వయంప్రకాశ్ పానీ మాట్లాడుతూ.. కుల్గామ్ జిల్లాలోని చద్దర్బన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారని నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం అక్కడకు చేరుకుని ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టిందని వెల్లడించారు. భద్రతాబలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయన్నారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన డివిజినల్ కమాండర్ షకూర్ అహ్మద్ దార్ సహా ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనలో మరో ఉగ్రవాది భద్రతాబలగాలకు లొంగిపోయినట్లు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి భారీఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నామన్నారు. చనిపోయిన షకూర్ అహ్మద్‌తో పాటు బలగాలకు లొంగిపోయిన ఉగ్రవాది స్థానికుడేనన్నారు. ఈ కాల్పుల్లో చనిపోయిన మరో ఉగ్రవాది హైదర్ పాకిస్తాన్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరోవైపు కుల్గామ్ జిల్లాలోని గోబల్ గ్రామంలో ఆర్మీ వాహనంపై అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఈ దాడి తీవ్రతరం కావడంతో ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(23) ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి పెల్లెట్ గాయాలయ్యాయి. జూన్ 20న త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని, 22న ఐసిస్ కశ్మీర్ చీఫ్ సహా నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండటం గమనార్హం. -
ముగ్గురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్ర దాడికి కుట్ర పన్నిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శ్రీనగర్ శివారులో శనివారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు పోలీసులు గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలోని చట్టాబల్లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు గస్తీని పెంచాయి. కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన వారేనని కశ్మీర్ రేంజ్ ఐజీ ప్రకాశ్ పాని చెప్పారు. ఘటనా స్థలం నంచి మూడు ఏకే రైఫిళ్లు, ఐదు తుపాకీ మేగజీన్లు, మందుగుండు సామగ్రి, వైద్య పరీక్షల కిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని స్థానికుడు ఫయాజ్ అహ్మద్ హమ్మల్గా గుర్తించారు. మరోవైపు, కశ్మీర్‌లోని బందీపురా జిల్లాలో అనుమానిత లష్కరే ఉగ్రవాదులు ఇద్దరు పౌరులను అపహరించి కాల్చి చంపారు. వారి మృతదేహాలను శనివారం మధ్యాహ్నం స్థానికులు ఓ మసీదు సమీపంలో గుర్తించారు. బాధితుల ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. -
టుండాకు ఐఎంతో లింకు!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా ఉగ్రవాది, హైదరాబాద్‌లో పట్టుబడిన అబ్దుల్ కరీంటుండాకు దిల్షుక్ నగర్లో పేలుళ్లకు తెగబడిన ఐఎం(ఇండియన్ ముజాహిదీన్)తో సంబంధాలున్నాయని ఢిల్లీ పోలీసులు తేల్చారు. ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్తో మరింత సత్సంబంధాలున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ మేరకు గత మంగళవారం ఢిల్లీ కోర్టులో టుండాపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఆయా వివరాలను పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాం తాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతేడాది ఆగస్టులో ఇక్కడ అరెస్టు చేశారు. చార్జ్‌షీట్‌లో పేర్కొన్న మరిన్ని వివరాలు.. - 1994లో బంగ్లాదేశ్ కేంద్రంగా పాక్-ఇండియా టై నెట్‌వర్క్‌ను స్థాపించి వ్యవహారాలు సాగించిన టుండా పాకిస్థానీయులతో పాటు భారత యువతనూ ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. - పాక్‌కు చెందిన ఉగ్రవాదులను భారత్‌లోకి జొప్పించడం, వారితో స్థానిక యువతను ఆకర్షించి, బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడం వంటివి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. దీనికోసం ప్రాథమికంగా ఎంపిక చేసుకున్న నలుగురిలో సలీం జునైద్ ఒకడు. ఈయన టుండా తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇది హైదరాబాద్‌లో దాదాపు 6 పేలుళ్లకు పాల్పడింది. జునైద్‌ను హైదరాబాద్ పోలీసులు 1998లో అదుపులోకి తీసుకున్నారు. - మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ టుండాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2005లో ఐఎం వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్‌ను కలిశాడు. కోల్‌కతాకు చెందిన రజాఖాన్ ఐఎం ముసుగులో రియాజ్, ఇక్బాల్ భత్కల్ ద్వారా దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాడు. 2007లో హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల కేసుల్లోనూ రజాఖాన్ వాంటెడ్‌గా ఉన్నాడు. 2005లో టుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన ఓ ఉన్నతాధికారి సాయంతో అమీర్ రజా ఖాన్‌ను కలిశాడని, ఐఎంకు పూర్తిస్థాయి సహకారం అందించేందుకు అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.