‘క్రేజీ’ ధర్నా ముగిసింది!
కేంద్రంతో రాజీ కుదరడంతో హైడ్రామాకు తెర
ఇద్దరు పోలీసులను సెలవులో పంపడానికి కేంద్రం అంగీకారం
భారీగా పోలీసుల మోహరింపు; లాఠీచార్జ్; పదిమందికి గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ధర్నాకు దిగిన అరుదైన ఆందోళనకు మంగళవారం సామరస్య పూర్వక ముగింపు లభించింది. ఢిల్లీ పోలీసులను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తేవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించిన ఆందోళన.. కేంద్ర ప్రభుత్వంతో రాజీ కుదరడంతో మంగళవారం రాత్రి ముగిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో ఇద్దరిని సెలవులో పంపిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో కేజ్రీవాల్ తన పట్టు వీడి ధర్నాను విరమించారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సంప్రదింపులు ఫలించి జనవరి 26, గణతంత్ర దినోత్సవాలకు ముందు జరిగిన ఈ హై డ్రామాకు తెరపడింది.
రాజీ ఫార్ములా
- డ్రగ్స్, వ్యభిచార మాఫియాపై దాడులకు నిరాకరించిన మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, డెన్మార్క్ మహిళ అత్యాచారానికి గురైన ప్రాంతం పహర్‌గంజ్ పీసీఆర్ వ్యాన్ ఇన్‌చార్జ్.. ఈ ఇద్దరినీ సెలవులో పంపేందుకు అంగీకారం.
- పోలీసుల ఉదాసీనతపై న్యాయవిచారణను వేగవంతం చేయడం.
- ఈ రెండు హామీలతో పాటు పవిత్రమైన రిపబ్లిక్ డే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ధర్నాను విరమించాలని కోరుతూ నజీబ్‌జంగ్ పంపిన లేఖను ధర్నా ముగింపు సందర్భంగా కేజ్రీవాల్ ప్రజలకు చూపారు. ఇది ఢిల్లీ ప్రజలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను లేవనెత్తేందుకు ఆప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
ఇబ్బందుల్లో ‘ఆమ్ ఆద్మీ’
కేజ్రీవాల్ ధర్నాతో మంగళవారం కూడా నాలుగు మెట్రోస్టేషన్లను మూసే ఉంచారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సైతం గుర్తింపు కార్డులు చూపినా పోలీసులు గంటల తరబడి లోనికి వెళ్లనివ్వలేదు. ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు కేజ్రీవాల్‌ను విమర్శించడం కనిపించింది.
రాష్ర్టపతితో పీఎం భేటీ: కేజ్రీవాల్ ధర్నా నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై, పరిస్థితిని వివరించారు. రానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా వారు చర్చించినట్లు సమాచారం.
కేజ్రీ మంతనాలు
మంగళవారం ఉదయం నుంచి వర్షం ఉండడంతో కేజ్రీవాల్ తన కారులోనే ధర్నా కొనసాగించారు. తర్వాత పక్కనే ఉన్న రైల్‌భవన్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని భార్య తెచ్చిన ఆహారాన్ని తిన్నారు. ధర్నాపై ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సహచరులు, నాయకులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జంతర్‌మంతర్‌లో ఆందోళన కొనసాగించాలంటూ కేంద్ర హోంమంత్రి చేసిన సూచనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ధర్నా చేయాలో చెప్పేందుకు షిండే ఎవరని, తాను ఢిల్లీ సీఎంనని ఎక్కడైనా ధర్నా చేసే హక్కు తనకు ఉందన్నారు. వేలాదిగా తరలివెళ్లి గణతంత్ర వేడుకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాత్రంతా చలిలో ఉండటంతో కేజ్రీవాల్‌కు జ్వరం వచ్చినట్లు సమాచారం.
స్వల్ప ఉద్రిక్తత
సోమవారం రైల్ భవన్ బయట ధర్నాకి దిగిన కేజ్రీవాల్ రాత్రి అక్కడే నిద్రించారు. పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుతో వందలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు మంగళవారం ైరె ల్‌భవన్‌కి చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే కూర్చుని నినాదాలతో హోరెత్తించారు. హైసెక్యూరిటీ జోన్ అయి న ప్రధాని కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ, మంత్రుల కార్యాలయాలు ఉన్నచోట నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ధర్నా చేపట్టడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆప్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. దీంతో పోలీసులపై ఆప్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీసులు గాయపడగా, పోలీసుల లాఠీచార్జిలో పదిమంది ఆప్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.