కొచ్చిన్: భారత సముద్ర జలాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.12 వేల కోట్ల విలువైన సుమారు 2,500 కిలోల మెథాంఫెటమైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్(ఎన్‌సీబీ) స్వాధీనం చేసుకుంది. కేరళ తీరంలోని భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి ఈ మత్తు పదార్థం ఉన్న 134 సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్(ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు.
అఫ్గానిస్తాన్ నుంచి అక్రమంగా తరలించే డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ సముద్రగుప్త్ పేరుతో నేవీ, ఎన్‌సీబీ కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఒక పాకిస్తానీని అదుపులోకి తీసుకున్నామన్నారు. అఫ్గానిస్తాన్ నుంచి డ్రగ్స్‌తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మక్రాన్ తీరం వెంబడి పాక్, ఇరాన్‌ల మీదుగా డ్రగ్స్‌ను చిన్న పడవల్లోకి పంపిణీ చేసుకుంటూ వస్తోందని చెప్పారు.
మట్టన్‌చెర్రీ వద్ద ఈ ఓడను అడ్డగించినట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక, మాల్దీవులకు డ్రగ్స్‌ను చేరవేయడమే స్మగ్లర్ల లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 3,200 కిలోల మెథాంపెటమైన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషిష్‌ను పట్టుకున్నట్లు తెలిపారు.
చదవండి: గగన్‌యాన్.. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం
Comments
Please login to add a commentAdd a comment