Sahara Group chief
-
డబ్బే సర్వస్వం కాదు..
♦ ఒత్తిడిని అధిగమించే శక్తిని దేవుడిచ్చాడు ♦ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ ♦ ‘థాట్స్ ఫ్రం తీహార్’ పేరుతో పుస్తకం విడుదల న్యూఢిల్లీ: వేల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము రీఫండ్ వివాదంలో దాదాపు రెండేళ్లుగా తీహార్ జైల్లో మగ్గుతున్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ తాజాగా రచనా వ్యాసంగం చేపట్టారు. సహారా గ్రూప్ 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాయ్ రాసిన ‘థాట్స్ ఫ్రమ్ తీహార్’ పుస్తకాన్ని సోమవారం విడుదల చేశారు. ‘లైఫ్ మంత్రాస్’ శీర్షికన వెలువడనున్న మూడు పుస్తకాల శ్రేణిలో ఇది మొదటిది. జైలు జీవితంలో తన ఆలోచనలను ఇందులో పొందుపర్చిన రాయ్.. ఇది తన ఆత్మకథ మాత్రం కాదని స్పష్టం చేశారు. కేవలం ప్రాథమిక సౌకర్యాలతో జైలు గదిలో గడపాల్సి రావడం తనకు షాక్‌కు గురిచేసిందని రాయ్ తెలిపారు. జైలు జీవితం చాలా ఒంటరిగాను, దుర్భరంగానూ ఉంటుందని, కానీ అదృష్టవశాత్తు ఎల్లవేళలా ఒత్తిడిని అధిగమించగలిగే శక్తిని భగవంతుడు తనకు ఇచ్చాడని ఆయన వివరించారు. ‘నేనేం చేశానని నాకీ శిక్ష .. అని అనిపించేది. ఇలాంటి ఆలోచనలు అనేకానేకం మెదడును తొలిచేసేవి. ఎవరినైనా.. బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధమూ లేకుండా ఒంటరిగా బంధించేసినప్పుడు జుత్తు పీక్కోవాలనిపిస్తుంది.. ఒకోసారి పిచ్చెత్తిపోతుంది’ అంటూ రాయ్ పుస్తకంలో పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కోసం దేశవిదేశాల్లో దాదాపు 5,120 చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. డబ్బున్నా, షరతులు విధిస్తే... ‘బోలెడంత డబ్బుంటే సుఖంగా బతికేయొచ్చనుకుంటారు అందరూ. కానీ కోరుకున్నంత సంపద ఉన్నా .. మహలు నుంచి బైటి కెళ్లొద్దు.. ఎవరితో మాట్లాడొద్దు, బాహ్యప్రపంచంతో సంబంధం పెట్టుకోవద్దు.. కనీసం టీవీ, రేడియో లాంటివి కూడా ఉండవు అంటూ షరతులు విధిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇరవై .. లేదా ముప్పై లేదా నలభై రోజుల తర్వాతో.. బైటికెళ్లేందుకు తలుపులు తీస్తే ఏం చేయాలో అర్థం కాక ఆ వ్యక్తి జుత్తు పీక్కుంటూ ఉంటాడు లేదా పిచ్చెత్తి పోయి ఉంటాడు. దీన్ని నమ్మని వారెవరైనా నన్ను కలిస్తే ప్రాక్టికల్‌గా నిరూపిస్తాను’ అని రాయ్ వివరించారు. తన భావోద్వేగాలను ఎవరితోనూ పంచుకునే అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. అప్పట్లోనే హాయిగా ఉండేది... సహారా గ్రూప్ 1978లో కేవలం రూ. 2,000తో మొదలైందని, ఇప్పటికన్నా అప్పట్లో ఎంతో సంతోషంగా ఉండేదని రాయ్ రాసుకొచ్చారు. పుస్తకం ప్రకారం ప్రస్తుతం గ్రూప్ విలువ దాదాపు రూ. 1,80,000 కోట్లు. అత్యాశకు పోయేవారు సంతోషంగా ఉండలేరని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. ప్రతీ క్షణం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలన్నది తన తండ్రి నుంచి నేర్చుకున్నానని ఆయన వివరించారు. డబ్బే పరమావధిగా పనిచేసే ఏ సంస్థా పురోగమించలేదని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధోగతి పాలైనవి చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
సుబ్రతా నిర్బంధం సబబే..
* సుప్రీంకోర్టు స్పష్టీకరణ * అన్యాయమంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత * బెయిల్ కోసం రూ. 10,000 కోట్ల * చెల్లింపునకు కొత్త ప్రతిపాదనతో రావాలని సూచన న్యూఢిల్లీ: మదుపుదారులకు రూ.24,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్‌కి నిరాశే మిగిలింది. ఈ విషయంలో ఆయన జ్యుడీషియల్ కస్టడీ సరైనదేనని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. రాయ్, మరో రెండు గ్రూప్ కంపెనీల డెరైక్టర్ల కస్టడీ అన్యాయమని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, ఈ విషయంలో సహజన్యాయ సూత్రాలు పాటించలేదని దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ కేహార్‌లతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్టం ప్రకారమే ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపడం జరిగిందని 207 పేజీల ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. మార్చి 4వ తేదీ నుంచీ తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల బెయిల్‌కు తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని కూడా సహారా గ్రూప్‌కు సుప్రీంకోర్టు సూచించింది. తద్వారా బెయిల్ విషయంలో ఏప్రిల్ 21న గ్రూప్ దాఖలు చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. రాయ్‌ని విడుదల చేసిన మూడు పనిదినాల్లో రూ.3,000 కోట్లను చెల్లిస్తామని, మరో రూ.2,000 కోట్లను మే 30లోపు చెల్లించడం జరుగుతుందని గ్రూప్ అప్పట్లో ప్రతిపాదన దాఖలు చేసింది. ఇక బ్యాంక్ గ్యారెంటీగా రూ.5,000 కోట్లను చెల్లించడానికి సంస్థ జూన్ 30 వరకూ సమయం కోరింది. ఘాటైన పదజాలం... మదుపుదారుల నుంచి రెండు గ్రూప్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు చేయడం, వాటిని తిరిగి చెల్లించమని జారీ అయిన ఆదేశాల విషయంలో శాట్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు అన్నింటినీ సహారా గ్రూప్, రాయ్‌లు పట్టించుకోలేదని పేర్కొంది. గ్రూప్ అనుసరించిన వైఖరిని ధర్మాసనం సహించబోదని ఉద్ఘాటించింది. తనను అరెస్ట్ చేయడం అన్యాయమంటూ దాఖలైన పిటిషన్లో ఎటువంటి ‘మెరిట్’ లేదని స్పష్టం చేసింది. మదుపరుల నిధుల పునః చెల్లింపునకు సంబంధించి జారీ చేసిన ఆదేశాల అమలుకు న్యాయస్థానానికి తగిన అన్ని అవకాశాలూ ఉంటాయని సైతం స్పష్టం చేసింది. మదుపరులకు మెజారిటీ భాగం పునఃచెల్లింపులు జరిగిపోయాయని చెబుతున్న సహారా గ్రూప్, ఈ విషయంలో సరైన సాక్ష్యాలను మాత్రం చూపడంలేదని తెలిపింది. కోర్టులను ప్రభావితం చేసే రీతిలో సహారా గ్రూప్ ‘మైండ్ గేమ్’ ఆడుతోందని, ఇలాంటి వాటిని కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోవని పేర్కొంటూ ఏప్రిల్ 21న రిజర్వ్ చేసుకున్న తన ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. సహారా తరహా కేసుల విషయంలో ఎటువంటి ఒత్తిడులకు లొంగని రీతిలో కోర్టులు పనిచేయాలని సూచించింది. -
రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సహారాగ్రూప్ తొలుత చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అప్పటివరకూ గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ దేశం విడిచి వెళ్లలేరని పేర్కొంది. ఈ మేరకు ఇంతక్రితం (జనవరి 9) ఇచ్చిన ఆదేశాలను సడలించాలని కోరుతూ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పకపోతే ఈ విషయం దర్యాప్తునకు తాము తదుపరి ఆదేశాలను జారీ చేస్తామని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేసు విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 11కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పటికల్లా అన్ని అంశాలనూ సెబీకి సమర్పించాలని స్పష్టం చేసింది.