సుబ్రతా నిర్బంధం సబబే.. | Supreme Court orders Subrata Roy to remain in jail | Sakshi
Sakshi News home page

సుబ్రతా నిర్బంధం సబబే..

Published Wed, May 7 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

సుబ్రతా నిర్బంధం సబబే..

సుబ్రతా నిర్బంధం సబబే..

* సుప్రీంకోర్టు స్పష్టీకరణ
* అన్యాయమంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
* బెయిల్ కోసం రూ. 10,000 కోట్ల
* చెల్లింపునకు కొత్త ప్రతిపాదనతో రావాలని సూచన

 
న్యూఢిల్లీ: మదుపుదారులకు రూ.24,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్‌కి నిరాశే మిగిలింది. ఈ విషయంలో ఆయన జ్యుడీషియల్ కస్టడీ సరైనదేనని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. రాయ్, మరో రెండు గ్రూప్ కంపెనీల డెరైక్టర్ల కస్టడీ అన్యాయమని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, ఈ విషయంలో సహజన్యాయ సూత్రాలు పాటించలేదని దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ కేహార్‌లతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్టం ప్రకారమే ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపడం జరిగిందని 207 పేజీల ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది.  మార్చి 4వ తేదీ నుంచీ తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల బెయిల్‌కు తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని కూడా సహారా గ్రూప్‌కు సుప్రీంకోర్టు సూచించింది. తద్వారా బెయిల్ విషయంలో ఏప్రిల్ 21న గ్రూప్ దాఖలు చేసిన ప్రతిపాదనను  తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.  రాయ్‌ని విడుదల చేసిన మూడు పనిదినాల్లో  రూ.3,000 కోట్లను చెల్లిస్తామని, మరో రూ.2,000 కోట్లను  మే 30లోపు చెల్లించడం జరుగుతుందని గ్రూప్ అప్పట్లో ప్రతిపాదన దాఖలు చేసింది. ఇక బ్యాంక్ గ్యారెంటీగా రూ.5,000 కోట్లను చెల్లించడానికి సంస్థ జూన్ 30 వరకూ సమయం కోరింది.
 
 ఘాటైన పదజాలం...
 మదుపుదారుల నుంచి రెండు గ్రూప్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు చేయడం, వాటిని తిరిగి చెల్లించమని జారీ అయిన ఆదేశాల విషయంలో శాట్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు అన్నింటినీ సహారా గ్రూప్, రాయ్‌లు పట్టించుకోలేదని పేర్కొంది. గ్రూప్ అనుసరించిన వైఖరిని ధర్మాసనం సహించబోదని ఉద్ఘాటించింది. తనను అరెస్ట్ చేయడం అన్యాయమంటూ దాఖలైన పిటిషన్‌లో ఎటువంటి ‘మెరిట్’ లేదని స్పష్టం చేసింది. మదుపరుల నిధుల పునః చెల్లింపునకు సంబంధించి  జారీ చేసిన ఆదేశాల అమలుకు న్యాయస్థానానికి తగిన అన్ని అవకాశాలూ ఉంటాయని సైతం స్పష్టం చేసింది.

మదుపరులకు మెజారిటీ భాగం పునఃచెల్లింపులు జరిగిపోయాయని చెబుతున్న సహారా గ్రూప్, ఈ విషయంలో సరైన సాక్ష్యాలను మాత్రం చూపడంలేదని తెలిపింది.  కోర్టులను ప్రభావితం చేసే రీతిలో సహారా గ్రూప్ ‘మైండ్ గేమ్’ ఆడుతోందని, ఇలాంటి వాటిని కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోవని పేర్కొంటూ ఏప్రిల్ 21న రిజర్వ్ చేసుకున్న తన ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. సహారా తరహా కేసుల విషయంలో ఎటువంటి ఒత్తిడులకు లొంగని రీతిలో కోర్టులు పనిచేయాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement