మిరాచ్ మోసంపై ఎఫ్‌ఐఆర్: సహారా
న్యూఢిల్లీ: విదేశాల్లోని తమ మూడు హోటళ్ల (న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్ - లండన్‌లోని గ్రాస్‌వీనర్) వాటాల విక్రయ వ్యవహారంలో తమను ఘోరంగా మోసం చేసిన కేసులో అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్, ఆ సంస్థ అధికారులపై క్రిమినల్, సివిల్ పరమైన న్యాయ చర్యలను ప్రారంభించినట్లు సహారా ప్రతినిధి ఒకరు తెలిపారు. రుణానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ అమెరికా లేఖ విషయంలో ఫోర్జరీ, మోసం వ్యవహారంలో తమ ఫిర్యాదుపై మిరాచ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదయినట్లు కూడా పేర్కొంది. కాగా తమ చీఫ్ సుబ్రతారాయ్‌ని తీహార్ జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సంబంధించి బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణలపై కూడా కొత్త మార్గాలపై దృష్టి పెట్టినట్లు ప్రతినిధి పేర్కొన్నారు.
మేము సైతం - మిరాచ్: కాగా సహారా న్యాయపరమైన చర్యలపై పంపిన ఈ-మెయిల్ ప్రశ్నలకు మిరాచ్ కేపిటల్ సమాధానం ఇచ్చింది. తాను సైతం సహారాపై న్యాయపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపింది. త్వరలో ఇందుకు సంబంధించి ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామని పేర్కొంది.