తీహార్ జైల్లో సహారా సుబ్రతాకి ‘ఆఫీస్’
న్యూఢిల్లీ: బెయిల్ కోసం నిధులు సమీకరించుకోవడంలో భాగంగా హోటల్స్‌ను విక్రయిస్తున్న సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ .. కొనుగోలుదారులతో తీహార్ జైల్లో నేటి నుంచి చర్చలు జరపనున్నారు. ఇందుకోసం జైల్లోని కాన్ఫరెన్స్ రూమ్‌ను అధికారులు కేటాయించారు. మంగళవారం (నేడు) నుంచి పది రోజుల పాటు చర్చల కోసం ఆయన దీన్ని వినియోగించుకోనున్నారు. సాధారణంగా జైలు అధికారులు అంతర్గత సమావేశాల కోసం ఉపయోగించుకునే ఈ రూమ్‌ను సుబ్రతా రాయ్‌కి సంబంధించి.. ప్రస్తుతం స్పెషల్ జైలుగా వ్యవహరిస్తారు.
సుబ్రతాతో పాటు తీహార్‌లోనే ఉన్న ఇద్దరు సహారా డెరైక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దూబే.. కొనుగోలుదారులతో చర్చల్లో పాల్గొంటారు. ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 20,000 కోట్ల నిధుల చెల్లింపు వివాదంలో అరెస్టయిన సుబ్రతా రాయ్ గత అయిదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు చేసేందుకు రూ. 10,000 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో తాజాగా ఆయన న్యూయార్క్, లండన్‌లోని లగ్జరీ హోటల్స్‌ను అమ్మకానికి పెట్టారు. ఇందుకోసమే ఆయన బిడ్డర్లతో చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కోర్టు ఆదేశించింది.
రూమ్‌లో సదుపాయాలివీ..
వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఏసీ కాన్ఫరెన్స్ రూమ్‌లో 52 అంగుళాల టీవీ, వై-ఫై కనెక్టివిటీ ఉంటుంది. రాయ్‌కి, డెరైక్టర్లకు రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఒక మొబైల్ ఫోన్ ఇస్తారు. వీటికి సంబంధించిన చార్జీలను సహారా భరించాల్సి ఉంటుంది. ఉదయం 6 గం. నుంచి రాత్రి 8 గం.దాకా స్టెనో, సహాయకులు, ఒక సాంకేతిక సహాయక ఉద్యోగి ఆయనకు అందుబాటులో ఉంటారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో చర్చలు జరుగుతాయి.