సహారా చీఫ్కు కాస్త ఊరట.. భారీ షాక్
ఒకవైపు ఆనందం, మరోవైపు షాక్ తినడం రెండూ ఒకేసారి వస్తే ఎలా? సహారా చీఫ్ సుబ్రత రాయ్ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. మానవీయ కోణంలో ఆలోచించి సుబ్రత రాయ్ పెరోల్ను ఆగస్టు మూడో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. దాన్ని ఆయన దుర్వినియోగం చేయకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆగస్టు మూడోతేదీ లోగా రూ. 300 కోట్లు కోర్టుకు చెల్లించాలని, లేకపోతే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
సహారా ఆస్తులన్నింటినీ ఒక రిసీవర్కు ఎందుకు అప్పగించకూడదన్న అంశంపై వాదనలను ఆగస్టు మూడో తేదీన కోర్టు వింటుంది. సుబ్రతరాయ్కి ఈ సంవత్సరం మే 6వ తేదీన పెరోల్ వచ్చింది. తర్వాత దాన్ని మే 11న రెండు నెలలు పొడిగించారు. సోమవారంతో ఆ గడువు ముగిసింది. దాంతో ఈ అంశంపై మళ్లీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాయ్కి కాస్తంత ఊరట కలిగించేలా పెరోల్ పొడిగించినా, ఆ లోపు రూ. 300 కోట్లు చెల్లించాలంటూ షాకిచ్చింది.