జైలు కాంప్లెక్స్‌లోనే తగిన ఏర్పాటు!
►ఆస్తుల కొనుగోలుదారులతో సహారా చీఫ్
►చర్చలపై ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ తన ఆస్తులను కొనుగోలు చేయాలనుకునేవారితో సంప్రదింపులు జరపడానికి వీలుగా తీహార్ జైలు కాంప్లెక్స్‌లో తగిన ఏర్పాటు చేయాలని ఢిల్లీ (ఎన్‌సీటీ) ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వ్యక్తిగతంగాకానీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానీ ఈ చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సూచించింది. ఈ విషయంపై వేదిక ఏర్పాటుకు జైలు అధికారులను సంప్రదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది.
కేవలం ఆస్తులు కొనుగోలుచేయాలనుకునే వారితో చర్చలకు మాత్రమే ఈ ఏర్పాట్లు జరగాలి తప్ప, రాయ్‌కి సౌకర్యవంతమైన ఏర్పాటు చేసేలా ఉండరాదని సైతం నిర్దేశించింది. జైలు కాంప్లెక్‌లోని గెస్ట్ హౌస్ లేదా కోర్ట్ రూమ్‌లో ఆస్తుల కొనుగోలుదారులతో సంప్రదింపులకు ఏర్పాటు చేసుకోవచ్చనీ సుప్రీంకోర్టు తెలిపింది. ఆయా అంశాలపై జూలై 30లోపు తమ స్పందనను తెలియజేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంతక్రితం రెగ్యులర్ బెయిల్ వీలుగా రూ.10,000 కోట్లు సమీకరణకు భారత్, విదేశాల్లోని తన ఆస్తుల విక్రయానికిగాను చర్చలకువారంపాటు తనను తీహార్ జైలు గెస్ట్ హౌస్‌కు మార్చాలని రాయ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.