విదేశీ హోటళ్ల విక్రయానికి డీల్ ఓకే
న్యూఢిల్లీ: న్యూయార్క్, లండన్‌లలోని తమ గ్రూప్ మూడు హోటళ్ల విక్రయానికి ఒక పార్టీతో ఒప్పందం కుదిరిందని సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టుకు గురువారం తెలిపారు. రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి ఒక బ్యాంక్ అంగీకరించిందని కూడా తెలిపారు. అయితే ఒప్పందాలపై సంతకాలు జరిగేంతవరకూ ఈ వివరాలను వెల్లడించలేనని విన్నవించారు.
కాగా చర్చల ప్రక్రియను కొనసాగించడానికి వీలుగా రాయ్ కోరిన విధంగా ఆగస్టు 15 నుంచి మరో 15 రోజుల పనిదినాలు తీహార్ జైలులోని కాన్ఫరెన్స్ రూమ్, చర్చలకు సంబంధించిన సౌలభ్యతలను వినియోగించుకోడానికి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది. దీనితో ఈ చర్చల ప్రక్రియకు మొత్తం 25 రోజుల సమయం ఇచ్చినట్లయ్యింది. అయితే ఇంతకుమించి గడువును పెంచే ప్రశ్నే ఉండబోదని స్పష్టం చేసింది. మదుపరుల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా రూ.24,000 కోట్ల వసూలు, వడ్డీసహా దాదాపు రూ.37,000 కోట్ల పునఃచెల్లింపుల వైఫల్యం కేసులో రాయ్ తీహార్ జైలులో ఐదు నెలలుగా ఉన్నారు.
రెగ్యులర్ బెయిల్ పొందడానికి వీలుగా రూ.10,000 కోట్లు చెల్లించడానికి ఆస్తుల అమ్మకానికి కోర్టు అనుమతించడంతో ప్రతిపాదిత కొనుగోలుదారులతో జైలు కాన్ఫరెన్స్ రూమ్‌లో చర్చలు జరుపుతున్నారు.
కాగా తన పారాబ్యాంకింగ్ డివిజన్‌కు చెందిన రెండు లక్షల మంది సభ్యుల ద్వారా రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల మేర (సభ్యునికి రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకూ) నిధుల సమీకరణకు ఒక ‘కాంట్రిబ్యూషన్ స్కీమ్’ను గ్రూప్‌లో ఒక ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీకే శ్రీవాస్తవ ప్రతిపాదించారు. అయితే ఇది ఒక వ్యక్తిగత చొరవ తప్ప, మేనేజ్‌మెంట్‌తో దీనికి సంబంధం లేదని సహారా ఇండియా ప్రతినిధి తెలిపారు.